ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సెన్సేనల్ హిట్ కొట్టి రికార్డు కలెక్షన్‌లు సాధిస్తున్న సినిమా 2018. మే 5న మలయాళంలో రిలీజై అక్కడ రూ.150 కోట్ల మార్క్ టచ్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక గతవారం తెలుగులో విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్‌లు సాధిస్తూ.. ఇప్పటికే సుమారు 6 కోట్ల మార్క్ టచ్ చేసి లాభాల్లో ఉంది. 2018 లో కేరళ ని ముంచెత్తిన భీకర వరదల్ని, ఆ వరదల్లో బాధితులు ప్రాణాల కోసం చేసిన పోరాటాల్నీ ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారు. కాగా 2018ని తెలుగులో విడుదల చేసి ఘన విజయం అందుకున్న యువ నిర్మాత బన్నీ వాసు నేడు థాంక్స్ మీట్ నిర్వహించారు.
ఈ థాంక్స్ మీట్ లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ - నేను ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక తుఫాన్ లో ఉన్నట్టు ఉంది. ఈ సినిమాలో ఫైట్లు లేవు. డాన్సులు లేవు. ఓన్లీ ఉద్వేగం ఉంది. సినిమా చూడాలి అనుకున్న వారు థియేటర్లోనే చూడండి. లేదంటే ఆ ఫీల్ మిస్ అవుతారు అన్నారు.
దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ - ఈ సినిమా చూశాక చాలా కాలం తర్వాత చప్పట్లు కొట్టాను. ఫస్ట్ టైమ్ వర్షం మీద కోపం వచ్చింది. అంతటి అద్భుతమైన ఉద్వేగంతో ఉంటుందీ చిత్రం. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసి ఆడియన్స్ కు థాంక్స్ అన్నారు.
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ - నేను ఇలాంటి విభిన్నమైన సినిమాలు తీసుకురావడానికి కారణం అరవింద్ గారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఒక నిర్మాతగా నాకు ఎక్కడలేని గౌరవం పెరిగింది. ఇంతటి బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ఆడియన్స్ అందరికీ థాంక్స్ అని చెప్పారు.