గాలిసంపత్ కి అద్వితీయమైన రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది - నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో రూపొందిన చిత్రం గాలి సంపత్. అనిల్ కో-డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
చిత్ర నిర్మాత ఎస్.కృష్ణ మాట్లాడుతూ - ఈ సినిమా చూసిన వాళ్లు మాకు ఫోన్ ఫోన్ చేసి కొన్ని సీన్స్‌లో అయితే మాకు తెలియకుండానే కన్నీళ్లు అలా వచ్చేశాయి అని చెప్పారు. ఆ క్రెడిట్ అంతా మా రాజేంద్రప్రసాద్ గారికి, మా టీమ్‌కి చెందుతుంది. శ్రీరాములు థియేటర్‌లో ఆడియన్స్‌తో కలిసి సినిమా చూశాను. ఫస్టాఫ్, సెంకండాఫ్ రెండూ అరుపులు, ఈలలతో చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తున్నారు. ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కి, ఫ్యామిలీస్‌కి ఎలా ఎక్కబోతుంది అని అప్పుడే నాకు అర్ధం అయ్యింది. అంత అద్భుతంగా నటించిన రాజేంద్ర ప్రసాద్ గారికి థ్యాంక్స్. శ్రీవిష్ణు యాక్టింగ్, లవ్ ట్రాక్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యింది. థియేటర్‌లో ఆడియన్స్ నవ్వులు చూశాక ఈ మూవీ మీద కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. సత్య, రవి కామెడీ చాలా బాగా చేశారు. లవ్‌లీ సింగ్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని గ్యారెంటీగా చెప్పగలన అన్నారు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - నా కెరీర్‌లో నేను చేసిన సరికొత్త ప్రయత్నం గాలి సంపత్. సినిమా రిలీజైన వెంటనే ఇంత అద్వితీయమైన రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. తెలుగు సినిమాలో ఇంత వరకూ చూడని ఎక్స్‌పెరిమెంట్ ఈ సినిమాలో చేయడానికి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించారు. చిత్ర నిర్మాత, కథా రచయిత ఎస్. కృష్ణ థియేటర్‌లో ఆడియన్స్ ఎంజాయ్ చేయడం చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆ ఎగ్జయిట్ మెంట్ నే మీ అందరితో పంచుకోవడం జరిగింది. ఏ కళాకారుడికైనా సరే ఇంతకు మించిన ఆనందం ఉంటుందని నేను అనుకోను. ఈ సినిమా ఒక తండ్రీ కొడుకుల కథ. శ్రీవిష్ణు, నేను చేస్తున్నప్పుడే తప్పకుండా గొప్ప సినిమా అవుతుందని ఇన్వాల్వ్ అయ్యి నటించాము. మిగతా నటీనటులు కూడా బాగా నటించారు. ఒక మంచి సినిమా చూశామనే ఆనందం ప్రేక్షకులకు, మంచి సినిమా చేశామనే ఆనందం మాకు మిగిలినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాని వీలైతే మీ ఫ్యామిలీస్‌తో వెళ్లి చూడండి. ఈ సినిమాకి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ముఖ్యంగా అన్నయ్యా.. ఆస్కార్ అంత పెర్‌ఫామెన్స్ చేశావు అన్న మాట నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా గుండెల్లో ఉంచుకుంటాను. ఇంత మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు మా అబ్బాయి అనిల్ రావిపూడికి, అనీష్ కృష్ణకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫిలిం స్కూల్‌లో ఉన్నప్పుడు నాకు మైమ్ పెర్‌ఫామెన్స్‌లోనే గోల్డ్ మెడల్ వచ్చింది. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఆ డ్రెస్ వేసుకుని స్టేజ్‌మీదకు రావడానికి మా మైమ్ మధునే కారణం. శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ చాలా బాగా నటించారు. ఈ సినిమా మా నిర్మాతలకి ఎంతో పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ - ముందుగా ఒక డిఫరెంట్ పాయింట్ చెప్పినప్పుడు చాలా డేరింగ్‌గా ఈ సినిమా చేధ్దాం అని ముందుకు వచ్చిన నిర్మాతలకి థ్యాంక్స్. అనీష్ ఎక్కడా డీవియేట్ అవ్వకుండా చాలా పర్‌ఫెక్ట్‌గా డీల్ చేశాడు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి నటన గురించి ముందు చెప్పినట్టుగానే మంచి అప్లాజ్ వస్తోంది. ముఖ్యంగా మైమ్ సీన్‌కి ఆడియన్స్ లేచి నిల్చొని క్లాప్స్ కొడుతున్నారు. అంత గొప్పగా రాజేంద్రప్రసాద్‌గారు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఈ వయసులో కూడా క్యారెక్టర్ కోసం ఏమైనా చేయగలుగుతాను అని మరోసారి ప్రూవ్ చేశారు. మీ ఫ్యామిలీస్, పిల్లలతో వచ్చి సినిమా చూస్తే మరింత ఎంజాయ్ చేస్తారు అన్నారు.
కమెడియన్ సత్య మాట్లాడుతూ - ఎస్. కృష్ణగారు చాలా మంచి కథ రాశారు. రాజేంద్ర ప్రసాద్ గారికి ట్రాన్స్‌లేటర్‌గా నేను చేస్తే మంచి పేరు వస్తుందని నమ్మి ఈ పాత్ర నాకు ఇచ్చారు. ఈ సినిమాలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకి థ్యాంక్స్ అన్నారు.
హీరోయిన్ లవ్‌లీ సింగ్ మాట్లాడుతూ - నా ఫస్ట్ మూవీ గాలి సంపత్‌ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ వెరీమచ్. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనిల్ గారికి , కృష్ణగారికి అలాగే శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్‌గారికి థ్యాంక్స్ అన్నారు.
మైమ్ మధు మాట్లాడుతూ - మైమ్ ముఖఅభినయాన్ని ఒక సినిమాలో పెట్టాలంటే దమ్ముండాలి. విలువలతో కూడిన ఒక మంచి సన్నివేశాన్ని పెట్టాలి అన్న సాయి కృష్ణగారి ఆలోచనకి హ్యాట్సాఫ్. అలాగే ఈ సినిమాలో ఒక పాత్ర కూడా చేయించడం జరిగింది. మైమ్ పెర్‌ఫామెన్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.