మే 20, 2023న హైదరాబాద్ కూకట్పల్లిలో కైతలాపూర్ మైదానంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి శకపురుషుడు ప్రత్యేక సంచిక, జైఎన్టీఆర్ వెబ్సైట్ ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి విజయవంతంగా చేసిన ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్, అండ్ వెబ్సైట్ కమిటీ సభ్యులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేరు పేరున అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రబాబునాయుడు గారు కేక్ కట్ చేసి సభ్యులందరికి స్వయంగా అందించి తన సంతోషాన్ని, అభిమానాన్ని పంచుకొన్నారు. ఎన్టీఆర్ గారిపై వెలువరించిన గ్రంధాలను ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి అనువదించి జాతీయస్థాయిలో ఎన్టీఆర్ భావజాలాన్ని, అయన సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళమని కమిటీ చైర్మన్ శ్రీ టిడి జనార్దన్ గారికి చెప్పారు. కాలమానాన్ని కొలిచేటప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఏ విధంగా పిలుచుకుంటామో ప్రజాసంక్షేమం, అభివృద్ధికి సంబంధించి తెలుగుజాతి కూడా ఎన్టీఆర్ కు పూర్వం, ఎన్టీఆర్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది అని, అదే ఎన్టీఆర్ శకం: అని శ్రీ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలుగుజాతి గర్వంగా చెప్పుకోవాల్సిన సందర్భం అని కూడా అయన అన్నారు. ఎన్టీ రామారావు గారి వలనే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు లభించినందున ఎన్టీఆర్ స్ఫూర్తి కార్యక్రమాలని నిరంతరంగా కొనసాగించాలని కమిటీకి సూచించారు.
కమిటీ సభ్యులు శ్రీ చంద్రబాబునాయుడు గారికి శాలువాకప్పి బొకే అందించి కృతజ్ఞతలు తెలియజేసారు. శ్రీ చంద్రబాబునాయుడు గారిని కలిసిన వారిలో ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్, అండ్ వెబ్సైట్ కమిటీ చైర్మన్ శ్రీ టి.డి. జనార్దన్, సభ్యులు శ్రీ కాట్రగడ్డ ప్రసాద్, శ్రీ రావుల చంద్రశేఖర రెడ్డి, శ్రీ కంఠంనేని రవిశంకర్, శ్రీ అట్లూరి నారాయణరావు, శ్రీ విక్రమ్ పూల, శ్రీ అశ్విన్ అట్లూరి, శ్రీ మధుసూధనరాజు, శ్రీ సతీష్ మండవ, శ్రీ శ్రీపతి సతీష్, శ్రీ కాసరనేని రఘు, శ్రీ డి. రామ్మోహనరావులు పాల్గొన్నారు.