కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో తెలియంది కాదు. ముఖ్యంగా థియేటర్లు మూత పడటంతో ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే తెరుచుకున్న థియేటర్లలోకి పూర్తయిన సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. నెమలి అనిల్, సుభాంగిపంత్, విరాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన రావే నా చెలియా చిత్రం ఈరోజు(ఆగస్ట్ 13) థియేటర్లలోకి వచ్చింది. టైటిల్‌లోనే ఇదొక ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది. మరి ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? అసలిందులో ఉన్న ప్రేమకథ ఏంటి? సినిమా ఎలా తెరకెక్కింది వంటి విషయాలు తెలుసుకుందాం.
కథ: గగన్(నెమలి అనిల్) ఫ్యాక్షన్ చిత్రాలు రూపొందించే ఓ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలన్నీ ఫట్ అవ్వడంతో.. ఇకపై ఫ్యాక్షన్ వద్దు.. మంచి లవ్ స్టోరీతో సినిమా కావాలి. మీరు చేయలేమంటే వేరే దర్శకుడితో సినిమా చేసుకుంటాం అని నిర్మాత సీరియస్‌గా చెప్పడంతో.. లవ్ స్టోరీతోనే సినిమా చేస్తానని చెప్పి.. కథ రెడీ చేసుకోవడం కోసం గగన్ వైజాగ్ బయలుదేరతాడు. దారిలో రాజీ (సుభాంగిపంత్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయిని అనుసరించి, ఆమెకు ఓ ప్రేమకథ ఉందని తెలుసుకుని, ఆ ప్రేమకథని ఆమెనే హీరోయిన్‌గా పెట్టి సినిమా చేయడం స్టార్ట్ చేస్తాడు. పెళ్లి వరకు వెళ్లిన రాజీ, సాగర్(విరాజ్)ల ప్రేమకథకు ఎందుకు బ్రేక్ పడింది?. సినిమా తీసే క్రమంలో గగన్, రాజీ ఎంత దగ్గరయ్యారు? ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడిన సాగర్‌కా? తనే ప్రాణంగా ప్రేమించిన గగన్‌కా?.. చివరికీ రాజీ ఎవరికి దక్కుతుంది? వంటి వాటికి సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: హీరో అనిల్‌కి ఇది తొలి చిత్రమే అయినా.. నటనపరంగా మంచి మార్కులే వేయించుకున్నాడు. ఫ్యాక్షన్ చిత్రాల డైరెక్టర్‌గా పరిచయమైనా.. డైరెక్టర్‌కి ఓపిక ఎక్కువ ఉండాలి అనేలా సెటిల్డ్ నటనను కనబరిచాడు. మున్ముందు హీరోగా కొనసాగాలంటే నటనపరంగా అతనికి వంక పెట్టాల్సిన పనిలేదు.. కానీ కాస్త శరీరంపై మాత్రం దృష్టిపెట్టాల్సి ఉంటుంది. డ్యాన్స్, ఫైట్స్ విషయంలోగానీ, డైలాగ్స్ పలికిన విధానంలో కానీ అతనికిది తొలి చిత్రం అని అనిపించదు. హీరోయిన్ సుభాంగిపంత్‌కి మంచి పాత్ర పడింది. పల్లెటూరి అమ్మాయిగా, సినిమాలో హీరోయిన్‌గా, ఇద్దరి ప్రేమను పొందే ప్రేమికురాలిగా.. బాధ్యతతో కూడిన పాత్రలో చక్కగా నటించింది. గ్లామర్‌గా కనిపించేందుకు అందాలు ఆరబోయకుండానే.. క్యూట్ నటనతో ఆకట్టుకుంది. సెకండ్ హీరోగా నటించిన విరాజ్ పాత్రను ఎక్కువసేపు పడుకోబెట్టారు కానీ.. కనిపించిన కొన్ని సన్నివేశాల్లో మంచి నటనను కనబరిచాడు. ఆయనని చూస్తుంటే గోపీచంద్‌కి డూప్‌లా అనిపిస్తుంది. ఇక సీనియర్ నటి అనిత పాత్రను ఇంటికే పరిమితం చేయగా.. రచ్చరవి, రాము, రఘు కనిపించింది కొన్ని సీన్లే అయినా నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా ఆర్టిస్ట్‌లందరూ కొత్తవారే అయినా.. వారి పాత్రల పరిధిమేర చక్కగానే నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోరు, అలాగే పాటలు బాగున్నాయి. చిన్న సినిమా కావడంతో పాటలు సరిగా ఫోకస్ అవ్వలేదు కానీ.. పాటలు వినడానికి బాగున్నాయి. ఎమ్.ఎమ్. కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. పల్లెటూరి అందాలను కెమెరామెన్ విజయ్ చక్కగా బంధించారు. సినిమా మొత్తం పల్లెటూరి వాతావరణంలోనే చిత్రీకరించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించాల్సిందే. ఎడిటర్ రవి తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టాల్సింది. డ్యాన్స్, ఫైట్స్ ఓకే. దర్శకుడు మహేశ్వరరెడ్డి తను చెప్పాలనుకున్న కథని సూటిగా చెప్పారు. ఎక్కడా ల్యాగ్ లేకుండా చూస్తున్న ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ప్రేమకథను నడిపారు. ఆయన అనుకున్న పాయింట్‌ని తెరపై చక్కగా ప్రజంట్ చేశారు. నిర్మాణ విలువలకు వస్తే.. ఈ సినిమా చిన్న సినిమా అని అనిపించదు. రిచ్‌గా తెరకెక్కించారు.
విశ్లేషణ: సినిమా స్టార్టింగే ఓ యాక్సిడెంట్‌తో మొదలవుతుంది. ఆ యాక్సిడెంట్ ఎలా అయ్యింది అనేది తర్వాత రివీల్ చేసిన తీరు బాగుంది. అలాగే హీరో తొలి చూపులోనే హీరోయిన్ ప్రేమలో పడిపోవడం, ఆ హీరోయిన్ కోసం ప్రయత్నిస్తూ.. ఆమెకున్న కథనే సినిమాగా తీయాలనుకోవడం కథను నడిపించడానికి దర్శకుడు వినియోగించుకుంటేనే.. ఇష్టం వేరు- ప్రేమ వేరు అని చక్కని మెసేజ్ యువతకి ఇచ్చే ప్రయత్నం చేశారు. క్లీన్‌గా సినిమాని తెరకెక్కించారు. అంటే ఎటువంటి బూతు డైలాగులు లేకుండా.. ఫ్యామిలీ అంతా కూర్చోని చూసేలా సినిమాని రూపొందించాడు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించవచ్చు. ఇక స్ర్కీన్‌ప్లే విషయంలో కాస్త దృష్టి పెట్టాల్సింది. స్టార్టింగ్‌లో గగన్ పాత్రని, విరామం తర్వాత ఎమోషనల్ సీన్స్‌ని ఇంకాస్త హైలెట్ చేసే స్కోప్ ఉన్నా దర్శకుడు వినియోగించుకోలేదు. హీరోయిన్‌కి ప్రేమికుడు ఉన్నాడని తెలిసి కూడా, హీరో ఆమెను ప్రేమించే సీన్స్ విషయంలో ఇంకాస్త క్లారిటీ ఇవ్వాల్సింది. అలాగే హీరోయిన్ కూడా తనకు ఇంకొకరితో పెళ్లి అవుతుందని తెలిసి కూడా హీరోని ప్రేమించే విధానం అంత బలంగా అనిపించదు. వీటన్నింటికీ క్లైమాక్స్‌లో దర్శకుడు ఇచ్చే వివరణ కన్విన్సెంగ్‌గా అనిపించినా.. ఇంకాస్త క్లారిటీగా చెప్పి ఉంటే బాగుండేది. తాజ్‌మహల్ ఇష్టం కదా అని.. పక్కనే ఇల్లు కట్టుకుని దానితో కాపురం చేయలేము కదా అనే డైలాగ్ ఒక్కటి చాలు ఈ సినిమాలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో తెలియడానికి. ఇష్టం వేరు-ప్రేమ వేరు ఇదే రావే నా చెలియా సినిమా.
నటీనటులు: నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్, సీనియర్ నటి కవిత, రఘు కారుమంచి, రచ్చ రవి తదితరులు.
కెమెరా: విజయ్ ఠాగూర్, డైలాగ్స్: మల్లేశ్వర్ బుగ్గ, ఎడిటర్: రవి మన్ల, మ్యూజిక్: ఎమ్ ఎమ్ కుమార్, ఆర్ట్: నారాయణ, నిర్మాత: నెమలి అనిల్, కథ-దర్శకత్వం: మహేశ్వర రెడ్డి. ADVT