Advertisement
Google Ads BL

భగీరథ నాగలదేవి చరిత్రకు వీరతిలకం


ఒక కథనో, నవలనో, పుస్తకాన్నో చదివాక హర్షం వర్షమై గుండెను తడపాలి. చదివిన ప్రతి ఘట్టంలోనో, సన్నివేశంలోనో తీయని అనుభూతి మనల్ని వెంటాడాలి. దృశ్యం వెంట దృశ్యం మనల్ని వేగంగా నడిపించుకుంటూ కథ వెంట పరుగు తీయించాలి. చరిత్ర పొరల్లో దాగిన రసమయ గాథను చదువుతుంటే మనసు నవరసభరితమై, ఆనంద తాండవం చేయాలి. భాష, భావం కలగలిపి, వర్ణనలతో జతకలసి, కల్పనలను కలగలుపుకొని చిరస్మరణీయమైన చరిత్రను మన కళ్ళ ముందు సాక్షాత్కరింపచెయ్యాలి. 

Advertisement
CJ Advs

శ్రీకృష్ణదేవరాయల ప్రేమ కథ నాగలాదేవి నవల చదువుతున్నప్పుడు నాకు కలిగిన అనుభూతి ఇది. మనసు పొంగి పరవశంతో రాసిన పంక్తులివి. అక్షరాలు కుప్ప పోస్తే పుస్తకమవుతుంది. అందులోని పేజీల్లో రసార్ద్రత ఉండదు. వాక్యాలు పేరిస్తే కవిత్వమవుతుంది. అందులో గుండెను తట్టే అనుభూతి ఉండదు. అక్షరాలు కుప్పపోయడం, వాక్యాలు పేర్చడం రచన లక్షణం కాదని సంపూర్ణంగా గ్రహించిన, అనుభవవం పండిన ఓ రచయిత కలం నుండి జాలువారిన రసప్రవాహం నాగలాదేవి నవల. 

ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగునపడి కాన్పించని, కథలన్నీ కావాలిప్పుడు, దాచేస్తే దాగని సత్యం అంటాడు మహాకవి శ్రీ శ్రీ. 16వ శతాబ్దానికి చెందిన ప్రేమ కథను చరిత్ర పుటల్లోంచి వెలికి తీసి, పరిశోధించి, వాస్తవాలు నిగ్గుతేల్చి, కల్పనలు జత చేర్చి, వీర, శృగార, రసాత్మకంగా, రమణీయ రసమయ గాథగా మలచిన ప్రఖ్యాత రచయిత, చరిత్ర పరిశోధకులు, ప్రముఖ పాత్రికేయులు భగీరథ గారు అభినందనీయులు. 

270 పేజీల నవల్లో భగీరథ గారి రచనా పాటవం ప్రతి పుటలోనూ, పాదంలోనూ  ప్రకాశిస్తుంది. వైభవోపేతమైన విజయనగర సామ్రాజ్య గాథను నాగలాదేవి రూపంలో మరోసారి చదివే అవకాశం కల్పించారు భగీరథ గారు. భగీరథ గారు రచనారంగానికి, పాత్రికేయ రంగానికి కొత్తకాదు. నాగండ్ల నల్లరేగళ్ళలో మొలకెత్తిన అక్షరం పదమై, వాక్యమై మానవతను పలికించింది. నాగలాదేవి చారిత్రిక నవలను రాసి భగీరథ పథం ఏమిటో పాఠక లోకానికి పరిచయం చేసింది. ఇవ్వాళ పరిచయం అక్కరలేని రచయితగా తెలుగునాట కీర్తి గడించారు. ప్రఖ్యాత హేతువాది రావిపూడి వేంకటాద్రి గారు పుట్టిన నాగండ్లలోనే జన్మించిన భగీరథ గారు ఆ వూరు కీర్తి కిరీటంలో రత్నంగా నిలిచారు. 

కవిత్వం రాయడం సులభం, చరిత్ర రాయడం కష్టం. కవిత్వంలో కల్పనలుంటాయి. చరిత్రలో వాస్తవాలు ఉంటాయి. వక్రీకరణలను చరిత్ర సహించదు. నాగలాదేవి చరిత్రను వక్రీకరణలకు తావులేకుండా, వాస్తవాలను నిగ్గుతేల్చి, సంఘటనాత్మకంగా, సన్నివేశాలను కల్పించి, మొత్తం కథను, పాత్రలచే నడిపించి, సరళసుభోదకంగా, కవితాత్మక వచన శైలి లో భగీరధగారు నవలను రాసిన తీరు పాఠకుల్ని ఆకట్టుకుంటుంది, ఆలోచింపజేస్తుంది, చరిత్ర పట్ల అవగాహన పెంచుతుంది. ప్రేమకున్న పవిత్రతను, అపురూప త్యాగాన్ని చాటుతుంది. గుండెను మీటుతుంది. 

స్త్రీని భోగవస్తువుగా చూసే దేశంలో ప్రేమకు ప్రతిరూపంగా నిలుపుతుంది. రూపవతి, గుణవతి, అభిమానవతి అయిన నాగలాదేవిని ఈ నవల మరో కొత్త కోణంలో చూపుతుంది. వేశ్యలు వేశ్యలుగానే మిగిలిపోకుండా, రాజపూజితలై, రాణులై, కథనరంగంలో ప్రవీణులై, దాపత్య జీవనంలో ధన్యలై, గుణ గణ్యలై చరితార్ధులయ్యారని చెప్పడానికి నాగలాదేవి చరిత్ర భూమికగా నిలుస్తుంది. 

