నేడు సూర్యకాంతం శత జయంతి
గయ్యాళి అనగానే మనకు గుర్తుకొచ్చే నటి సూర్యకాంతమ్మ. తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చెరగని, తరగని రూపం ఆమెది. తెరపైన గయ్యాళి పాత్రలను అద్భుతంగా పోషించే సూర్యకాంతమ్మ లో మానవతా కోణం కూడా ఉందని చాలా మందికి తెలియదు. ఆపదలో వున్నవారిని ఆర్ధికంగా ఆదుకునే మంచి నటి సూర్యకాంతమ్మ. సినిమా రంగంలో అందరు అభిమానిగా, ఆత్మీయంగా అమ్మా అని పిలుస్తారు.
సూర్యకాంతమ్మ, తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలోని వెంకటకృష్ణరాయ పురం గ్రామంలో పొన్నాడ అనంతరామయ్య, శ్రీమతి వెంకట రత్నమ్మ దంపతులకు 14వ సంతానంగా 28 అక్టోబర్ 1924న జన్మించారు.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు, అందుకు నిదర్శనం సూర్యకాంతం. ఆరు సంవత్సరాల లేత ప్రాయంలోనే పాడటం, నృత్యం చేయడం మొదలు పెట్టింది. సినిమాలు చూస్తూ పెరిగిన సూర్యకాంతం లో నటిని కావాలన్న కోరిక బలంగా పెరుగుతూ వచ్చింది. తల్లితండ్రులు కూడా కుమార్తె ను ప్రోత్సహించారు.
1944వ సంవత్సరం ఆమె మద్రాసు మహానగరంలో అడుగుపెట్టారు. అప్పుడామె వయసు 20 సంవత్సరాలు. కథానాయికకు కావలసిన అర్హతలు అన్ని ఆమెకు వున్నాయి. అయినా, అవకాశం ఇచ్చే వారు లేకపోడంతో జెమినీ స్టూడియోస్ ను ఆశ్రయించింది. అక్కడ నెల జీతానికి కుదిరింది. అయితే అక్కడ ఆమె ఎక్కువ కాలం ఇమడలేక పోయింది. బయటికి వచ్చాక ఎల్.వి. ప్రసాద్, భానుమతి నటించిన గృహా ప్రవేశం సినిమాలో చిన్న పాత్రలో నటించడానికి అవకాశం వచ్చింది.
సూర్యకాంతం ను చూసిన నిర్మాత దర్శకుడు కడారు నాగభూషణం తాము నిర్మిస్తున్న సౌదామిని సినిమాలో కథానాయికగా అవకాశం ఇస్తామన్నారు. అక్కినేని నాగేశ్వర రావు కథానాయకుడు. అది కన్నాంబ స్వంత సంస్థ. ఆమె భర్తే నాగభూషణం. అదృష్టం అలా సమీపానికి వచ్చినా దురదృష్టం ఆమెను వెన్నాడింది. అదే సమయంలో ఆమెకు కారు యాక్సిడెంట్ అయ్యింది. అది ఆమెకు వరంగా మారి ఆమె నట జీవితానాన్ని అనూహ్యమైన మలుపు తిప్పిందని చెప్పవచ్చు.
ఆ తరువాత 1946లో నారద నారది సినిమాలో సహాయ పాత్ర లభించింది. అయితే ఆ తరువాత మూడు సంవత్సరాలపాటు మంది పాత్రల కోసం నిరీక్షించవలసి వచ్చింది. 1949లో ధర్మాంగద, 1950లో సంసారం, 1952లో దాసి చిత్రాల్లో సహాయ పత్రాలు లభించాయి. సరిగ్గా అప్పుడే సూర్యకాంతం, నటిగా ఎంతటి సమర్ధవంతమైనదో సినిమా రంగానికి తెలిసింది. ప్రేక్షకులు కూడా ఆమె నటిస్తుంటే శాపనార్ధాలు పెట్టేవారు, ముఖ్యంగా మహిళలు ఆమెను అసహ్యించు కొనేవారు, అవే ఆమె నట జీవితానికి దీవెనలుగా మారాయి.
