అచ్చ తెలుగు ఓటీటీ ఆహా థ్రిల్లర్ ఫీస్ట్ తో తమ ప్రేక్షకులను అలరించడానికి భామాకలాపంతో సిద్ధమైంది. ప్రియమణి లీడ్ రోల్‌లో నటించిన వెబ్ ఒరిజినల్ ఇది. భామా కలాపంతో తెలుగు ఓటీటీ డెబ్యూ చేస్తున్నారు ప్రియమణి. ఈ అత్యద్భుతమైన రుచికరమైన హోమ్ కుక్డ్ థ్రిల్లర్‌ని డైరక్ట్ చేసింది అభిమన్యు తాడిమేటి. ఫిబ్రవరి 11 నుంచి ఆహాలో అందుబాటులోకి రానుంది ఈ వెబ్ ఒరిజినల్. డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ ఈ షో రన్నర్. పుష్ప ఫేమ్ నటి రష్మిక మందన్న ఆదివారం భామాకలాపం టీజర్‌ని విడుదల చేశారు.
గృహిణి అనుపమ ఓ పాత అపార్ట్ మెంట్‌లో ఉంటుంది. పొరుగిళ్లలోని విషయాలు తెలుసుకోవడానికి ఆతృత కనబరిచే తత్వం ఉన్న మహిళ. అందులో ఉన్న మజా ఏంటో తనకు బాగా తెలుసనే నమ్మకంతో ఉంటుంది. వర్షం పడుతున్న ఓ అర్ధరాత్రి ఆ అపార్ట్ మెంట్‌లో ఓ హత్య జరుగుతుంది. ఆ క్రైమ్ సీన్ చుట్టూ చిక్కటి మిస్టరీ అల్లుకుని ఉంటుంది. గూండాలు, గన్నులు, ఛేజ్‌లతో సాగుతుంది. ఆ మర్డర్‌కీ అనుపమకి ఏంటి సంబంధం? దీనివల్ల ఆమె జీవితం ఎటు వెళ్లింది? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
యూట్యూబ్‌లో పాపులర్ కుక్కరీ చానెల్ రన్ చేసే మహిళగా, గృహిణి పాత్రలో నటించారు ప్రియమణి. జాన్ విజయ్, పమ్మి సాయి, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటించారు. సుధీర్ ఈదర, ఎస్‌వీసీసీ డిజిటల్ భోగవల్లి బాపినీడు (అశోకవనంలో అర్జున కల్యాణం) ఈ సినిమాను నిర్మించారు.
ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు, ఫస్ట్ గ్లింప్స్ కు చాలా మంచి స్పందన వస్తోంది. రాధేశ్యామ్, డియర్ కామ్రేడ్‌కు స్వరాలందించిన జస్టిన్ ప్రభాకరన్ ఈ వెబ్ ఒరిజినల్‌కు సంగీతం అందించారు. దీపక్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. విప్లవ్ ఈ ఒరిజినల్‌కు ఎడిటర్.