సినీ పరిశ్రమ కోసం మేము కూడా ఏపీ సీఎంను కలుస్తాం: ప్రెస్ మీట్లో నట్టికుమార్ సంచలనం
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న నిర్మాతలు కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యల పరిష్కారం కోసం తాము కూడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరామని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ స్పష్టం చేశారు. ఇప్పటికే మెగాస్టార్హై చిరంజీవి నేతృత్వంలో పరిశ్రమకు చెందిన ఓ బృందం ఏపీ సీ ఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో పరిశ్రమకు చెందిన కొందరు ఆహ్వానితులు భేటీ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ భేటీకి చిన్న నిర్మాతలను పిలవలేదని నట్టికుమార్ ఆ మధ్య ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో చిరంజీవి టీమ్ కు సెప్టెంబర్ 4వ తేదీ అపాయింట్ మెంట్ ఇచ్చారన్నట్టు మీడియాలో వార్తలు వస్తుండటంతో సోమవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో నట్టికుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ.. చిరంజీవి బృందంలో తమ చిన్న నిర్మాతలకు ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరం. వాస్తవానికి ఆయనను మేము ఎంతో గౌరవిస్తాం. మా చిన్న నిర్మాతల సమస్యలను ముఖ్యమంత్రిని కలిసినపుడు చిరంజీవి తీసుకుని వెళతారని విశ్వసిస్తున్నా. ఒకవేళ ఆయన మా సమస్యలను ఏకరువు పెడితే సంతోషమే. అయినా చిన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ సమస్యలను 20 మందితో కూడిన బృందం వేరొకటి ఏపీ ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ అడిగాం. 35 జీవో అనేది చిన్న నిర్మాతల, అలాగే పరిశ్రమ పాలిట కల్పతరువు. ఎట్టి పరిస్థితులలో దానిని ఉపసంహరించరాదు అన్నది మా విన్నపం. అలాగే టిక్కెట్ రేట్స్ 100 రూపాయలు మించరాదన్నది మా మరో విజ్ఞప్తి. ఇక బి. సి. సెంటర్స్ లో మరీ తక్కువగా ఉన్న టిక్కెట్ల రేట్లను ఇంకాస్త పెంచాలి. బ్లాక్ టిక్కెట్లు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని మేము సీఎంను కోరబోతున్నాం. కొందరు పెద్ద నిర్మాతలు, ఇంకొందరు సినీ ప్రముఖులు పరిశ్రమ మనుగడ కంటే వారి కోట్ల సంపాదనే చూసుకుంటున్నారు. చిన్న నిర్మాతలను ఏ రోజు వారు పట్టించుకోలేదు. ఈ తడవ అలాంటి కుయుక్తులకు అడ్డుకట్టవేయాలన్న సంకల్పంతో మేము సీఎంను కలవాలనుకుని నిర్ణయించుకున్నాం అని చెప్పారు.
రఘురామకృష్ణంరాజుకు ఇదే నా సవాల్
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఎంపై చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని నట్టికుమార్ ఇదే ప్రెస్ మీట్లో అన్నారు. సీఎం జగన్ చడ్డీలు వేసుకున్న నాటి థియేటర్ టిక్కెట్ ధరలను నేడు కొనసాగిస్తున్నారంటూ విమర్శించడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. రఘురామ కృష్ణంరాజుకు పరిశ్రమలోని పలువురితో పరిచయాలు ఉండవచ్చునని, అంతమాత్రాన సినీరంగంలోని సమస్యల మీద సంపూర్ణ అవగాహన లేకుండా, కేవలం విమర్శించాలన్న ఉద్దేశ్యంతో మాట్లాడటం బాధ్యతారాహిత్యమేనని నట్టి కుమార్ దుయ్యబట్టారు. జీవో 35కు విరుద్ధంగా టికెట్ల రేట్లు 200, 300 రూపాయలు ఉండాలంటూ ఆయన సపోర్ట్ చేస్తున్నారని, ఇది ప్రేక్షకులకు ఎంత మాత్రం ఇష్టంలేదని చెప్పారు. కొందరు సినీ పెద్దలు ఆయనతో ఆలా మాట్లాడించారని తాను అనుకుంటున్నాను. దీనిపై తాను ఆయనకు సవాల్ చేస్తున్నాను. ఇందుకు ఆయన సిద్దమేనా అని నట్టి కుమార్ డిమాండ్ చేశారు. ఆయన పార్లమెంట్ నియోజకవర్గమైన నర్సాపురంలోనే బహిరంగంగా ప్రజల మధ్యన టిక్కెట్ల రేట్ల విషయంలో ఎవరు కరెక్టో తేల్చుకునేందుకు తనతో కలిసి వస్తారా? అని నట్టి కుమార్ ఛాలెంజ్ చేశారు. రఘురామ కృష్ణంరాజు ప్రజాకోర్టులో ఓడిపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని, ఒకవేళ తాను ఓడిపోతే ఆయనకు ప్రజా సమక్షంలో పాలాభిషేకం చేస్తానని నట్టి కుమార్ స్పష్టం చేశారు.