ఈ నవలా రచనకు రచయిత ఎంతో శ్రమించారనడానికి ఆయా సంఘటనలు, సాక్ష్యమిస్తాయి. నవలకు ప్రాణవాయులైన ప్రేమకు పట్టం కడుతూనే, ప్రేమ చుటూ అల్లిన కథ మనల్ని పుట వెంట పుట వేగంగా తన వెంట తీసుకెడుతుంది. కొన్ని చోట్ల శృంగార పరవశుల్ని చేస్తుంది. ఇంకొన్ని చోట్ల వీర రస స్ఫూర్తిని కల్గిస్తుంది. మరికొన్ని చోట్ల నిస్వార్ధ త్యాగం కంట తడి పెట్టిస్తుంది. ఇలా రాయాలంటే రచయిత పాత్రల్లో పరకాయ ప్రేవేశం చేయాలి. తానే  పాత్రగా మారాలి. అప్పుడే పాత్ర మనల్ని పలకరిస్తుంది. 

భగీరథ గారికి ఈ విద్య బాగా తెలుసు. నాగలాదేవి రూపలావణ్యాన్ని వర్ణిస్తూ అనిర్వచనీయమైన ప్రతిభ, అపురూపమైన అందం, అసామాన్యమైన పాలనా దక్షత, అమేయమైన వ్యూహ రచన, సాటిలేని మానవతా హృదయం, సాహసానికి మారుపేరైన యుద్ధ తంత్ర నైపుణ్యం నాగలాదేవిని నారీమణిగా నిలిపాయి. 

భగీరథ గారు పత్రికల్లో పనిచేసినందువలన భావానుగుణమైన భాషను ఎలా వాడాలో వీరికి బాగా తెలుసు. మీ నీడలోనే విశ్రమిస్తా! మీ ఒడి లోనే నిష్క్రమిస్తా!! అనే నాగలాదేవి మాటల్లో నవల సారాంశమంతా ఇమిడి వుంది. మనిషి కులం కన్నా గుణం ముఖ్యం అన్న రాయలవారి మాటల్లో సర్వ మానవ సమతా గుణం వెల్లివిరుస్తుంది. 

నాపేరు కృష్ణ. మాది చంద్రగిరి.. , అలనాటి కృష్ణుడులా ఈ గోపిక వేటకు రాలేదుగదా!.. , గోపికలు ఎంతమంది వున్నా రాధ తో సరితూగరుగా., ఇంతకు నేను.. , తొలిసారి చూసింది ఈ రాధనే.. కాదు నాగలాదేవినే., నిజమైన వలపా, మోజుతో వేసే వల.. పా.. , ఇలా రసభరిత చమత్కారంతో సంభాషణలు సాగిపోతాయి. అంతేకాదు కాదు వర్ణనలు మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తాయి. 

భగీరథ గారు నగరవాసి అయినా వారి మూలాలు పల్లెటూరు పైరగాలి పరిమళంలో వున్నాయి. గ్రామీణతను చాటే పలుకుబడులు, పద ప్రయోగాలు ఈ నవలలో నక్షత్రాల్లా కాంతులీనాయి. సన్నివేశాలను ఉత్కంఠంగా నడపడంలో భగీరథ గారికి పెన్నుతో పెట్టిన విద్య. 

కవితాత్మక వచనం రాయడంలో విశ్వనాథ సత్యనారాయణ గారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు, యస్వీ భుజంగ రాయ శర్మ గారు, నాగభైరవ కోటేశ్వర రావు గారు సిద్దహస్తుల. ఇప్పుడు భగీరథ గారు అలాంటి కవితాత్మక వచనాన్ని సంభాషణాత్మకంగా నవలనిండా ప్రయోగించి, పాఠకులకు ప్రమోదాన్ని, రచనకు ప్రయోజనాన్ని పంచారు. అంతేకాదు నవల స్థాయిని పెంచారు. 

ఇంతకూ నాగలాదేవి మన నాగండ్ల అమ్మాయే. పసుపు పచ్చని లంగా, పూల రవికె, పలుచటి వోణి, కాటుక దిద్దిన కళ్ళు, ముత్యాల హారం, చెవులకు జూకాలు, చక్కటి ముక్కు, పెద్ద పెద్ద కళ్ళు, పొడవైన జడ - ఈ పల్లెటూరు పడుచును పట్టపురాణిని చేసి, నవలకు పరిపూర్ణతనిచ్చారు. నాగలాదేవి అందాలను, నవలలోని రసవత్ ఘట్టాలను కుంచెలో బంధించి, అపురూప చిత్రాలుగా పుటల మధ్య ఇంద్రధనుస్సు గా విప్పారుతూ, ప్రఖ్యాత చిత్ర కారులు డాకోజు శివ ప్రసాద్ గారు ముఖ చిత్రం నుండి ముగింపు వరకు ఉత్కంఠంగా చదివించే అపురూప నవల నాగలాదేవి. 

నాగలాదేవి రాయలవారి ఒడి లో ఒదిగిపోయే దృశ్యం చదువుతుంటే అప్రయత్నంగానే కళ్ళు చెమరుస్తాయి. దుఃఖం గుండె పొరల్ని తడుతుంది. నవల చివరి పాదాలు చదువుతుంటే రాయలవారి లాగే మనమూ భోరున విలపిస్తాము. నాగలదేవి నవల చదివి ఆనంద, విషాద బాష్పాలను మిగిల్చుకున్నాను.

-డాక్టర్ బీరం సుందర రావు, చీరాల. 

నాగలాదేవి పుస్తకం కావలసినవారు: అచ్చ తెలుగు యాప్: 85588 99478, నవోదయ  బుక్ హౌస్: 92474 71361 / 92474 71362 సంప్రదించండి.

Amazing History of Bhagiratha Nagaladevi Book:

Nagaladevi Book Review By Dr. Beeram Sundara Rao, Cheerala 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs