టాలీవుడ్ లో క్లాసిక్ డే టైటిల్స్ ని రిపీటెడ్‌గా మన యంగ్ హీరోలు ఉపయోగించుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో మెగా హీరోల టైటిల్స్ ఎక్కువగా రిపీటెడ్‌గా ఉపయోగించడం గమనించదగినది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పలు బ్లాక్ బస్టర్ సినిమాల టైటిల్స్ రిపీటవుతుండడం చర్చగా మారింది. అయితే ఇలా మెగా టైటిల్ ని రిపీట్ చేయడం ద్వారా బాక్సాఫీస్ వద్ద లబ్ధి పొందాలనే ఆలోచన మంచిదే. అది తెలుగు సినిమా విజయాల శాతాన్ని పెంచితే అంతకు మించి ఇంకేమి కావాలి? కానీ టైటిల్ అనేది ఎంపిక చేసుకున్న కథకు తగ్గట్టు ఉండాలి. క్రియేటివ్ రంగంలో సక్సెస్ కోసం రకరకాల ఎత్తుగడలను అనుసరించడం సరైనదే కానీ.. కంటెంట్ అన్నిటి కంటే చాలా కీలకమనేది గ్రహించాలి.
తెలుగు సినిమా లెజెండ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన పలు బ్లాక్‌బస్టర్ చిత్రాల టైటిల్స్ ఇటీవల రిపీటెడ్ గా వినిపిస్తున్నాయి. చిరు టైటిల్స్ ని ఉపయోగించుకునే అవకాశం దక్కించుకున్న యువ హీరోలు, దర్శక నిర్మాతలు ఒకరకంగా అదృష్టవంతులు. చిరంజీవి సినిమా టైటిల్ ని ఉపయోగించుకుంటే, అది మెగాభిమానుల్లో పెద్ద చర్చగా మారుతుంది. దాని ప్రభావం బాక్సాఫీస్ కి కూడా అదనంగా కలిసి వస్తుంది. అయితే అంతిమంగా టైటిల్ తో పాటు కంటెంట్ తో మెప్పించడం చాలా ముఖ్యం. మెగాస్టార్ టైటిల్స్ లో రిపీటెడ్ గా ఉపయోగించుకున్న టైటిల్ ఖైదీ. చిరు కెరీర్ ని కీలక మలుపు తిప్పిన ఈ సినిమా టైటిల్ ని ప్రతిభావంతుడైన దర్శకుడు లోకేష్ కనగరాజ్ సద్వినియోగం చేసుకున్నాడు. కార్తీ ప్రధాన పాత్రలో అతడు రూపొందించిన ఖైదీ గ్రిప్పింగ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
చిరంజీవి నటించిన రుద్రవీణ (1988) ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. నేషనల్ అవార్డు అందుకుంది. మహానటి సావిత్రి భర్త జెమిని గణేషన్, శోభన వంటి దిగ్గజ తారలు ఈ చిత్రంలో నటించారు. రుద్రవీణ టైటిల్ ని 2022లో మధు సుధన్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం కోసం ఇటీవల తిరిగి ఉపయోగించారు.
మెగా బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంగ్ లీడర్ టైటిల్ ని నేచురల్ స్టార్ నాని సద్వినియోగం చేసుకున్నాడు. చిరంజీవి నటించిన 1991 చిత్రం గ్యాంగ్ లీడర్ క్రైమ్ యాక్షన్ జానర్లో వచ్చి సంచలన విజయం సాధించింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత 2019లో నాని చిత్రం కోసం ఈ టైటిల్‌ని మళ్లీ ఉపయోగించారు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ కూడా ఫర్లేదనిపించుకుంది. చిరు త్రిపాత్రాభినయం చేసిన ముగ్గురు మొనగాళ్లు 1994లో విడుదలైంది. ఈ టైటిల్ ని 2021లో తిరిగి ఉపయోగించుకున్నారు. అభిలాష్ రెడ్డి ఈ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించారు.
చిరంజీవి కథానాయకుడిగా 1986 లో విజయ బాపినీడు దర్శకత్వం వహించిన చిత్రం మగధీరుడు. ఇందులో జయసుధ కథానాయిక. శ్యాంప్రసాద్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించింది. అయితే ఇదే సౌండింగ్‌తో రామ్ చరణ్ సినిమా మగధీర 2009లో వచ్చి సంచలన విజయం సాధించింది. మగధీర లాంటి పవర్ ఫుల్ టైటిల్ ని ఎంచుకుని దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అసాధారణ మ్యాజిక్ చేసాడు. ఆసక్తికరంగా ఈ సినిమాలో చిరు తనయుడు రామ్ చరణ్ నటించారు. చరణ్ కి కెరీర్ రెండో సినిమానే అయినా మగధీర బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను రాబట్టింది. ఒకే టైటిల్ తో ఫ్యామిలీ హీరోల సినిమాలు ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసిక్ హిట్ మూవీ రాక్షసుడు టైటిల్ ని రీమేక్ కోసం నేటితరం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఉపయోగించుకున్నాడు. తమిళ హిట్ మూవీకి రీమేక్ గా వచ్చిన రాక్షసుడు (2019) బెల్లంకొండ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. చిరంజీవి నటించిన రాక్షసుడు విడుదలై ఇప్పటికే 35 ఏళ్లు పూర్తయింది.
తమిళ స్టార్ హీరో విజయ్ మాస్టర్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదే టైటిల్ తో 1997లో చిరంజీవి నటించిన సినిమా విడుదలై విజయం సాధించింది. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత. చిరంజీవి 1981 చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు టైటిల్‌ను 2022లో శర్వానంద్ ఉపయోగించుకున్నాడు. చిరంజీవి నటించిన 1981 సినిమా శ్రీరస్తు శుభమస్తు టైటిల్ ని అల్లు శిరీష్ ఉపయోగించుకున్నారు. శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు (2016) కూడా విజయం సాధించింది. 2019లో జ్యోతికతో కలిసి నటించిన సినిమా కోసం కార్తీ దొంగ అనే టైటిల్ ఉపయోగించుకున్నారు. ఇది చిరంజీవి నటించిన క్లాసిక్ హిట్ చిత్రం దొంగ గురించి చర్చించుకునేలా చేసింది. చిరంజీవి హీరో టైటిల్‌ను నితిన్ 2020లో తన సినిమా కోసం తిరిగి ఉపయోగించాడు. చిరంజీవి విజేత టైటిల్‌ను కళ్యాణ్ దేవ్ 2018లో తాను నటించిన సినిమా కోసం తిరిగి ఉపయోగించాడు. చిరంజీవి నటించిన క్లాసిక్ హిట్ చిత్రం యముడికి మొగుడు టైటిల్‌ను అల్లరి నరేష్ తన 2012 సినిమా కోసం తిరిగి ఉపయోగించాడు. హీరో శివాజీ స్టేట్ రౌడీ అనే చిత్రంలో నటించాడు. ఇది చిరంజీవి హీరోగా బి గోపాల్ తెరకెక్కించిన స్టేట్ రౌడీ (1989) సినిమాను గుర్తు చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి టైటిల్స్ తిరిగి రిపీటయ్యాయి. పవన్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్‌ను యాంకర్ ప్రదీప్ తాను నటించిన సినిమా కోసం ఉపయోగించుకున్నాడు. ఏప్రిల్ 11న విడుదలైంది. పవన్ నటించిన కల్ట్ క్లాసిక్ తొలిప్రేమ (1998) టైటిల్ ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఉపయోగించుకున్నాడు. వరుణ్ నటించిన తొలి ప్రేమ (2018) కూడా విజయం సాధించింది. పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు మూవీ టైటిల్ ఇప్పుడు రిపీటవుతోంది. 1999లో వచ్చిన తమ్ముడు యాక్షన్, స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వచ్చింది. పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అయిన యూత్ స్టార్ నితిన్ అదే టైటిల్‌తో వేణు శ్రీరామ్ రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ఖుషి (2001) టైటిల్ ని విజయ్ దేవరకొండ ఉపయోగించుకున్నాడు. ఖుషి పవన్ కెరీర్ లో భారీ హిట్ చిత్రం. దేవరకొండ కూడా ఈ టైటిల్ తో యావరేజ్ విజయం అందుకున్నాడు.
మెగా బ్రాండ్ ఉన్న టైటిల్స్ ని తిరిగి ఉపయోగిస్తే, అది ప్రచారం పరంగాను కలిసొస్తుంది. మెగా అన్న పదమే సూపర్ పవర్. అయితే నేటితరం హీరోలు మెగా టైటిల్స్ ని ఉపయోగించుకున్నా, కథ కంటెంట్ పరంగా జాగ్రత్త వహించకపోతే విజయాలు అందుకోవడం సాధ్యపడదు. అయితే పరిశ్రమ అగ్ర హీరోలు చిరంజీవి, పవన్ టైటిల్స్ ని ఉపయోగించుకోవడం ద్వారా యువహీరోలు వారిని గౌరవిస్తూ నిజమైన నివాళిని అర్పించినట్టే.
శర్వానంద్ తన తదుపరి చిత్రం కోసం నందమూరి బాలకృష్ణ ల్యాండ్ మార్క్ 50వ చిత్రం నారి నారి నడుమ మురారి టైటిల్ ను తిరిగి ఉపయోగించుకుంటున్నాడు. ఎన్బీకే సరసన ఇద్దరు నాయికలు నటించగా, ఇప్పుడు శర్వా సరసన కూడా ఇద్దరు భామలను ఎంపిక చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.