1950లో హైకోర్ట్ జడ్జి పెద్దిభోట్ల చలపతి రావును వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. అనంత పద్మనాభ మూర్తిని దత్తత చేసుకున్నారు. 1962లో నాగిరెడ్డి, చక్రపాణి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించిన గుండమ్మ కథ చిత్రం ఆమె నటించిన పాత్ర పేరుతో రూపొందిందే. ఈ సినిమాలో ఎన్. టి. ఆర్, ఏ.ఎన్.ఆర్, ఎస్వి.ఆర్, సావిత్రి, జమున నటించిన సినిమాకు గుండమ్మ కథ అని పేరు పెట్టడం సూర్యకాంతం ప్రతిభకు, స్టార్ డమ్ కు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?
1946 నుంచి 1994 వరకు సూర్యకాంతం, దొంగ రాముడు, మాయాబజార్, తోడికోడళ్లు, వెలుగు నీడలు, కలసివుంటే కలదు సుఖం, మంచి మనసులు, రక్త సంబంధం, నర్తనశాల, చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, ఆస్తిపరులు, సుఖ దుఃఖాలు, ఉమ్మడి కుటుంబం, బుద్దిమంతుడు, దసరా బుల్లోడు, కాలం మారింది, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, సెక్రటరీ, గోరంత దీపం, కార్తీక దీపం, చుట్టాలున్నారు జాగ్రత్త మొదలైన సినిమాల్లో చిరస్మరణీయమైన పాత్రలను పోషించారు. ఆమె ఆంగికం, వాచకం, అభినయం ఈ మూడు సూర్యకాంతం కు పెట్టని ఆభరణాలు. అవి విలక్షణంగా ఆమెకు కీర్తిని సంపాదించి పెట్టాయి.
సూర్యకాంతం తెరపై ఎంత గయ్యాళి పాత్రలను పోషించిందో, తెర వెనుక అంతటి సౌమ్యురాలు. ఎంతఎదిగినా ఒదిగి వుండే గుణం ఆమెలో జర్నలిస్టుగా నేను ప్రత్యక్షంగా చూశాను. ఆమె వ్యక్తిత్వం ఎంత విలక్షణమైనదో తెలియజేస్తాను. 1982 నాటి సంగతి. అప్పుడు నేను ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా పత్రికలో హైదరాబాద్ రిపోర్టర్ గా పనిచేవాడిని. మా కార్యాలయం సచివాలయం ఎదురుగా మేడ మీద ఉండేది. అప్పట్లో సినిమా నటీనటులు లకడీకపూల్ లో వున్న అశోక హోటల్లో ఎక్కువగా బస చేసేవారు.
సారధి స్టూడియోస్ లేదా అన్నపూర్ణ, పద్మాలయాకు సినిమా షూటింగులకు వెళ్లాలంటే ఆటోవాలాలు వచ్చేవారు కాదు. అందుకే ప్రొడక్షన్ మేనేజర్ కు ఫోన్ చేస్తే కారు పంపించేవారు. మా జ్యోతి చిత్ర పత్రిక కవరేజ్ కోసం సారధి స్టూడియోస్ నుంచి కారు పంపిస్తూ వచ్చేటప్పుడు అశోకలో సూర్యకాంతమ్మ వున్నారు, ఆమెను ఎక్కించుకొని రమ్మని ప్రొడక్షన్ మేనేజరు చెప్పాడు. నేను సరేనన్నాను. అశోక హోటల్ కు వెళ్ళగానే ఆమె, ఒక సహాయకురాల క్రింద రెడీగా వున్నారు. అప్పుడు నేను ముందు సీట్లో కూర్చున్నాను. ఆమె వెనుక సీట్లో కూర్చొని, నన్ను వెనక్కు రమ్మని, సహాయకురాలిని ముందు సీట్లో కూర్చోమన్నది. ఆ మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఆర్టిస్టులు తమ ప్రక్కన కూర్చోమని జర్నలిస్టులను ఆహ్వానించరు, అందునా లేడీ ఆర్టిస్టులు అలాంటి అవకాశమే ఇవ్వరు. జనలిస్టులంటే నాకు గౌరవం బాబు, మా గురించి పత్రికల్లో వ్రాసి మాకు ఇమేజ్ ని తెచ్చిపెట్టేది మీరేగా, మిమ్మల్ని గౌరవంగా చూడ ల్చిన బాధ్యత మాది అన్నారు. ఆమె ఆత్మీయమైన మాటలు ఆమెపట్ల గౌరవాన్ని పెంచాయి.
