2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. 2024 ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన చంద్రబాబు, పవన్, బీజేపీ లు వాటిని కలిసి కట్టుగా నెరవేరుస్తున్నాయి. ఎన్నికలు ముగియగానే ఏప్రిల్ నుంచే పెన్షన్ పెంచి అది జూన్ లో అందించిన ఏకైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. జగన్ ప్రభుత్వంలో ఖాళీ ఖజనాని, అప్పుల కుప్పతొ రాష్ట్రాన్ని అప్పగించినప్పటికీ.. చంద్రబాబు అనుభవంతో సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు న్యాయం చేస్తున్నారు.
అందులో భాగంగా దీపావళికి దీపం పథకం కింద సిలిండర్ పథకాలను అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం తాజాగా మరో తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. గతంలో జగన్ ప్రభుత్వం అమ్మవడి కింద ఈ పథకం అమలు చేసినప్పటికీ.. ఇంట్లో ఉన్న ఒక్క విద్యార్థికి మాత్రమే ఈపథకం వర్తించింది.
తల్లికి వందనం.. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసహాయాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఈ పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15 వేలు అందిస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికి ఈ పథకం వర్తింపజేయనున్నారు.
ఈ పథకం విద్యార్థుల చదువుకు సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో రూపొందించారు. విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్స్ ఇతర ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఈ డబ్బులు వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.