Advertisement

మోడీకి లేఖ రాసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్


ప్రధాని నరేంద్ర మోడీ గారు,

Advertisement

నమస్కారం.. 

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో  ఏం జరుగుతుందో  గమనించరా!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిన మాట మీకు తెలియనిది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మీ పార్టీ సైతం మద్దతు ఇచ్చింది. తరువాత పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అని ప్రకటించినప్పుడు కూడా మీ పార్టీ సైతం మద్దతు పలికింది.  

రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పై  సీమాంధ్రులకు ఎలాంటి అభిప్రాయం ఉందో, అందుకు సహకరించిన మీ పార్టీపైనా అదే అభిప్రాయం ఉంది. అయితే 2014 ఎన్నికల్లో మీరు కొన్ని సీట్లు, కొన్ని ఓట్లు సంపాదించగలిగారంటే అందుకు కారణం ఒకే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ  జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం!

అప్పుడే కాదు, మీ పార్టీ పాలనకు పునాది వేసిన ఘనమైన అటల్ బిహారీ వాజ్ పేయి గారి  పాలనను ఓ సారి గుర్తు తెచ్చుకోండి. అంతకు ముందు అదే వాజ్ పేయి ప్రభుత్వం 13 రోజులకు ఓ సారి, 13 నెలలకు మరోసారి పతనమైంది. వాజ్ పేయి ప్రభుత్వం పూర్తి కాలం సాగేలా చేసిన ఘనత ఆ నాడు యన్.డి.ఏ.కు కన్వీనర్ గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఈ విషయం తెలుగు నేలపైనే కాదు, యావత్ భారతావని కీ తెలుసు. ఆ నాడు వాజ్ పేయి ప్రభుత్వం ఫుల్ టెర్మ్ కొనసాగబట్టే, తరువాతి రోజుల్లో మీ పార్టీ బలోపేతం మయింది. తరువాత జాతీయ స్థాయికి మళ్ళీ చేరుకుంది. 

1999 -2004 మధ్యకాలంలో వాజ్ పేయి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎన్నిసార్లు దాడి చేసినా, ప్రతీసారి వాటిని ఎదుర్కోవడంలో బాసటగా నిలచింది ఒకే ఒక్క చంద్రబాబు నాయుడే గారే. ఇవన్నీ మీకు తెలియనివి కావు. అందుకే మీ పార్టీ పెద్దలు నమ్మదగ్గ స్నేహితుడు అని చంద్రబాబును కీర్తించినప్పుడు ఆయనతో కలసి 2014 ఎన్నికల్లో సాగారు. చంద్రబాబుతో జోడీ కట్టడంతోనే మీ పార్టీకి కొన్ని ఓట్లు, సీట్లు దక్కాయి. అదే  2019 ఎన్నికల్లో మీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని ఓట్లు సంపాదించిందో గుర్తు తెచ్చుకోండి. 

యన్.డి.ఏ.కు కన్వీనర్ గా ఓ వెలుగు వెలిగి, జాతీయ స్థాయిలో మీ కంటే ముందే గుర్తింపు సంపాదించుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగానూ మీ కంటే సీనియర్. 1996 ప్రాంతంలో దేవెగౌడ కంటే ముందే ప్రధాని పదవి ఆయన దగ్గరకు వచ్చినా, దానిని కాదనుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికే పరిమితమయ్యారు. 

నేడు అందరూ వేనోళ్ళ కొనియాడుతున్న సాంకేతికాభివృద్ధిని పరిచయం చేశారు. టెక్నాలజీతో పయనిస్తూ, భావితరాలకు టెక్నాలజీ గొప్పతనాన్ని చాటుతూ హెటెక్ సీయమ్ అనీ కీర్తిని సంపాదించారు. ఇక మీరు ప్రధానిగా ఉన్న సమయంలో తన సీనియారిటిని పక్కన పెట్టి, విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంకితమయ్యారు. కాంగ్రెస్ తో కలసి, పార్లమెంట్ సాక్షిగా మీ పార్టీ సైతం మద్దతు పలికిన ‘ప్రత్యేక హోదా’ను పక్కకునెట్టి ప్రత్యేక ప్యాకేజ్ అంటూ మీరు ప్రతిపాదించగా, రాష్ట్రానికి మేలు జరుగుతుందనే నమ్మకం తో దానికి అంగీకరించారు.  మీతో  అమరావతి రాజధానికి శంకుస్థాపన చేయించారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఇందుకు మీ పాత్ర లేదంటారా ?

మీతో స్నేహహస్తం చాచిన చంద్రబాబును తనకు తాను కూటమి నుండి బయటకు వెళ్ళేలా పథక రచన చేశారు. 

జాతీయ స్థాయి నాయకుడైన చంద్రబాబు కేవలం తన రాష్ట్ర అభివృద్ధి కోసమే తన ప్రాభవాన్ని సైతం పరిమితం చేసుకొని పాటుపడుతూ ఉంటే, సీమాంధ్రులకు మీరు స్వయంగా ఇచ్చిన మాటను సైతం మరచి, చంద్రబాబును నెట్టేశారు. 

ఓటమిపాలయినా, చంద్రబాబు నిరంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పాటుపడుతూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజా పక్షం వైపే నిలిచారు, ప్రజాక్షేమమే అని తలచారు. అలాంటి చంద్రబాబు నాయుడును, ఆయన కుటుంబసభ్యులను సాక్షాత్తు శాసనసభ సాక్షిగా అగౌరవపరచినా, మీరు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీని కానీ, అక్కడ పరిస్థితులు చక్కదిద్దడానికి కానీ పూనుకోలేదు. ఏ నాడూ దేనికీ చలించని చంద్రబాబు నాయుడు తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న దృశ్యం తెలుగువారిని కలచి వేసింది. మరి ఇప్పుడు అంతకంటే ఊహించని ఘటన తెలుగువారి మనస్సును బాధించింది. అందుకు కారణం పైకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కనిపిస్తున్నా, వారికి అడుగడుగునా సహకరిస్తున్నది మీరే అన్న విషయం తెలుగువారందరికీ తెలుసు. 

తన రాష్ట్ర అభివృద్ధి కోసం తాను పాటు పడుతూ, 73 ఏళ్ళ వయసులోనూ ఊరూరా తిరుగుతూ తన పార్టీ కోసం ప్రచారం చేసుకుంటున్న నారా చంద్రబాబు నాయుడును స్కిల్డ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కుంభకోణంలో అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అన్యాయం, అక్రమం. నిజానికి ఆ కేసులో మొదట చంద్రబాబు పేరే లేదు. తరువాత ఆయనను ఏ-37గా పేర్కొన్నారు. అరెస్ట్ చేశాక ఏకంగా ఏ-1గా చిత్రీకరించారు. ఆధారాలు లేకున్నా, కోర్టుకు వాటిని చూపించే శక్తిలేక పోయినా, అగ్రిమెంట్ లో చంద్రబాబు చేసిన సంతకాలను సాక్ష్యంగా చూపిస్తూ, ఆయన డబ్బు కొట్టేశారని ప్రచారం సాగిస్తున్నారు. ఇది హేయమైన చర్య అయితే, ఇక చంద్రబాబును అరెస్ట్ చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిన తరువాత పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉందని తెలుగువారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  అందుకే జనం స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ నినదిస్తున్నారు.  

నిజానికి చంద్రబాబు లాంటి జాతీయ స్థాయి నాయకుడిని, అందునా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే విధానంలో ప్రభుత్వం పాటించలసిన విధానాలేవీ అనుసరించలేదు. మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో గవర్నర్ లేదా హైకోర్టు ఛీఫ్ జస్టిస్ అనుమతి ఉండాలన్న నిబందనను ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించక పోవడం గమనార్హం! చంద్రబాబు నాయుడు ఎక్కడికీ పారిపోరు, పైగా విచారణకు సహకరిస్తాననీ అన్నారు. సోక్రటీస్ వాదాన్ని అనుసరిస్తూ – ఒకప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తానే చట్టాన్ని గౌరవించక పోతే ఎలా అంటూ అరెస్ట్ అయ్యారు. అడుగడుగునా జనం అడ్డుపడ్డా, వారికి నచ్చచెప్పి తాను చట్టాన్ని గౌరవించారు. 

చంద్రబాబు నాయుడును ఒకప్పుడు హై టెక్ సీయమ్ అంటే నవ్వుకున్నవారు సైతం నేడు దేశవిదేశాల్లోని టెకీస్ అందరూ ఆయనకు మద్దతు పలకడం చూసి నివ్వెరపోతున్నారు. చంద్రబాబు హె టెక్ అని అంగీకరిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబును ఎంతగానో తూలనాడిన కాంగ్రెస్ వారు సైతం ఆయన అరెస్ట్ ను ఖండించారు. వ్యక్తిగతంగా ఆయనకు మద్దతు పలికారు. అలాంటిది మీ పెద్దలు నమ్మకమైన స్నేహితుడు గా భావించే నారా చంద్రబాబుకు ఇంత జరిగినా, మీరు ఏమీ పట్టనట్టు ఉండడం మమల్ని మరింత బాధిస్తుంది . 

రాజమండ్రి  జైలులో చంద్రబాబుకు వి.ఐ.పి ట్రీట్ మెంట్ కల్పిస్తామంటున్న జైలు అధికారులు, కనీసం వేడినీళ్ళ కూడా ఆయన స్నానానికి  ఏర్పాటు చేయలేకపోయారు. మీ కంటే వయసులో పెద్దవాడు, 73 ఏళ్ళ వయసులో ఉన్న చంద్రబాబుకు  చన్నీటి స్నానమే చేస్తూ, దోమలు కుడుతున్నా, ఏ తప్పూ చేయకపోయినా అన్నీ భరిస్తున్నారు. ఇక వారానికి మూడుసార్లు ములాఖత్ కు అవకాశం ఉన్నా, చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరిని జైలు అధికారులు లోపలకు  అనుమతించక పోవడం ఏమిటి? ఈ విషయాలన్నీ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటన్నిటి వెనకాల, మీరు ఉన్నారనే తెలుగుప్రజలు భావిస్తున్నారు. 

ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో మీ ఆధ్వర్యంలో సాగిన జీ-20 సదస్సు విజయం సాధించింది. పలు దేశాధినేతలు మిమ్మల్ని ఎంతగానో అభినందించారు. అంతర్జాతీయంగా ఎంతగానో వెలిగిపోతున్న మీ కీర్తి, స్వదేశంలో జరుగుతున్న అంశాల కారణంగా తరిగిపోతుందని ఇప్పటికైనా సమయం మించిపోలేదు.గ్రహించండి. ఓ సీనియర్ గా చంద్రబాబు లాంటి నాయకుడు, మీ పక్కన ఉండడం కూడా మీకు మేలు చేస్తుందే కానీ, ఏ మాత్రం కీడు చేయదు. మీరు లోపాయికారిగా మద్దతు పలికే నేతల కన్నా, చంద్రబాబు స్నేహమే ఈ సమయంలో మీకు ఎంతో మేలు. 

ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చంద్ర బాబు నాయుడు గారికి న్యాయం చెయ్యండి. 

కె.ఎస్ రామారావు, (సీనియర్ చిత్ర నిర్మాత).

Tollywood Producer Letter to PM Modi:

K.S Rama Rao Letter to PM Modi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement