దిల్ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా బలగం. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెరకెక్కించారు. మార్చి 3న విడుదలైన చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని రోజు రోజుకీ ఆదరణ పొందుతూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు హర్షిత్, హన్షిత బలగం సినిమా గురించి మీడియాతో ప్రత్యేంగా మాట్లాడుతూ...
- బలగం మూవీ సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఉండగా దిల్ రాజు ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేయటానికి కారణం.. మా ఎస్‌వీసీ బ్యానర్‌లో ఇప్పుడు అన్నీ భారీ చిత్రాలే చేస్తున్నారు. వేర్వేరు లాంగ్వేజెస్‌లో చేస్తున్నారు. డాడీ (దిల్ రాజు) కొత్త వాళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ మిస్ అవుతున్నాయి. డిఫరెంట్ సినిమాలు చేయాలనేదే ఈ బ్యానర్ టార్గెట్. అందులో కమర్షియల్ సినిమాలు కూడా ఉంటాయి. ఏదైనా సరే! కొత్తగా ట్రై చేయాలనేదే మా ప్రయత్నం.
- వేణు ఎల్దండి కథ చెప్పినప్పుడు మన ఊర్లో జరిగే పరిస్థితులన్నీ గుర్తుకు వచ్చాయి. అదీ గాక చాలా విషయాలు మన జీవితంలో జరిగేవే. ఉదాహరణకు బలగం సినిమాలో కొమరయ్య చనిపోయినప్పుడు కొడుకులిద్దరూ గొడవపడతారు. అలాంటిదే తన ఇంట్లో కూడా జరిగిందని మా ఫ్రెండ్ చెప్పాడు. అలాగే చావు ఇంట్లో టీవీ ప్లే చేయకూడదని విషయాలు.. అన్నీ మనకు ఎక్కడో అక్కడ జరిగే ఉంటాయి. అలాంటి రియల్ సిట్యువేషన్స్‌ను క్యాప్చర్ చేశాం. కానీ ఇంత రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.
- నేను షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్‌కి మూడు సార్లు వెళ్లాను. ఓసారి ప్రియదర్శి క్యారెక్టర్‌లో ఉన్నాడా? లేదా? అని చూసుకోవడానికి వెళ్లాను. శవయాత్ర సన్నివేశం చిత్రీకరించేటప్పుడు నాకు ఆ మాస్టర్ కావాలన్నప్పుడు ఆయన్ని అరెంజ్ చేసిచ్చాను. పక్కరోజు వెళ్లి ఇంకేం కావాలని అడిగాను. సాంగ్ సపోర్ట్‌కు ఏం కావాలనేది వేణు అడిగినప్పుడు వెళ్లి చూశాను. హన్షిత అయితే అడ్మినస్ట్రేషన్.. ఎడిటింగ్ విషయాలను చూసుకుంది.
- గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజుగారు, శిరీష్‌గారి సలహాలు తీసుకునేవాళ్లం కానీ ఫైనల్ నిర్ణయం మా ఇద్దరిదే ఉండేది.
- రాజుగారు చాలా సార్లు సినిమా చూశారు. సినిమా అంతా రెడీ అయ్యింది. ప్రమోషన్స్‌కు ఎలా తీసుకెళ్లాలని ఆయనకు ఫోన్ చేసినప్పుడు కొంత సేపు ఆగు ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. ఎమోషన్‌లో ఉన్నానని అన్నారు. అప్పుడు సినిమా కరెక్ట్ వేలో ఉందనిపించింది. మా ఇద్దరినీ హత్తుకుని ఎంత గొప్ప సినిమా తీశారో మీకు తెలియటం లేదు. భవిష్యత్తులో మీరు ఎన్ని గొప్ప సినిమాలైనా తీయొచ్చు. కానీ ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.
- రోజురోజుకీ సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు మంచి కలెక్షన్స్‌ను రాబట్టుకుంటోంది. ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనే చేశాం. మధ్యలో కాస్త బడ్జెట్ పెరగటంతో పాటు థియేటర్స్‌కు జనాలు రావటం తక్కువైంది. అలాంటి నేపథ్యంలో బలగం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేద్దామ అనే ఆలోచనలో కూడా ఉన్నాం.
- మా బ్యానర్‌లో న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ఎప్పుడూ సిద్ధం. అందుకు ఓ టీమ్ కూడా ఉంది.వాళ్లు స్క్రిప్ట్స్ వింటున్నారు. అదీగాక మా బ్యానర్ మెయిల్ ఐడీ ఉంది. దానికి కూడా స్క్రిప్ట్స్ పంపొచ్చు. మంచి కథ వచ్చినప్పుడు ఓ కలెక్టివ్ డిసిషన్ తీసుకుని రాజుగారి దగ్గరకు వెళతాం.
- అన్నీ రకాల జోనర్స్‌లో సినిమాలు చేయటానికి సిద్ధం. అలాగే ఇంతే బడ్జెట్‌లో సినిమాలు చేయాలని అనుకోం. కథ డిమాండ్ చేసి, మంచి హీరో ఉంటే బావుంటుందనిపించినప్పుడు బడ్జెట్ ఎక్కువైన సినిమాలు చేస్తాం.