సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా యశోద. హరి, హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. నవంబర్ 11న సినిమా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా యశోద ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. ట్రైలర్ ఎలా ఉందనే విషయానికి వస్తే...
యశోద టీజర్‌లో సమంత గర్భవతి అని చూపించారు. ట్రైలర్‌లో డబ్బు కోసం సమంత సరోగసి మదర్ గా కనిపించింది అని స్పష్టం చేశారు. అంటే యశోద ది సరోగసీ ప్రెగ్నెన్సీ అన్నమాట! అక్కడితో కథ అయిపోలేదు. సరోగసీ కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళలను ఒక్కచోట చేర్చడం... ఆ తర్వాత అక్కడ ఏదో జరగకూడనిది జరుగుతుందనే క్యూరియాసిటీని కలిగించారు. సరోగసీ కోసం తీసుకొచ్చిన చాలామంది మహిళలకు ఏం జరుగుతోంది? ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న 122 మంది సంపన్న మహిళలు పేర్లు బయటకు రావడానికి, సరోగసీ ప్రెగ్నెన్సీ ధరించిన మహిళలకు సంబంధం ఏమిటి? ప్లాన్ ప్రకారం ఎవరి హత్య జరిగింది? అని ప్రేక్షకులు ఆలోచించేలా ట్రైలర్ కట్ చేశారు.
నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది అని సమంత చెప్పే మాటలో బిడ్డపై తల్లి ప్రేమ కనబడుతుంది. సమంతకు, డాక్టర్ రోల్ చేసిన ఉన్ని ముకుందన్ మధ్య లవ్ ట్రాక్ ఉందని హింట్ కూడా ఇచ్చారు. అంతే కాదు... యశోదలో క్రైమ్ ఉంది, రాజకీయం ఉంది, అన్నిటి కంటే ముఖ్యంగా సమంత యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ అనేలా చూపించారు.