బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై బంజార భాషలో ‘గోర్ మాటి’గా తెలుగులో ‘రాజ్ పుత్’గా రెండు భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రేఖ్యా నాయక్. శంకర్ జాదవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అదిరే అభి మరో హీరోగా నటిస్తున్నారు. సిరిరాజ్, కరిష్మా రామ్ హీరోయిన్స్. ఈ చిత్రం ఈ రోజు ఫిలింనగర్‌లోని తెలంగాణ ఫిలించాంబర్‌లో షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ ఫిలించాంబర్ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా ..తెలంగాణ ‘టీమా’ సెక్రటరి వి.తిరుమల దేవి కెమెరా స్విచాన్ చేశారు. మరో అతిథి లక్మణ్ వేముల గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డా.ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ... ఇటీవల కాలంలో బంజార భాషలో రూపొందిన చిత్రాలు విజయం సాధించాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమాకు అన్నివిధాల నా పూర్తి సహకారం ఉంటుంది.. అన్నారు.
దర్శకుడు, హీరో శంకర్ జాదవ్ మాట్లాడుతూ... బంజారాల జీవితం ఎక్కడ ప్రారంభమై ఎక్కడెక్కడి వరకు వ్యాపించింది. అసలు వారి జీవన శైలి ఎలా ఉంటుంది అనే అంశాల ఇతివృత్తంతో తెలుగులో ‘రాజ్‌పుత్’, బంజారలో ‘గోర్‌మాటి’గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నేను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాను.. అని అన్నారు.
మరో హీరో అదిరే అభి మాట్లాడుతూ... ఈ సినిమాలో నేను సెకండ్ హీరోగా నటిస్తున్నా. శంకర్ మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. అన్నారు.
నిర్మాత రేఖ్యా నాయక్ మాట్లాడుతూ... బంజార వారి స్థితిగతులతో పాటు వారి సమస్యలూ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. బంజారాలు ఇప్పటికే నేను ప్రారంభించిన ‘యూట్యూబ్’ ఛానల్ ని ఆదరించారు. ఈ సినిమాకు కూడా వారి పూర్తి సహకారం ఉంటుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా ఒక్క బంజార వాళ్లకే కాకుండా అందరినీ ఆకట్టుకుంటూ ఆలోచింపజేసేలా ఉంటుంది. ఈ నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్‌లో కంప్లీట్ చేస్తాం.. అని అన్నారు.
ఈ సినిమా ఘన విజయం సాధించాలని ‘టిమా’ సెక్రటరి తిరుమల దేవి, లక్ష్మణ్ వేముల తెలిపారు.
ఒక మంచి సినిమాలో భాగమవుతున్నందకు సంతోషంగా ఉందన్నారు హీరోయిన్స్.
వడిత్య రేఖ్యా నాయక్, జబర్దస్త్ పవన్, నవీన్, జాకి, హరిత తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, సినిమాటోగ్రఫి: గోపి కొత్తూరు, వెంకట్ కొల్లూరి, నిర్మాత: రేఖ్యా నాయక్; డైరక్టర్: శంకర్ జాదవ్.