విజయ నగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథను జర్నలిస్ట్, రచయిత భగీరథ ఎన్నో ఏళ్ళు పరిశోధన చేసి నాగలాదేవి పేరుతో పుస్తకంగా వెలువరించారని, అతని ప్రయత్నాన్ని తాను అభినందిస్తున్నానని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు చెప్పారు.
జర్నలిస్టు భగీరథ రచించిన నాగలాదేవి పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు తన నివాసంలో ఆదివారం రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 44 ఏళ్ళుగా జర్నలిస్టు భగీరథ తనకు తెలుసునని ఇప్పటివరకు భగీరథ 15 పుస్తకాలను రచించారని, ఇది అతని 16వ పుస్తకమని చంద్రబాబు పేర్కొన్నారు.
తిరుపతికి సమీపంలోని నాగలాపురం అనే పల్లెటూరుకు చెందిన నాగలాదేవి ని శ్రీకృష్ణదేవరాయలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వివాహం తరువాత ఆమె పేరును చిన్నాదేవిగా మార్చాడని, చిన్నాదేవి వేరు, నాగలాదేవి వేరు అనే వాదన చరిత్రలో ప్రచారంలో ఉందని, అయితే వారిద్దరూ ఒక్కరేనని భగీరథ ఈ పుస్తకం ద్వారా ప్రపంచానికి చాటారని చంద్ర బాబు నాయుడు తెలిపారు.
తాను ముఖ్యమంత్రిగా ఉండగా భగీరథ రెండు పర్యాయాలు ఉత్తమ జర్నలిస్టుగా నంది అవార్డులు, ఎన్. టి. ఆర్ మెమోరియల్ ట్రస్టు అవార్డు కూడా స్వీకరించారని, చరిత్రలో సరికొత్త కోణాన్ని నాగలాదేవి పుస్తకం ద్వారా ఆవిష్కరించిన భగీరథ ప్రయత్నాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్ర బాబు తెలిపారు.
శ్రీకృష్ణదేవరాయలు నాగలాదేవి ని వివాహం చేసుకోడానికి పది సంవత్సరాలు పట్టిందని, ఆ తరువాత నాగలాదేవి జీవన యానం ఎలాజరిగింది? భర్తకు ఆమె ఏ విధంగా సహకరించింది ఈ పుస్తకంలో భగీరథ అద్భుతంగా రచించారని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ సందర్భంగా రచయిత భగీరధను చంద్రబాబు నాయుడు సత్కరించారు. తాను రచించిన నాగలాదేవి పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, చంద్ర బాబు నాయుడు గారితో తనకు నాలుగు దశాబ్దాల నుంచి పరిచయం ఉందని భగీరథ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని భగీరథ కుమార్తెలు శైలి జాస్తి, శ్రుతి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత మురళి మోహన్, నిర్మాత డి.వి.కె. రాజు, తెలుగు దేశం నాయకులు టి.డి. జనార్దన్, రావుల చంద్రశేఖర్ రెడ్డి భగీరధను అభినందించారు.