Advertisement
Google Ads BL

అక్కినేని 10 వర్ధంతి: ఆయన నేర్పిన తొలి పాఠం


తెలుగు సినిమా రంగంలో అక్కినేని నాగేశ్వర రావుది ఓ స్ఫూర్తినిచ్చే చరిత్ర. జీరో నుంచి హీరోగా ఎదిగిన మహా నటుడు అక్కినేని నాగేశ్వర రావు 1931లో తెలుగు సినిమా టాకీ ప్రారంభమైతే పది సంవత్సరాల తరువాత అక్కినేని శ్రీ సీతారామ జననం చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. అప్పటికి ఆయన వయసు 20 సంవత్సరాలు. 1944 లో మొదటి సినిమా  శ్రీ సీతారామ జననం నుంచి 2014లో మనం వరకు అంటే 70 సంవత్సరాల పాటు నటుడుగా కొనసాగారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 255 చిత్రాల్లో నటించారు. 

Advertisement
CJ Advs

అక్కినేని నాగేశ్వర రావు 1977 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ ను స్వీకరించారు. 1968 లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, 1988 లో  భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్, 2011లో భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్, మధ్య ప్రదేశ్  ప్రభుత్వం నుంచి కాళిదాస్ సమ్మాన్, 1980లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, 1991లో కేంద్ర ప్రభుత్వం నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 1996లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ జాతీయ పురస్కారంలాంటి ఎన్నో అవార్డులు అక్కినేనిని వరించాయి. 

అక్కినేని చేయని పాత్ర లేదు, సాధించని విజయాలు లేవు. 1977లో నేను వెండితెర అనే సినిమా వార పత్రికలో రిపోర్టర్ గా చేరాను. ఆ సంవత్సరం దివి సీమలో ఉప్పెన వచ్చింది. వందలాది మంది చనిపోయారు, వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఆపదలో వున్న ప్రజలను ఆదుకోడానికి ఎన్. టి. ఆర్, ఏ. ఎన్. ఆర్ ప్రజల నుంచి విరాళాలు వసూలు చెయ్యడానికి నిర్ణయించారు. ఆ సందర్భంగా రామకృష్ణ స్టూడియోస్ లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ లోనే రామారావు గారు, నాగేశ్వర రావు గారితో మొదటిసారి పరిచయం ఏర్పడింది. 1979లో నేను ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వారపత్రికలో చేరాను. అప్పటి నుంచి నాగేశ్వర రావు గారిని, రామారావు గారిని తరచూ కలిసే అవకాశం ఏర్పడింది. 

అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ సారధి స్టూడియోస్ లో సినిమా షూటింగులు ఎక్కువ జరిగేవి. అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళినప్పుడల్లా నాగేశ్వర రావు గారిని కలసి జ్యోతి చిత్ర పత్రిక ఇచ్చేవాడిని. అందులో వారిని గురించి నేను వ్రాసిన ఆర్టికల్స్, న్యూస్ ఉండేవి. కొన్నాళ్ళకు ఆయన నన్ను ప్రత్యేకంగా చూడటం, అభిమానించడం మొదలు పెట్టారు. నటి నటులను స్టడీ చేసి వారి మనస్తత్వాన్ని బట్టి, వారి మనసు నొప్పించకుండా, నాకు కావలసిన ఇంటర్వ్యూ లు చేస్తుండేవాడిని. అలా నాగేశ్వర రావు గారికి దగ్గరయ్యాను. 

1980లో జ్యోతి చిత్ర పాఠకుల ప్రశ్నలకు వారు సమాధానాలు ఇవ్వడానికి అంగీకరించారు. మాకు వచ్చిన ఉత్తరాల్లో అర్హమైనవి ఎంపిక చేసి వాటిని నాగేశ్వర రావు గారి దగ్గరకు తీసుకెడితే ఆయన సమాధానాలు ఇస్తారు. ఆయన అప్పుడు బంజారాహిల్స్ లో ఉండేవారు. మా ఆంధ్ర జ్యోతి కార్యాలయం సెక్రటేరియట్ ఎదురుగా మేడ మీద ఉండేది. ఎక్కడికి వెళ్లాలన్నా ఆటో లేదా రిక్షా లో వెళ్ళాల్చిందే. ఎందుకంటే నాకు వాహనం లేదు. బంజారా హిల్స్ అంటే తప్పనిసరిగా ఆటో మీద వెళ్ళాలి. ఆరోజుల్లో ఆటోలు వెంటనే దొరికేవి కాదు. ఒకవేళ దొరికినా బంజారా హిల్స్ అంటే వచ్చేవారు కాదు. నాగేశ్వర రావు గారు చెప్పిన సమయానికి 20 నిముషాలు ఆలస్యంగా వారి ఇంటికి వెళ్ళాను. అప్పటికే వారు ఆఫీసులో కూర్చొని నా కోసం వేచి చూస్తున్నారు. సారీ అని చెబుతూ లోపకు ప్రవేశిస్తున్నా, ఆయన కోపంతో మీకసలు టైమ్ సెన్స్ ఉందా.. మీ కోసం నేను 20 నిమిషాల నుంచి ఈ సీట్లో కూర్చున్నాను. నా టైమ్ వృధా చేశారు. జీవితంలో క్రమశిక్షణ, సమయ పాలన చాలా ముఖ్యం. ఆ రెండు ఉన్నవాడే పైకి వస్తాడు, విజయాలు సాధిస్తాడు. అని చాలా కటువుగా మాట్లాడారు. ఆయన మాటలకు నాకు భయమేసింది. గొంతు తడారిపోయింది. మౌనంగా క్రిందకు చూస్తూ నుంచున్నాను. ఆ తరువాత కొంత సేపటికి ఆయన సరే కూర్చోండి అన్నారు. 

ఆ తరువాత ఉత్తరాలు నేను చదువుతుంటే, ఆయన చెప్పే సమాధానాలుచెబుతుంటే వ్రాసుకునేవాడిని. ఒక గంట తరువాత అక్కినేని కుర్రోడిని పిలిచి కాఫీ తెప్పించారు. వెళ్ళేటపుడు నేను ఆటో దొరకపోవడం వాళ్ళ సకాలానికి రాలేకపోయానని చెప్పి మరోమారు క్షమించండి, మరోసారి ఆలస్యంగా రాను అని చెప్పాను. ఆ రోజు నాగేశ్వర రావు గారి నుంచి నేను నేర్చుకున్న తొలి విలువైన పాఠం. ఎవరైనా పలానా సమయానికి రండి అంటే ఐదు నిముషాలు ముందే వుంటాను. అక్కినేని చెప్పిన ఆ మాటలు జీవితమంతా గుర్తున్నాయి. 

ఆ తరువాత నాగేశ్వర రావు గారికి అత్యంత సిన్నిహితమైన జర్నలిస్టును కాగలిగాను. చాలా సందర్భాల్లో వారి ఇంట్లో సాయంత్రాలు రమ్మని ఆహ్వానించేవారు. అక్కినేనితో ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు వున్నాయి. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. 1980లో నా మొదటి కవితా సంపుటి  మానవత కు ఒక కవిత వ్రాసి ఆశీర్వదించారు. 1987 లో మా వివాహానికి వచ్చి మా దంపతులను ఆశీర్వదించారు. మా ఇద్దరు పిల్లలకు జూబిలీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో సీట్లు ఇప్పించారు. 

ఈరోజు అక్కినేని నాగేశ్వర రావు గారి 10 వర్ధంతి. చదువు, సంస్కారం లేని ఓ పల్లెటూరి అబ్బాయి సినిమా రంగంలోనే కాదు, మిగతా రంగాల్లో కూడా అఖండమైన ప్రజ్ఞ, అమోఘమైన పరిణితీ సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన అవమానాలు, అవహేళనలను తట్టుకొని, మనీషిగా ఎదిగి ఒదిగిన మహోన్నత నటుడు, అద్వితీయమైన వ్యక్తి అక్కినేని నాగేశ్వర రావు. 1924 సెప్టెంబర్ 20న గుడివాడ మండలం రామాపురంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు ఐదవ సంతానంగా జన్మించారు. 2014 జనవరి 22న హైద్రాబాద్ లో 90వ ఏట ఇహలోక యాత్ర ముగించారు. నటుడుగా, వ్యక్తిగా అక్కినేని ఎప్పుడూ ప్రాతః కాల స్మరణీయులే. 

-భగీరథ.✍️

Today is ANR 10th death anniversary:

Akkineni continued as an actor for 70 years
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs