నిర్మాతగా ఈ ఏడాది పెద్ద సక్సెస్ కొడతాను –యం. రాజశేఖర్ రెడ్డి
తమిళంలో మంచి విజయాలు సొంతం చేసుకున్న ప్రేమలో పడితే, నకిలీ చిత్రాలను తెలుగులోకి అనువదించి నిర్మాతగా తొలి అడుగులను వేశాను. తర్వాత ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో శైవం చిత్రాన్ని నిర్మించి పెద్ద విజయాన్ని రుచి చూశాను, తెలుగులో త్రిపుర చిత్రాన్ని తెరకెక్కించటంతో పాటు దిల్ రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఓ మై ఫ్రెండ్ చిత్రాన్ని శ్రీధర్ అనే పేరుతో తమిళంలో విడుదల చేశాను. తెలుగులో మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న కేరాఫ్ కంచెరపాలెం చిత్రాన్ని తమిళంలో కేరాఫ్ కాదల్ గా రీమేక్ చేసి ఫిబ్రవరి 12న విడుదల చేశాను అన్నారు నిర్మాత రాజశేఖర్ రెడ్డి. మే 29 రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ– నేను ఎప్పుడు తెరముందుకు రావటానికి ఇష్టపడను.
ఈ సారి ఎందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పరిశ్రమలు కోవిడ్ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అందుకే నా వంతుగా సీయం రిలీఫ్ ఫండ్‌కు 11 లక్షల రూపాయల సహాయాన్ని అందించటంతో పాటు ఎంతోమంది ఆపదలో ఉన్న స్నేహితులకు ఆసుపత్రిలో చేర్పించి వారి అవసరాలు తీర్చి అనేక రకాలుగా ఆసరాగా ఉన్నాను. 2021వ సంవత్సరం నిర్మాతగా నాకు ఛాలెంజ్ అనే చెప్పాలి. ఈ ఏడాది నా సినిమాలు నాలుగింటిలో ఓ చిత్రం కేరాఫ్ కాదల్ విడుదలవ్వగా మిగిలిన మూడు చిత్రాలు విడుదలవ్వనున్నాయి.
విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్‌లు హీరోలుగా అక్షర హాసన్ హీరోయిన్‌గా నవీన్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మించిన జ్వాలా అనే భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంటగా పృధ్వీ దర్శకత్వంలో క్లాప్ చిత్రం ఇళయరాజా సంగీతంలో రానుంది. అలాగే ఎ.ఎల్ విజయ్ దర్శకత్వంలో అక్టోబర్ 31 లేడీస్‌నైట్ అనే క్యాప్షన్‌తో విశ్వక్‌సేన్, మేఘా ఆకాశ్, నివేధా పేతురాజ్, మంజిమా మోహన్, రెబ్బాజాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం షూటింగ్ ఫైనల్ దశలో ఉంది. ఈ చిత్రంలో మరో ప్రముఖ హీరోయిన్ మెయిన్‌లీడ్‌లో నటించనున్నారు. అలాగే ఓ ప్రముఖ ఓటిటి చానెల్‌కు వెబ్‌సిరీస్‌ను నిర్మించటానికి అన్ని హంగులు పూర్తయ్యాయి, లాక్‌డౌన్ ముగియగానే షూటింగ్‌కు వెళతాం. ఇన్ని ప్రాజెక్ట్‌లు ఉన్న కారణంగా మీడియా ముందుకు రావలిసి వచ్చింది. 2021లో ఏదో సినిమా పెద్ద హిట్ కొట్టి నిర్మాతగా నిరూపించుకుని పెద్ద హీరోతో సినిమా చేస్తాను. త్వరలోనే దర్శకునిగా నా ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నా. ఈ ఏడాది నిర్మాతగా నాకు లక్కీ ఇయర్ అనుకుంటున్నా అన్నారు.