Advertisement
Google Ads BL

బీఏ రాజుకు అశ్రు నివాళి


ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, పీఆర్వో, సూపర్ హిట్ మ్యాగజైన్ అధినేత బీఏ రాజు ఈ నెల 21న శుక్రవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో అజాత శ్రతువుగా పేరొందిన బీఏ రాజు మరణంపై యావత్ సినీ పరిశ్రమ సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం సాయంత్రం సినీ జర్నలిస్టులు సంతాప కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, సూపర్ హిట్  రాంబాబు వర్మ, సంతోషం అధినేత సురేష్ కొండేటి ఆధ్వర్యంలో వెంకట్ సాంకేతిక సాయంతో జరిగిన ఈ సంతాప కార్యక్రమంలో బీఏ రాజు కుమారులు అరుణ్ కుమార్, శివకుమార్‌తో పాటు సినీ జర్నలిస్టులందరూ పాల్గొన్నారు. అనేక మంది బీఏ రాజుతో ఉన్న అనుబంధాన్ని పంచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. సినీ జర్నలిస్టులకు ఆయన ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు.

Advertisement
CJ Advs

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. 1994లో బీఏ రాజు సూపర్ హిట్ మ్యాగజైన్ పత్రికను ప్రారంభించారు. అప్పుడు నన్ను చీఫ్ రిపోర్టర్‌గా రమ్మన్నారు. ఎంతో కమిటెడ్‌గా పత్రికను నడిపారు. ఎంతోమంది జర్నలిస్టులు అందులో పని చేశారు. రాజు గారి సతీమణి జయగారి లీడర్ షిప్‌లో ఆ పత్రిక ఎంతో ఆదరణ పొందింది. బీఏ రాజు గారు ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండేవారు. తన పని తాను చేసుకుపోయేవారు. నిర్మాతగాను తన మార్కు చూపించారు. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఆయన వర్కింగ్ స్టయిల్ ఎవరికీ రాదు. పీఆర్వోగా ఇక ఆయన ఒక లెజెండ్. ఇండస్ట్రీలోని అందరితోనూ సమన్వయం చేసుకుంటూ ఎంతో ఓపికతో పని చేసేవారు. జర్నలిస్ట్‌గా చాలా డెప్త్‌గా సమాచారం సేకరించేవారు. ఏ సమాచారం అయినా వేళ్ల మీద చెప్పేసేవారు. ఆయన చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు స్వర్గ ప్రాప్తి కలగాలి అన్నారు.

మోహన్ గోటేటి మాట్లాడుతూ.. బీఏ రాజు జర్నలిస్టు మిత్రుడిగా నాకు చెన్నైలో పరిచయం. నాకు చాలా ఆప్తుడు అయ్యారు. మా ఇద్దరి భావాలు కలిశాయి. ఎలా రాయాలో ఎలా రాయకూడదో నాకు నేర్పించారు. ఆయనతో అవుట్ డోర్ షూటింగ్‌కు ఎన్నో సార్లు తీసుకెళ్లేవారు. ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవారు. రాజుతో ఎన్నో మధురానుభూతులున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. అన్నారు.

ఏ బాల్ రెడ్డి మాట్లాడుతూ.. బి ఏ రాజు గారు నేను సితార పత్రిక తరపున ట్రైనీగా 1987 మద్రాస్  వెళ్ళాను. అప్పటికి అక్కడి పరిస్థితులు నాకు అర్ధం అవటం లేదు అలాంటి పరిస్థిలో కృష్ణ గారి పి ఆర్ ఓ గా నాకు రాజు పరిచయం అయ్యాడు. అలా పరిచయం అయిన రాజు నేను శివరంజని ఎడిటర్ గా  హైదరాబాద్ వచ్చేసాను రాజు మద్రాస్ లో వుండి శివరంజని వ్యవహారాలు చూసేవాడు. అతని సేవలు శివరంజనికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. రాజు లేడ‌నే వార్త నమ్మలేకపోతున్నాను.  అలాంటి మంచి వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా బాధగా వుంది.  ఆయన ఆత్మకుశాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అన్నారు.

నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రాజుతో నాకు మద్రాసు నుంచి పరిచయం ఉంది. రాజు గురించి చెప్పాలంటే తనతో నాది జీవిత కాలపు ప్రయాణం. నాకు ఏ సాయం కావాలన్నా రాజు కాదనకుండా చేసేవాడు. మేమిద్దరం సోదరుల్లా, ప్రాణ మిత్రుల్లా ఉండేవాళ్లం. జయ మరణించినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి రావాలన్నాడు. రాజు చేసిన ఉపకారం నాకు ఎంతో ఉంది. ఎప్పుడు డబ్బులు కావాలన్నా వెంటనే ఇచ్చేవాడు. నా పెళ్లి కోసం హీరోయిన్ రోజాను చెన్నై నుంచి విజయనగరానికి పంపించాడు. అంత గొప్ప వాడు రాజు. రాజు చాలా నిజాయ‌తీ గల వ్యక్తి. తను నిజంగా ‘రాజు’లాంటి వాడు. ఆ పేరుకు సార్థకం చేకూర్చాడు అన్నారు.

గిరిధర్ మాట్లాడుతూ.. 1987లో నేను చెన్నై వెళ్లినప్పుడు కలిసిన తొలి వ్యక్తి బీఏ రాజు. ఆయన ఆప్యాయత చాలా బాగుండేది. నేను చాలా రోజులు వాళ్లింట్లోనే భోజనం చేశాను. బీఏ రాజు నాకు ఫ్రెండ్‌గా దొరకడం నిజంగా నా అదృష్టం. రాజు ఇప్పుడు మనతో లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆయన కుమారులకు మనం అండగా ఉండాలి. ఆయన స్థాపించిన సూపర్ హిట్ మ్యాగజైన్ ఆగిపోకూడదు. ఆ మ్యాగజైన్ రూపంలో ఆయన మనతోనే ఉండాలి అన్నారు.

వినాయకరావు మాట్లాడుతూ.. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఏ ఆర్టికల్ బాగున్నా వెంటనే ఫోన్ చేసి చెప్పేవారు. ఆయనలో ఉన్న గొప్ప గుణం అది. సినిమా గురించి ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచించేవారు. ఎవరి గురించి కూడా నెగిటివ్‌గా ఆలోచించేవారు కాదు. ప్రతిరోజూ పడుకునే ముందు ఒక సినిమా చూసి పడుకునేవారు. కృష్ణగారి సినిమాలంటే ఆయనకు ప్రాణం. అన్నమయ్య సినిమాకు మేమిద్దరం కలిసి పని చేయడం నా అదృష్టం. నేను ఏ పుస్తకం రాసినా తన సహాయం ఉండేది. ఆయన హస్తవాసి మంచిది కాబట్టి సెంటిమెంట్‌గా ఫస్ట్ తన నుంచి డబ్బులు తీసుకునేవాణ్ని. కృష్ణ గారి గురించి పుస్తకం రాస్తున్నానంటే ఎంతో సంతోషించారు. ఆ పుస్తకానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. నేను రాసిన అన్ని పుస్తకాలకు రాజు చేసిస సాయం ఎంతో ఉంది. మూడ్రోజుల క్రితమే తనతో మాట్లాడాను. అదే రాజుతో మాట్లాడిన చివరి మాటలు. ఒక మంచి మిత్రుడు ఇంత త్వరగా దూరం అవుతాడని ఊహించలేదు. రాజు లెగసి కంటిన్యూ అవ్వాలంటే సూపర్ హిట్ మ్యాగజైన్ కంటిన్యూ అవ్వాలి. మనందరం అందుకు సాయం చేయాలి అన్నారు.

ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. సూపర్ హిట్ మ్యాగజైన్‌తోనే నా కెరీర్ మొదలైంది. జయగారు సూర్యుడులా ఉంటే రాజు గారు చంద్రుడిలా ఉండేవారు. నేను సూపర్‌హిట్‌లో పని చేసింది ఒక సంవత్సరమే అయినా కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్‌లా చూశారు. అరుణ్, శివ సూపర్ హిట్ మ్యాగజైన్‌కు కంటిన్యూ చేస్తామని చెప్పగానే చాలా ఆనందమేసింది. నేను ఎప్పుడూ ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవుతుంటా. ఆయన చాలా సమాచారాన్ని అందించేవారు. ఇప్పుడు ఆయన నుంచి సమాచారాన్ని ఎంతో మిస్ అవుతున్నాం. బీఏ రాజు గారి లేని లోటును ఆయన కుమారులు తీర్చాలని కోరుకుంటున్నా అన్నారు.

రెంటాల జయదేవ్ మాట్లాడుతూ.. దాదాపు 30 ఏళ్లుగా ఆయన నాకు తెలుసు. ఈ మధ్య కాలంలో నన్ను ఇంతగా బాధించింది బీఏ రాజు మరణమే. ఆయన ఐడీయాలతో విభేదాలున్నా ఆయనతో మంచి స్నేహం ఉంది. పీఆర్వోలకు ఒక నాయకుడిలా ఉన్న మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం. ఇండస్ట్రీలోని అందరితో స్నేహం చేయడం ఆయనకే చెల్లింది. ఏ సమాచారం కావాలన్నా ఠక్కున సమాధానం చెప్పేస్తారు. ఏ సమయంలో మెసేజ్ పెట్టినా సమాధానం ఇచ్చేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. సూపర్ హిట్ మ్యాగజైన్‌ను ఆయన పిల్లలు కంటిన్యూ చేయాలి అని కోరారు.

స్టార్ మా రఘు మాట్లాడుతూ.. రాజు గారి మరణవార్త బిగ్గెస్ట్ షాక్. దేవుడికి మంచి పీఆర్వో అవసరమై ఆయనను ఇంత త్వరగా తీసుకెళ్లిపోయాడేమో. అందరినీ గుర్తుపెట్టుకుని తీసుకెళ్తారు. జర్నలిస్టులను ఆయనంత బాగా ఎవరూ చూసుకోరు. గుర్తు పెట్టుకుని మరీ సాయం చేస్తారు. ఆయన నిజంగా మా రాజు. జర్నలిస్టులకు, పీఆర్వోలకు ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు.

భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. రాజు గారు నన్ను కుటుంబ సభ్యురాలిగా చూసేవారు. ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నా. నన్ను, మా ఆయన మోహన్‌ను ఎంతో బాగా చూసుకున్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడేవారు. రాజుగారిలో ఉన్న పోలికలు వాళ్ల అబ్బాయి శివలో ఉన్నాయి. రాజు గారి బాధ్యతలను శివ తీసుకోవాలి అన్నారు.

డి.జి.భ‌వాని మాట్లాడుతూ.. రాజుగారికి ఉన్న గొప్ప గుణం, జ‌ర్న‌లిస్టులంద‌రినీ ఇష్ట‌ప‌డ‌తారు. కొత్త, పాత‌.. అని కాకుండా అంద‌రితో చ‌క్క‌గా మాట్లాడుతారు. నేను జ‌ర్న‌లిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసినప్పుడు మ‌హిళా జ‌ర్న‌లిస్టులు చాలా త‌క్కువ మంది ఉన్నారు. కాబ‌ట్టి మీరు బాగా రాణిస్తే మ‌రింత మంది ఇటుగా వ‌స్తారంటూ ఎంక‌రేజ్ చేశారు అన్నారు.

యజ్ఞమూర్తి మాట్లాడుతూ.. రాజుగారితో 20 ఏళ్ల పరిచయం. బాగా రాసే జర్నలిస్టులంటే ఆయనకు చాలా ఇష్టం. కొన్ని వార్తల విషయంలో ఆయనతో వాధించేవాణ్ని. అయితే ఆయనతో మాత్రం మంచి స్నేహం ఉండేది. ఆయన కృష్ణ గారికి వీరాభిమాని అయినప్పటికీ ఇతర హీరోల గురించి కూడా పాజిటివ్‌గా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి బీఏ రాజు గారు. ఆయన ఎక్కడున్నా రాజులాగే ఉండాలి అన్నారు.

మ‌డూరి మ‌ధు మాట్లాడుతూ.. నేను చేసిన ఈ సినీ ప్రయాణంలో సూపర్ హిట్ పత్రికలో పనిచేశాను. ఆ సమయంలో నాకు రాజుగారితో, జయగారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఎంతగానో ఎంకరేజ్ చేశారు. సినిమానే ఆయన లోకం. ఆయన లాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరం అన్నారు.

మోహ‌న్ తుమ్మ‌ల మాట్లాడుతూ.. నన్ను వాళ్లింటి సభ్యుడిగా ట్రీట్ చేసిన వ్యక్తి. ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడేవారు కాదు. సీనియర్ హీరోల సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలను వివరించేవారు. ప్రతి గురువారం కొత్త విషయాలను, సినిమాలోని కష్ట నష్టాలను వివరించేవారు. ఇకపై ఈ వివరాలను ఎవరు చెబుతారో చూడాలి అన్నారు.

సిద్ధు మాట్లాడుతూ.. నేను సూపర్ హిట్‌లో జాయిన్ అయిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తిరోజు తొలి కాల్ రాజుగారితోనే మాట్లాడేవాడిని. అలాగే చివ‌రి కాల్ ఆయ‌న‌తోనే. కానీ ప్ర‌తిరోజు ఫోన్ చేసి ప్ర‌తి విష‌యాన్ని ఎలా చేయాలో వివ‌రించేవారు. నేను అలా చేసుకుంటూ వెళ్లిపోయేవాడిని. త‌ర్వాత విష‌యాల‌ను ఆయ‌నకు అప్‌డేట్ చేసుకుంటూ వ‌చ్చేవాడిని.గ‌త మూడేళ్లుగా ఆయ‌న ఫోన్ లేకుండా రోజు గ‌డిచేది కాదు. అలాంటిది ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి నాకు ఫోన్ వ‌చ్చి మూడు రోజుల‌వుతుంది అన్నారు.

టీవీ5 రాంబాబు మాట్లాడుతూ.. ఆయన ఎంతో పాజిటివ్ వ్యక్తి. ఆయన లేరంటే ఎంతో బాధగా ఉంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆయన పిల్లలకు అండగా ఉంటాం అన్నారు.

పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ.. రాజుగారు, జయ మేడమ్ ఇద్ద‌రూ ఎంతో బాగా ఉండేవారు. నేను సినిమా స్టార్ట్ చేసిన‌ప్పుడు కూడా రాజుగారే క్లాప్ కొట్టి.. కొన్ని సూచ‌న‌లు కూడా చేశారు. నా మంచి కోరే వ్య‌క్తుల‌ను కోల్పోవ‌డం ఎంతో బాధాక‌రం అన్నారు.

సురేందర్ నాయుడు మాట్లాడుతూ.. చంటిగాడు మూవీ ప్రమోషన్స్ అప్పుడు రాజుగారితో కలిసి పని చేశా. అప్పటి నుంచి ఆయనతో స్నేహం మొదలైంది. ఆయనలో బాగా నచ్చే విషయం పాజిటివ్‌గా ఉండడం. ఆయన కాలానికి అనుగుణంగా అప్‌డేట్ అవుతుంటారు. ఆయన మరణించిన రోజే ఉదయం నాకు కాల్ చేశారు. కృష్ణ గారి పుట్టినరోజున ఈవెంట్‌లో మాట్లాడాలి అంటే ఓకే అన్నారు. అయితే తర్వాత ఆయన మరణవార్త విని జీర్ణించుకోలేకపోయా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అన్నారు.

రియల్ హీరో సోనూసూద్ మాట్లాడుతూ.. బీఏ రాజు గారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా ఉంటారు. నెలన్నర క్రితం ఆచార్య షూటింగ్‌కు వచ్చినప్పుడు పార్క్ హయత్ హోటల్‌లో ఆయనను కలిశాను. నేను చేసిన ఎన్నో సినిమాలకు ఆయన పీఆర్వోగా పని చేశారు. ఇప్పుడు ఆయన లేరంటే నమ్మలేకపోతున్నా. ఆయన ఎంతోమందిని స్టార్స్‌ను చేశారు. ఆయన ఒక హీరో. సినిమా పరిశ్రమకు ఆయన ఎంతో చేశారు. ఆయన పిల్లలకు నేను అండగా ఉంటా. ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాళ్లకు కావాల్సిన సాయం చేస్తా. పరిస్థితులు చక్కబడ్డాక హైదరాబాద్ వచ్చి ఆయన కుటుంబ సభ్యులను కలుస్తా అన్నారు.

డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. రాజు గారు లేరన్న వార్త నాకు షాకింగ్‌గా ఉంది. ఆయన నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. నేను అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఉన్నప్పటి నుంచి పరిచయం. నిజం సినిమా చేయడానికి కారణం బీఏ రాజుగారే. ఆయనే మహేశ్ బాబుతో మాట్లాడి ఒప్పించారు. ఆయన చాలా బెస్ట్ పీఆర్వో. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అన్నారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. బీఏ రాజు గారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. రాజశేఖర్ గారి ఎన్నో సినిమాకు ఆయన పీఆర్వోగా పనిచేశారు. ఎన్నో హిట్ సినిమాలు అందించారు. బీఏ రాజు కుమారుడు శివకు డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉందని తెలిసింది. అందుకు మేమందరం ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటాం అన్నారు.

నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. రాజు గారితో పనిచేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉండేవారు. ఎన్నో ఇన్‌పుట్స్ ఇచ్చేవారు. ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆయన లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అన్నారు.

డైరెక్టర్ గుణ శేఖర్ మాట్లాడుతూ.. బీఏ రాజుగారు లేరంటే నమ్మలేకపోతున్నా. ఆయన ఆఖరి చూపుకుకూడా ఎవరూ నోచుకోలేదు. నేను క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి నాకు బీఏ రాజు గారితో పరిచయం. నేను డైరెక్టర్ అయినప్పటి నుంచి ఒకట్రెండు సినిమాలకు తప్ప మిగితా అన్ని సినిమాలకు ఆయనే పీఆర్వో. సినిమా ఫ్లాప్ అయినా సరే అందులో మంచి విషయాన్ని తీసుకుని చాలా ఎంకరేజింగ్‌గా మాట్లాడుతుంటారు. మానసికంగా బలంగా ఉండేలా చేస్తారు. న్యూస్ కవరేజ్‌ల గురించి చాలా బాగా చెప్తుండేవారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. నా దృష్టిలో ఆయన ఇంకా బతికే ఉన్నారు. ఆయన పాజిటివ్ ఎనర్జీ మనతోనే ఉంటుంది. ఆయన పిల్లలకు ఎలాంటి సపోర్ట్ అయినా చేస్తాం అన్నారు.

ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు మాట్లాడుతూ.. సూపర్‌హిట్‌ కొట్టి రికార్డులు సృష్టించిన ఎన్నో సినిమాకు పీఆర్వోగా పని చేసిన నా ప్రియమిత్రుడు బీఏ రాజు మనందరకి ఆకస్మాత్తుగా దూరం కావడం చాలా బాధగా ఉంది. ప్రస్తుతం నేను క్వారంటైన్‌లో ఉన్నాను. అందుకే అందర్నీ కలవలేకపోతున్నాను. నలభై సంవత్సరాలుగా ఒక మిత్రుడిగా, పీఆర్వోగా బీఏరాజుగారితో నాకు అనుబంధం ఉంది. చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివస్తున్న సమయం అది ఆ సమయంలో కృష్ణగారితో పాటు, ఆయన అభిమానిగా బీఏరాజు ఇక్కడికి వచ్చారు. మేము కూడా వచ్చాము. అప్పటి నుంచి మా నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో వర్క్‌ చేస్తున్నారు బీఏరాజు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు.

 

Cine journalists tearful tribute to BA Raju:

Cine journalists tearful tribute to BA Raju
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs