విభిన్న తరహా చిత్రాలతో తన అభిమానులను, సినీ ప్రేమికులను అలరించేందుకు అవిశ్రాంతంగా వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్ళడం రవితేజకు అలవాటు. ఇప్పుడు, ఆయన తన కెరీర్‌లో 75వ చిత్రం మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమయ్యారు.
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని రవితేజ ల్యాండ్‌మార్క్ చిత్రం ప్రకటన వచ్చింది. ఇది రవితేజ శైలిలో ఉండే మాస్ ఎంటర్టైనర్. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తేనే, ఈ సినిమా దావత్ లా ఉండబోతుందనే అభిప్రాయం కలుగుతోంది.
భారీస్థాయిలో నిర్వహించబడుతున్న ఊరి జాతరను చూపిస్తూ, సృజనాత్మకంగా రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. రవితేజ 75వ చిత్రం అని తెలుపుతూ కళ్ళద్దాల మీద RT 75 అని రాయడం బాగుంది. అలాగే పోస్టర్ మీద రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి, హ్యాపీ ఉగాది రా భయ్ అని తెలంగాణ యాసలో రాసి ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు లక్ష్మణ భేరి అని తెలిపిన మేకర్స్.. ఈ పాత్ర తీరు ఎలా ఉండబోతుందో కూడా ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. ఆదాయం: చెప్పను తియ్.. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసుకొచ్చిన తీరు భలే ఉంది.