కిరోసిన్ రివ్యూ
నటీనటులు: ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు తదితరులు
బ్యానర్: బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్
డీవోపీ: విజయ్ భాస్కర్ సద్దాల, ఆయన్ మౌళి, అశోక్ దబ్బీరు
ఎడిటర్: గుజ్జల రక్షిత్ కుమార్
మ్యూజిక్ డైరెక్టర్: అనంత నారాయణ ఏజీ, తేజా కునూరు
నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: ధృవ
రిలీజ్ డేట్: 17-06-2022
సినిమాపై ప్యాషన్‌తో తెలుగు నెటివిటీతో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌కు ఎమోషన్స్ జోడించి కిరోసిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ధ్రువ. హీరోగానే కాకుండా దర్శకత్వం బాధ్యతలు చేపట్టి తన ప్రతిభను చాటుకొన్నాడు. నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన కిరోసిన్ ప్రేక్షకులను ఎంతవరకు ఎంటర్టైన్ చేసిందో సమీక్షలో చూసేద్దాం.
కథ:
ఏపీలోని మారుమూల ప్రాంతమైన జనగూడెంలో వరుస హత్యలు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. ఆ గ్రామానికి చెందిన తండాలోని రామప్ప (సమ్మెట గాంధీ) కూతురు గౌరీ (లావణ్య చెవుల) అత్యాచారానికి గురై హత్యగావింపబడటం సంచలనం రేపుతుంది. అయితే వరుస హత్యల నేపథ్యం వెనుక కూపీ లాగాడానికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ వైభవ్ (ధృవ)ను రంగంలోకి దించుతారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీపీ వైభవ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హత్య కేసులను ఎస్సై (జీవిన్) ఎందుకు క్లోజ్ చేశాడు? ఏపీసీ ధృవ హంతకులకు ఎలాంటి శిక్షను విధించాడు? అనేది తెలియాలంటే కిరోసిన్ సినిమాని తెరమీద చూసెయ్యాల్సిందే.
నటీనటులు
ఏసిపి వైభవ్ పాత్రలో ధ్రువ ఒదిగిపోయాడు. రెగ్యులర్ పోలీస్ యాటిట్యూడ్‌కు దూరంగా సెన్సిటివ్ ఎలిమెంట్స్‌తో చక్కగా నటించాడు. బ్రహ్మాజీ కొద్ది సేపు కనిపించినా నవ్వులు పూయించాడు. మిగతా నటులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.
విశ్లేషణ:
దర్శకుడు కథను పకడ్బందీగా రాసుకోవడమే కాకుండా.. కొత్తదనం ఉట్టిపడేలా స్క్రీన్ ప్లే.. హ్యుమర్, ఎమోషన్స్ జోడించిన డైలాగ్స్.. సీనియర్ నటులపై దర్శకత్వ పర్యవేక్షణ అతడి టాలెంట్‌కు అద్దం పట్టింది. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్‌గా కాకుండా.. విభిన్నంగా తెరకెక్కించడంలో ధ్రువ పట్టుదల తెర మీద స్పష్టంగా కనిపిస్తుంది. సైకోల బిహేవియర్ ఎలా ఉంటుంది.. వారు హత్యలకు ఎలా ప్రేరిపితులవుతారు అనే విషయాలను తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు. తొలిసారి దర్శకత్వం బాధ్యతలు, ఇతర విభాగాల రెస్పాన్సిబిలిటీని భుజానికి ఎత్తుకొని క్లాలిటీతో కూడిన సినిమాను అందించడం అభినందనీయం.
సాంకేతిక వర్గం పనితీరు
కిరోసిన్ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్.. సినిమాటోగ్రఫి. విజయ్ భాస్కర్, ఆయన్ మౌళి, అశోక్ అద్భుతంగా గ్రామీణ, పర్వత ప్రాంతాలు అద్భుతంగా కెమెరాలో బంధించారు. తేజా కన్నురు అందించిన బీజీఎం సినిమాలోని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ విషయంలో కత్తెర వెయ్యాల్సిన సీన్స్ ఉన్నాయి.. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.