ఇక మధ్యాహ్నం లంచ్ సమయంలో తన వెంట తెచ్చిన పులిహోర, మామిడికాయ పచ్చడి అందరికీ పంచి పెట్టె అలవాటు వుంది. ఆరోజున కూడా ప్రధాన నటీనటులు సాంకేతిక నిపుణులు ఆమె చుట్టూ చేరారు. నన్ను కూడా రాముని పిలిచింది. అందరూ ఆమెను సూర్యకాంతమ్మ అని ప్రేమగా పిలవడం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆరోజు ఆమె స్వయంగా చేసిన పులిహోర, మామిడికాయ పచ్చడి రుచి చూసే అవకాశం అదృష్టం కలిగింది.
1988 జులై 25న నేను భాగ్యనగర్ స్టూడియోస్ కు సినిమా కవరేజ్ కోసం వెళ్ళాను అక్కడ సూర్యకాంతమ్మ నను గుర్తుపట్టి నవ్వుతూ రా.. బాబు అని ఆహ్వానించింది. ఆ సెట్లో ఆమెతో పాటు నిర్మాత సీతాదేవి, వరలక్ష్మి వున్నారు. ఒక సీరియల్ కోసం ఆమె చెన్నయ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. నేను వెళ్లి ఆమెకు నమస్కరించాను. ఆమె నమస్కరించి ఎలా వున్నావు బాబు, రా అన్నది. అయితే అక్కడ నాకు మరో కుర్చీలేదు. అందుకే అలాగే నుంచుండి పోయాను. రా.. బాబు అని తను కూర్చున్న సోఫాలో జరిగి నాకు చోటు ఇచ్చింది. ఆమె సంస్కారానికి, నిరాడంబరత్వానికి, నిర్మలత్వానికి మరింత ఆశ్చర్యమేసింది. అంతేకాదు నాతో పాటు వచ్చిన ఫోటోగ్రాఫర్ తో అబ్బాయ్, మమ్మల్ని ఒక ఫోటో తియ్యి అని ఆజ్ఞాపించింది. మీరు చూస్తున్నది ఆనాటి ఫోటోనే. ఆమె వ్యక్తిత్వం మహోన్నమైన, మానవతా గుణానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?
సూర్యకాంతమ్మ డిసెంబర్ 17, 1996లో ఇహలోక యాత్ర చాలించారు. అయినా తెలుగు లోగిళ్ళలో ఆమె నటించిన చిత్రాల ద్వారా గయ్యాళి అత్త గా రోజు టీవీల్లో కనిపిస్తూనే వున్నారు. ఆమె విలక్షణమైన, విభిన్నమైన నటనతో సదా మనకు దర్శనం ఇస్తున్నారు.
ఈరోజు 28 అక్టోబర్ ఆమె శతాబ్ది సంవత్సరం. ఆ మహానటిని గుర్తు చేసుకోవడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది. తెలుగు సినిమా వెలుగులు విరజిమ్మినంత కాలం సూర్యకాంతం జాతి స్మృతి పథంలో నిలిచే వుంటారు.
-భగీరథ, సీనియర్ జర్నలిస్ట్.