'వలస' పక్షులు వాలే డేట్ జనవరి 8
అమెజాన్ ప్రైమ్ ద్వారా జనవరి 8వ తేదీన అంతర్జాతీయంగా, అదే రోజున తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలోనూ విడుదలకి వలస చిత్రం సిద్ధమైందని చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల రోడ్డున పడ్డ వలస కార్మికుల వెతల నేపథ్యంలో కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్, పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు నిర్మాతగా రూపొందించిన వలస ప్రేక్షకులకి నచ్చుతుందన్న ఆశాభావం యూనిట్ వ్యక్తపరచింది.
మనోజ్ నందం, తేజు అనుపోజు ఒక జంటగా, వినయ్ మహాదేవ్, గౌరీ మరో జంటగా నటించిన ఈ చిత్రంలో ఎఫ్.ఎం. బాబాయ్, సముద్రం వెంకటేష్, నల్ల శీను, తులసి రామ్, మనీష డింపుల్, తనూషా, మల్లిక, వెంకట రామన్, ప్రసాద్, వాసు తదితరులు ప్రధాన పాత్రలు పోషించగా, నరేష్ కుమార్ మడికి కెమెరా, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ప్రవీణ్ ఇమ్మడి సంగీతం అందించారు. ధనుంజయ్ ఆలపించిన తడి గుండెల సవ్వడిలో వినిపించెను గేయం.. అనే పాట సోషల్ మీడియా లో మంచి స్పందన పొందిందని, చిత్రాన్ని చూసిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ప్రశంసలు అందచేశారని యూనిట్ తెలిపింది.
కేవలం వలస కార్మికుల కష్టాలు మాత్రమే కాకుండా వారి జీవితాలలోని నవరసాలను చూపించిన చిత్రమిదని, ప్రపంచ సినిమాలలో వైపరీత్యాల నేపథ్యంలో సాగే మానవీయ కధనాల తరహాలో ఈ చిత్రం ఉంటుందని, ఇందులో ఒక అందమైన ప్రేమ కథతో పాటు ఒక చక్కటి కుటుంబానికి చెందిన కథా ఇమిడి ఉందని, నిజజీవిత హాస్యం, బతుకు పోరాటంలోని ఉగ్వేగం ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపారు. వలస చిత్రానికి శరత్ ఆదిరెడ్డి, రాజా.జి. సహ నిర్మాతలుగా, బి. బాపిరాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.