న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా శనివారం నాడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
వేణు శ్రీరామ్ మాట్లాడుతూ.. ఎంసీఏ తరువాత నాకు వెంకట్ గారు మొదట అడ్వాన్స్ ఇచ్చారు. లాభం తక్కువ వచ్చినా పర్లేదు కానీ మంచి సినిమా తీయమని అన్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ మీద మున్ముందు చాలా మంచి సినిమాలు రాబోతోన్నాయి. వెంకట్ గారికి ఈ చాన్స్ ఇచ్చినందుకు నానికి థ్యాంక్స్. ట్రైలర్ చూస్తుంటేనే ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో అర్థమవుతోంది. ఆల్ ది బెస్ట్ రాహుల్. సింగిల్ ఎమోషన్స్ ఉన్న సినిమాను తీయడమే కష్టం. అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాను హ్యాండిల్ చేయడం ఇంకా చాలా కష్టం. ఇందులో రాహుల్ ఇద్దరు నానిలను హ్యాండిల్ చేశారు. మిక్కీ జే మేయర్ ప్రతీ ఏడాది ఓ ఆల్బమ్‌తో అలరిస్తూనే ఉంటారు. సాయి పల్లవి గారు అద్భుతమైన నటి అని అందరికీ తెలుసు. ఆమెకు సౌత్ ఇండియా అంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె తెలుగు సినిమాల్లో నటించి మన స్థాయిని పెంచారు. ఇప్పుడు మళ్లీ శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లో ఇంకో షేడ్ చూస్తారు. మీ గుండెల్లో నిలిచిపోతుంది. కృతి శెట్టి, మడోన్నాలకు కంగ్రాట్స్. నాని నా హీరో. నా కెరీర్‌ను రీ స్టార్ట్ చేయించాడు. మంచి కథ ఉంటే నానిని గెలవచ్చు. కథకు సరెండర్ అవుతారు. నాని గారు చాలా మంది కొత్త వాళ్లకి లైఫ్ ఇస్తున్నారు. నానిని పక్కింటి అబ్బాయిలా చూడటం ఇష్టం. కానీ ఆయన అన్ని రకాల పాత్రలను చేయగలరు. ఆ పొటెన్షియల్ చాలా పెద్దది. తనలోని యాక్టింగ్‌ను శ్యామ్ సింగ రాయ్‌లో చూపించబోతోన్నారు. కళ్లలోనే ఆ ఇంటెన్సిటీ ఉంది. క్రిస్మస్ మనదే అని అన్నారు.
శైలేష్ కొలను మాట్లాడుతూ.. డైరెక్టర్ అవ్వక ముందు నేను నాని అభిమానిని. ఇప్పుడు కూడా నేను నాని ఫ్యాన్‌నే. ఈ సినిమాకు పని చేసిన వారంతా కూడా నాకు కావాల్సిన వారే. డైరెక్టర్ రాహుల్ నా స్నేహితుడు. నిర్మాత వెంకట్ గారితో త్వరలోనే సినిమా చేయబోతోన్నాను. శ్యామ్ సింగ రాయ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు.
అనిల్ సుంకర నిర్మాత మాట్లాడుతూ.. వెంకట్ బోయనపల్లి గారి నిర్మాతగా ఇండస్ట్రీకి రావడం మంచి అవకాశం. అయన్ను ముద్దుగా ప్రజెంటర్ అని పిలుచుకుంటాం. ఎవరికి ఏ సాయం కావాలన్నా ముందుంటారు. ఈ రోజు నిర్మాతగా వస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో సుధీర్ఘంగా ఉంటారు. నాని గారు ఎంతో మంది కెరీర్‌లను లాంచ్ చేస్తారు. రీ లాంచ్ చేస్తూనే ఉంటారు. ఇలానే ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నారు. సినిమా టైటిల్ శ్యామ్ సింగ రాయ్ (ఎస్ఎస్ఆర్) అని చెప్పినప్పుడు నాకు సమర సింహా రెడ్డి గుర్తుకువచ్చింది. ఎస్ఎస్ఆర్ అనే వాటికి తెలుగు ఇండస్ట్రీలో గొప్ప చరిత్ర ఉంది. ఎస్ఎస్ఆర్.. ఎస్ఎస్ రాజమౌళి తెలుగు ఇండస్ట్రీని ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాను విజయవంతం చేయాలనికోరారు.
రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. ఒక గొప్ప చిత్రం.. వెయ్యి చిత్రాలను తీసే గొప్ప శక్తినిస్తుంది. టికెట్ కొని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వొచ్చు లేదా ఐదేళ్లు కష్టపడి బాహుబలిని చూపించొచ్చు. ప్రేక్షకుడిని మరో లోకంలోకి తీసుకెళ్లాలని తపించే ప్రతీ ఒక్క మేకర్‌కి నా జోహర్లు. అలాంటి మరో ప్రయత్నమే మా శ్యామ్ సింగ రాయ్. కథ బెంగాల్‌కు వెళ్తుందనే పాయింట్ నాకు మొదటగా నచ్చింది. నేను ఒక్కడినే సినిమాను డైరెక్ట్ చేయలేదు. నాతో పాటు డెస్టినీ కూడా డైరెక్ట్ చేసింది. సాను జాన్ వర్గీస్ గారు తన కెమెరాతో ఓ మూడ్‌లోకి తీసుకెళ్లారు. మిక్కీ జే మేయర్ హ్యాపీ డేస్ సినిమాతో నా లవ్ స్టోరీ మొదలైంది. నా మొదటి ప్రేమ కథకు మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రానికి మొదటగా ఏఆర్ రెహమాన్ అనుకున్నారు. ఆయన దొరకలేదు. ఆ తరువాత నెక్ట్స్ మేం మిక్కీ జే మేయర్‌కు ఫిక్స్ అయ్యాం. అంతర్ మహల్ అనే సెట్‌ను అవినాష్ గారు అద్భుతంగా వేశారు. అందరం చీమల్లా కష్టపడి ఒక్కో రాయి పేర్చుకుంటూ గుడిని కట్టాం. ఆ గుడిలోకి 24వ తేదీన మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆ గుడి కట్టే చాన్స్ ఇచ్చిన నిర్మాత వెంకట్ గారికి థ్యాంక్స్. ఇది డెస్టినీ అవ్వడానికి వెంకట్ గారే కారణం. నిర్మాతలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. తండ్రిలా మా వెంటే ఉన్నారు. నా డైరెక్షన్ గత వారం రోజులుగా నిద్రకూడా పోకుండా పని చేశారు. 60 కోట్ల భారీ బడ్జెట్ సినిమాను మోసేంత సామార్థ్యం నాకు లేదు. కానీ మా కో డైరెక్టర్ శివ గారు హ్యాండిల్ చేశారు. ఎడిటింగ్ టీం చాలా కష్టపడింది. ఈ సినిమా డెస్టినీ కావడానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మరో కారణం. మొదటగా ఆయనతో పాట రాయించుకునే శక్తి నాకుందా? అని అనుకున్నాను. కానీ అవుట్ పుట్ చూసుకున్నాక నాకు ధైర్యం వచ్చింది. ఆయన్ను కలిశాను. రెండు పాటలు రాయమని అడిగాను. సాయి పల్లవి కళ్లు, చెంపలు, నవ్వు, నాని గారి మీసం, విజువల్స్, కాస్ట్యూమ్ చూసి లైన్స్ రాశారు. ఆయన రాసే ఐదు నిమిషాల పాటకు మూడు గంటల చిత్రాన్ని మనసులో పెట్టుకుని రాస్తారు. ప్రతీ అక్షరంతో ఏదో చెప్పాలని రాస్తారు. సిరివెన్నెల గారి చివరి పాట మాకు రావడం డెస్టినీ కాక ఇంకేం అవుతుంది. అనురాగ్ కులకర్ణి పాట పాడుతూ ఉంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. తెలుగు వారికి మనీష్ వాద్వా గారిని పరిచయం చేస్తున్నాను. మళ్లీ అమ్రిష్ పురి గుర్తుకు వస్తారు. పద్మావత్ సినిమాలో దీపకా పడుకోణెకు తండ్రిగా నటించారు. ఇలాంటి క్యాస్టింగ్ ఎలా కుదిరిందని