నిజాయితీ, నిబద్దత, నిర్మొహమాటం, నిరాడంబరత....
ఇలాంటి పదాలు ప్రాస కోసం రాసినట్లు అనిపించేది నాకు.
అయితే ఆ గుణాలన్నీ పొందిన ఓ వ్యక్తి ఎలా ఉంటాడో నేను చూసాను. కలిసాను.
తనతో పని చేసాను. తన వెంట ప్రయాణించాను. చాలా తెలుసుకున్నాను. ఎన్నో నేర్చుకున్నాను.
సరిగ్గా బ్రతకడం అంటే సమయం వృధా చెయ్యకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే
అనే దృక్పథంలోకి నన్ను తీసుకువెళ్లిన ఆ మిస్టర్ మిరకిల్... నా హీరో రవితేజగారు.
ఆయనతో నేను మొదట వీర చేశాను. అనుకున్నంత ఆడలేదు. అది ఆయన పట్టించుకోలేదు.
ఇంకో కథ రెడీ చెయ్... సినిమా చేసేద్దాం అన్నారంతే.!
ఎందుకంటే ఎఫర్ట్ గుర్తించే పర్సన్ ఆయన. రిజల్ట్ కేర్ చెయ్యరు.
బట్ నేను మాత్రం చాలా రెస్పాన్సిబిల్ గా ఫీల్ అయ్యాను.
తన ఇమేజ్ కీ, ఎనర్జీకి సెట్ అయ్యే కథ కుదిరితేనే ఆయన్ని అప్రోచ్ అవ్వాలనుకున్నాను.
ఎన్నో పాయింట్స్ అనుకున్నాక నాకు బాగా కిక్కిచ్చిన లైన్ ఖిలాడి.
ఇందులో మీరు చూడాలనుకునే రవితేజని చూస్తారు. మీరిప్పటివరకూ చూడని రవితేజనీ చూస్తారు.
నటుడిగా ఎక్సట్రార్డినరీ ఎనర్జీ ఆయన సొంతం.
వ్యక్తిగా అంత పోజిటివ్ మైండ్ సెట్ తో వుండడం ఆయనకే సాధ్యం.
ఆయనెప్పుడూ ఎవరినీ ద్వేషించరు. తనకు సంబంధం లేని టాపిక్ మాట్లాడరు.
వర్క్ విషయంలో నిర్లక్ష్యాన్ని భరించరు. వర్కింగ్ హవర్స్ వేస్ట్ చేస్తే సహించరు.
నిర్మాత ఖర్చుపెట్టే డబ్బుకి చాలా విలువనిచ్చే వ్యక్తిత్వం ఆయనది.
సాటి నటీనటులు, సాంకేతిక నిపుణుల సమయాన్ని గౌరవించే మనస్తత్వం ఆయనది.
అగ్ర కథానాయకుడిగా ఎదిగినా అసిస్టెంట్ డైరెక్టర్ గా తన అనుభవాన్ని మరువని తత్వం ఆయనది.
ఓ మాట ఇచ్చాక, ఓ కథని నమ్మాక ఇక ఏదేమైనా ముందడుగు వేసేసే మొండితనం ఆయనది.
ఏదైనా నచ్చకపోతే ఓపెన్ గా చెప్పేస్తారు. ఏదైనా మిస్టేక్ చేస్తే మొహంమీదే తిట్టేస్తారు.
అంతే తప్ప ఏ స్క్రాప్ నీ మైండ్ లో పెట్టుకోరు. ఎలాంటి నెగెటివిటీని క్యారీ చెయ్యరు.
అందుకేనేమో ఆయన చుట్టూ అద్భుతమైన పాజిటివ్ వైబ్ ఉంటుంది.
ఆయనలో అన్ బిలీవబుల్ ఎనర్జీ ఉంటుంది.
చిన్నప్పటినుంచీ ఎవ్వరితోనూ ఒక్క మాట పడని నన్ను ఎన్నోసార్లు తిట్టిన వ్యక్తి ఒక్క రవితేజగారే.
అయితే ఆయన తిట్టే పధ్ధతి టీజింగ్ గా ఉంటుంది. నాకు నవ్వొచ్చేస్తుంది.
ఆయన మంచి చెడు చెప్పే విధానం చక్కగా ఉంటుంది. ఠక్కున నా బుర్రలోకి ఎక్కేస్తుంది.
జనరల్ గా నన్ను చాలామంది రమేష్ అనీ, కొంతమంది వర్మా అని పిలుస్తూ ఉంటారు.
కానీ తనదైన స్లాంగ్ తో పెన్మెత్సా అని ప్రేమగా పిలిచే ఏకైక వ్యక్తి రవితేజగారే.
ఆయన తనవన్నీ ప్రొఫెషనల్ రిలేషన్ షిప్సే... నో పర్సనల్ ఎటాచ్ మెంట్స్ అంటూ ఉంటారు.
కానీ వాస్తవానికి ఆయనలో ఒక ఎఫెక్షనెట్ యాంగిల్ ఉంటుంది. ఎమోషనల్ డెప్త్ ఉంటుంది.
ఎంతో సన్నిహితులైన వారికే అది అర్ధం అవుతుంది. ఆయన్ని అర్ధం చేసుకునే అవకాశం లభిస్తుంది.
బై గాడ్స్ గ్రేస్ ఆ ఛాన్స్ నాకు దక్కినందుకు అక్షరాల్లో వ్యక్తం చెయ్యలేని ఆనందాన్ని ఆస్వాదిస్తూ...
మా రవితేజ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
రవితేజ అంటే అందరికీ మాస్ మహారాజ్. నావరకు మాత్రం మంచి మనసున్న మహారాజ్.!
- రమేష్ వర్మ పెన్మెత్స