మహానటుడు ఎన్.టి. రామారావు శత జయంతి వేడుకలలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, అల్లాడ రామకృష్ణను కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఘనంగా సత్కరించింది. ఎన్. టి. ఆర్ శతజయంతి సందర్భగా భగీరథ మహానటుడు, ప్రజానాయకుడు - ఎన్ .టి . ఆర్, అన్న పుస్తకాన్ని రచించారు, రామకృష్ణ ఈ శతాబ్ది హీరో అన్న పుస్తకం వ్రాశారు. ఎన్. టి. ఆర్ శత జయంతి వేడుకలను మూడు రోజులపాటు తెలుగు విశ్వ విద్యాలయంలోని డాక్టర్ నందమూరి తారకరామారావు కళా మందిరంలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ నిర్వహించింది.రెండవ రోజు శుక్రవారం నాడు సీనియర్ జర్నలిస్ట్ భగీరథను, రామకృష్ణను తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ డాక్టర్ ఎస్. వేణుగోపాలాచారి శాలువాతో సత్కరించారు. డైరెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ బి. రాజగోపాలం రావు జ్ఞాపికను అందించారు.
ఈ సందర్భగా కార్యదర్శి మద్దాళి రఘురాం మాట్లాడుతూ.. 1980లో భగీరథ రచించిన మానవత కవితా సంకలనాన్ని మహాకవి శ్రీ శ్రీ ఆవిష్కరించారని, ఆ కార్యక్రమాన్ని కిన్నెరా ఆర్ట్ థియేటర్స్ నిర్వహించింది, అప్పటి నుంచి భగీరధతో అనుబంధం కొనసాగుతుందని, జర్నలిస్టుగా, రచయితగా భగీరథ బహుముఖాలుగా ఎదిగారని రఘురాం చెప్పారు.
వేణుగోపాలాచారి మాట్లాడుతూ.. నందమూరి తారక రామ రావు గారు మా అందరికీ మార్గదర్శకుడు, నటుడుగా, రాజకీయ నాయకుడుగా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చారని, ఆయన యుగ పురుషుడని చెప్పారు .
రాజగోపాలరావు మాట్లాడుతూ.. ఎన్. టి. రామారావు గారితో పరిచయం లేదు కానీ వారి సినిమాలు చూస్తూ పెరిగాను, ముఖ్యమంత్రిగా వారి పాలన చూశాను. ఎన్. టి. ఆర్ శతజయంతి వేడుకల్లో కిన్నెరా వారు నన్ను కూడా భాగస్వాములను చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
జర్నలిస్ట్, రచయిత భగీరథ మాట్లాడుతూ.. ఎన్. టి. రామారావు గారితో తనకు 1977 నుంచి పరిచయం ఉందని, నటుడుగా వున్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తరువాత వారితో అనేక ఇంటర్వ్యూలు చేశానని చెప్పారు. రామారావు గారి వ్యక్తిత్వం, మనస్తత్వం ఎలాంటిదో భగీరథ వివరించారు. సినిమా రంగంలో ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారని, దర్శకుడుగా ఆయనది విలక్షణ మైన శైలి అని, ప్రజా నాయకుడుగా ఆయన ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని తెలుగు భాష, సంస్కృతీ, సంప్రదాయాల పట్ల అమితమైన గౌరవం ఉందని, జాతికి గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చిన రామారావు గారు శకపురుషుడని భగీరథ తెలిపారు.