అందరూ అడిగారు. మడోన్నా గారితో పని చేయడం ఆనందంగా ఉంది. కొత్త మడోన్నాను చూస్తారు. ఇంత చిన్న పిల్ల ఈ పాత్రకు సెట్ అవుతుందా? అని కృతి శెట్టిని చూసినప్పుడు అనుకున్నాను. కానీ ఆమె కారెక్టర్ కోసం ఎంతో కష్టపడింది. ఇండియాలో ఇప్పుడు ఉన్న గొప్ప నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు. రాబోయే తరానికి సాయి పల్లవి ఓ లెజెండ్ అవుతారు. సాయి పల్లవి గారు కొన్ని సీన్స్‌లో మ్యాజిక్ చేశారు. మీరు కచ్చితంగా డిసెంబర్ 24న చూడాల్సిందే. సాయి పల్లవి గారితో పని చేసే అవకాశం మళ్లీ మళ్లీ వస్తుందని ఆశిస్తున్నాను. ఆ పాత్రకు సాయి పల్లవి గారు ప్రాణం పోశారు. నాని గారు ఈ కథను నమ్మినంతగా ఎవరు నమ్మినా ఈ సినిమాను తీసేయోచ్చు. వంద కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వలేని నమ్మకాన్ని మీరు నాకు ఇచ్చారు. ప్రతీ డిపార్ట్మెంట్‌కు మీరు సాయం చేశారు. శ్యామ్ సింగ రాయ్ పాత్ర మీకోసమే పుట్టింది. ఆయన మీసం తిప్పిన తరువాత మేం అంతా షాక్ అయ్యాం. ఆయన్ను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఇప్పటి వరకు మీరు నాని అంటే న్యాచురల్ స్టార్‌నే చూశారు. కానీ మిగతా స్టార్లు ఇకపై కనిపిస్తాయి. ఆయనకు చిన్న కథలు ఇవ్వకండి. ఆయన సత్తా ఏంటో ఇక మున్ముందు చూడబోతోన్నాం. తెలుగు ఇండస్ట్రీలో కొత్త నానిని చూడబోతోన్నాం. శ్యామ్ సింగ రాయ్ సినిమాతో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. అందుకే మొదటి సారిగా ఇన్ షర్ట్ వేసుకున్నాను. నన్ను పట్టభద్రుడిని చేసింది. డిసెంబర్ 24న మిమ్మల్ని థియేటర్‌కు పిలుస్తున్నాం. యాభై ఏళ్లు వెనక్కి వెళ్దాం. శ్యామ్‌ని కలవండి.. మిగతా పాత్రలతో మాట్లాడండి. మా సినిమా మీకోసం ఎదురుచూస్తోంది అని అన్నారు.
మడోన్నా సెబాస్టియన్ మాట్లాడుతూ.. శ్యామ్ సింగ రాయ్ టీంతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో మంచి టీం. అద్భుతమైన కథ. ఈ సినిమాను మీరంతా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ చిత్రం భాగస్వామిని అవ్వడం సంతోషంగా ఉంది అని అన్నారు.
కృతి శెట్టి మాట్లాడుతూ.. నేను ఏం చేసినా కూడా మీ (ఆడియెన్స్) కోసమే చేస్తాను. ఈ పాత్రను కూడా అందుకే చేశాను. ఈ పాత్ర బెబ్బమ్మలాంటిది కాదు. కృతి లాంటిది కూడా కాదు. మీకు ఓ కొత్త ఫీల్‌ను ఇస్తానని అనిపించింది. అందుకే ఈ పాత్రను చేశాను. కీర్తి పాత్రకు యూత్ బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చినందుకు రాహుల్ గారికి థ్యాంక్స్. నాని గారు అందరినీ ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయన ఎంతో స్వీట్ పర్సన్. సాయి పల్లవి యాక్టింగ్‌కి అందరూ ఫిదా అయిపోతారు అని అన్నారు.
సాయి పల్లవి మాట్లాడుతూ.. ఈ కళలు మనకు దేవుడు ఇస్తాడు. అవి మనకు రావడం అదృష్ణం. కొందరికి దేవుడు పుట్టుకతోనే ఇస్తాడు. ఇంకొందరు ఎంతో కష్టపడి నేర్చుకుంటారు. నటించాలని, డ్యాన్స్ చేయాలని ఎంతో మందికి ఉంటుంది. కానీ కొంత మందే అవుతారు. కొంత మందికే అవకాశాలు వస్తాయి. నాకు ఈ ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చినందుకు, నన్ను నమ్మి పాత్రలు ఇస్తున్న దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. ఇదంతా కూడా ఆడియెన్స్ నన్ను అంగీకరించినందుకు జరిగింది. వారే నమ్మకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. ఇలాంటి చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేషనల్ అవార్డ్, ఆస్కార్ వచ్చినప్పుడే ఇలా ఏడుస్తానని అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు ఏడుపు వచ్చేసింది. నటిగా మారడమే నాకు పెద్ద అవార్డులా అనిపిస్తోంది. మా అందరినీ ఇంత ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను దేవుడికి థ్యాంక్స్అని అన్నారు.
నాని మాట్లాడుతూ.. అనురాగ్ అద్భుతంగా పాట పాడారు. ఇలా లైవ్‌లో ఎన్నో సార్లు చూశాను. కానీ ఈ రోజు మాత్రం ఏదో అద్భుతమని అనిపించింది. సిరివెన్నెల గారి ఆశీస్సులున్నాయ్ కాబట్టే అలా అనిపించిందేమో. ఎప్పుడూ వైట్ షర్ట్, బ్లాక్ షర్ట్ వేసుకునే వస్తాడని అందరూ అంటుంటారు. అందుకే మా ఆవిడ ఓ పది బ్లేజర్‌లు కొనేసింది. మనం ఏం పీకామని అని నేను వేసుకోలేదు. బాగా దుమ్ముపట్టి పోయాయ్. కానీ శ్యామ్ సింగ రాయ్ సినిమా చూశాక వేసుకోవాలని అనిపించింది. ఇంతకు మించి సినిమా గురించి రిపీట్ చేసి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మా టీం అందరి కళ్లలో కనిపిస్తున్న ఫీలింగ్ డిసెంబర్ 24న మీకు తెలుస్తుంది. మీ కళ్లలో కూడా 24న కనిపిస్తుంది. చాలా మంచి సినిమాను చేసి, మేం చూశాక.. ఆడియెన్స్‌కు చూపించేందుకు ఎక్కువ గ్యాప్ ఉండకూడదని ఈ సినిమాతోనే తెలిసింది. ఈ సినిమాను ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు చూస్తారా? అని ఎదురుచూస్తున్నాను. మిక్కీ జే మేయర్, సాను వర్గీజ్ పనితనం ఎంత గొప్పగా ఉంటుందో డిసెంబర్ 24న తెలుస్తుంది. సాయి పల్లవి ఎందుకంత ఎమోషనల్ అయిందో ఆ రోజునే తెలుస్తుంది. సాయి పల్లవి, కృతి శెట్టిలు అద్భుతంగా నటించారు. రాహుల్‌ని నేను ఇప్పుడు ఎంత పొగిడినా సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. రాహుల్ సైడ్ నుంచి పెద్ద సర్ ప్రైజ్ ఉండబోతోంది. మిక్కీ అద్భుతమైన సంగీతమిచ్చాడు. వెంకట్ గారికి ఇది మొదటి సినిమా. ఇలాంటి చిత్రం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. వెంకట్ గారు ఇంత కాలం పడిన కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కుతుంది. మడోన్నా చేసిన రోల్ ఎంతో కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. అంత త్వరగా ఏ నటి కూడా అంగీకరించరు. ఈ సినిమా తరువాత మడోన్నాకు మంచి పేరు వస్తుంది. మనీష్ గారు ఫైట్స్ విషయంలో చాలా కష్టపడ్డారు. డిసెంబర్ 24న రాబోతోన్నాం. క్రిస్మస్ మాత్రం మనదే అని అన్నారు.