టెక్నాలజీ ఎంత మారినా.. మనుషుల్లో ఎంత మార్పు వచ్చినా.. కాలంతో పాటు మనుషులు పరుగులు పెడుతున్నా.. కొన్ని చోట్ల పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలని ట్రాప్ చేసే మృగాళ్లు, వేరే వేరే కులాలు ఉన్నవారు ప్రేమించుకుంటే పరువు పేరుతొ చంపెయ్యడం, పెళ్లి చేసుకుంటే విడదియ్యడం, పరువు హత్యలు నిత్యం ఎన్నో చూస్తూనే ఉన్నాము. మీడియా వచ్చిన తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కానీ.. మీడియా అందుబాటులో లేని టైం లో ఎన్నో పరువు హత్యలు ఎవరికీ కానరాకుండా మరుగున పడిపోయాయి. ఊరి పెద్దలుగా ఉంటూనే పరువు హత్యలను ప్రోత్సహించేవారు, కన్న కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది అనే సాకుతో.. పరువు పోయింది అని ఫీలవుతూ కూతుర్నే చంపుకున్న తల్లి తండ్రులు, కూతురు ప్రేమించిన వాడిని చంపించడం, కులం కట్టుబాట్లు మీరారంటూ వాళ్ళని శిక్షించడం నిత్యం చూస్తూనే ఉన్నాం. అలాంటి పరువు హత్యల నేపథ్యంలో తమిళనాట ఓ వెబ్ సీరీస్ అవతరించింది. ఆ వెబ్ సీరీస్ లో నాలుగు భాగాలూ. ఒక్కో భాగానికి ఒక్కో టాప్ డైరెక్టర్ దర్శకత్వం వహించడం. భిన్న నేపథ్యం వున్న కథలతో నలుగురు దర్శకులు చేసిన ప్రయత్నమే పావ కథైగల్ వెబ్ సీరీస్. ప్రస్తుతం ఈ పావ కథైగల్ వెబ్ సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. తమిళం లో తెరకెక్కిన ఈ `వ కథైగల్ తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ కూడా చేసారు.
సుధా కొంగర దర్శకత్వంలో తంగమ్ (నా బంగారం):
సత్తారు (కాళిదాస్ జయరాం) అబ్బాయి గా పుట్టినా అమ్మాయిలా ప్రవర్తిస్తుంటాడు. సత్తారు అమ్మాయిలా ప్రవర్తించడం చూసి ఇంట్లోవాళ్లూ, ఊర్లో వాళ్లూ అసహ్యించుకుంటారు. కానీ సత్తారు స్నేహితుడు శరవణ మాత్రం సత్తారుతో స్నేహం చేస్తాడు. ఆ స్నేహాన్ని గే అయిన సత్తారు ప్రేమ అనుకుంటాడు. శరవణ ని ప్రేమిస్తాడు. ఒకసారి శరవణ తో తాను బొంబాయి వెళ్లి ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిలా మారిపోవడానికి డబ్బు కూడబెడుతున్నట్లుగా చెబుతాడు. అయితే తాను అనుకున్నట్టుగా శరవణ తనని ప్రేమించడం లేదని.. తన చెల్లిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని.. తన చెల్లె శరవణ ప్రేమకి అండగా నిలుస్తాడు. శరవణ ని తన చెల్లెల్ని తన దగ్గర దాచుకున్న డబ్బు ఇచ్చేసి ఊరి నుండి పంపించేస్తాడు. ఒక సంవత్సరం గడిచాక శరవణ కి కొడుకు పుట్టడంతో ఇరు కుటుంబాలు శరవణ ప్రేమను, పెళ్లిని అంగీకరించి ఊరికి రమ్మంటారు. శరవణ భార్య బిడ్డతో ఊరికి వచ్చేసరికి సత్తారు కనిపించడు. సత్తారుని ఊరు వెలివేసింది అని, కుటుంబ సభ్యులు కూడా సత్తారును ఇంటికి రానివ్వలేదని శరవణ మావయ్య చెప్తాడు. అసలు శరవణ వెళ్లిన తర్వాత సత్తారు ఏమయ్యాడు? ఊరి వాళ్లంతా సత్తారుని ఏం చేశారు? అనేది కథ.
విశ్లేషణ:
ఆకాశమే నీ హద్దురా లాంటి భారీ సినిమాని తెరకెక్కించిన దర్శకురాలు ఓ వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చేయడం అంటే దానిపై అంచానాలు వచ్చేస్తాయి. సుధా కొంగర నా బంగారం ని హ్యాండిల్ చేసిన విధానం నచ్చుతుంది. ఓ గే ని ఊరు వాడ అస్సహించుకోవడం, గే కి కూడా మనసు ఉంటుంది అని.. అతనిలోని మంచితనాన్ని చూపించిన విధానం ఆకట్టుకుంది. అందరూ అసహ్యించుకున్న పాత్రని ప్రేక్షకులు ఇష్టపడడం అనేది అందులోని జాలి, ప్రేమని చూపిస్తాయి. సత్తారు, శరవణ, సత్తారు చెల్లెలు, ఇలా కథ మొత్తం కొద్దిమంది పాత్రలు చుట్టూనే తిరుగుతుంది. ఈ కథలో ముఖ్యంగా పతాక సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి. సత్తారు త్యాగం, శరవణ స్నేహం చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. గే కూడా ఒక మనిషే. అతనికి మనసు ఉంటుంది. కానీ వాళ్ళని సమాజం మాత్రం అంటరానివాళ్లుగానే చూస్తుంది. ఇది ఒకలాంటి పరువు హత్యకీ సమానమే అనేది నా బంగారం సబ్జెక్టు.