బాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎవరని అంటే టక్కున గుర్తొచ్చే పేర్లు ఖాన్ త్రయం. అయితే గత కొన్ని రోజులుగా ఈ త్రయం సినిమాలేవీ అనుకున్నంతగా ఆడట్లేదు. ఒక్క సల్మాన్ ఖాన్ తప్పిస్తే మిగతా ఇద్దరు హీరోలు సినిమాలు చాలా వరకు తగ్గించేశారు. ఏడాదికో, రెండేళ్ళకో ఒక సినిమా రావడం కూడా గగనమైపోయింది. షారుక్ ఖాన్ అయితే సినిమాలు చేసినా కూడా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు.
ఈ ముగ్గురు హీరోలు సినిమా సినిమా అంతలా గ్యాప్ తీసుకుంటే అక్షయ్ కుమార్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏడాదికి ఒక సినిమా కాదు రెండు నుండి మూడు సినిమాలు వరకు చేస్తున్నాడు. సినిమాలు చేయడమే కాదు విజయాలు కూడా అందుకుంటున్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా క్వాలిటీలో ఏమాత్రం తేడా ఉండట్లేదు. ఇప్పుడు అతని చేతిలో పది సినిమాలు ఉన్నాయట.
ఆ పది సినిమాల్లో ఆరు సినిమాల విడుదల తేదీలు కూడా ప్రకటించాడు. ఒక స్టార్ హీరో ఆరు సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించడం ఆశ్చర్యమే. ఈ ఏడాది మొదటగా ‘సూర్య వంశీ’ సినిమాతో పలకరించనున్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత నెలరోజుల గ్యాప్ తో సౌత్ మూవీ ‘కాంఛన’కు రీమేక్‌గా లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అక్షయ్ సినిమా ‘లక్ష్మీ బాంబ్’ ఏప్రిల్ 22న విడుదలవుతుంది.
అక్షయ్ నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘పృథ్వీ రాజ్’ను నవంబరు 13న రిలీజ్ చేస్తారట. ఇక ఈ ఏడాది క్రిస్మస్‌కు అనుకుని తర్వాత వాయిదా పడ్డ ‘బచ్చన్ పాండే’ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో వస్తున్న అత్రంగి రే చిత్రాన్ని 2021 ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత 2021 ఏప్రిల్ 02 న బెల్ బాటమ్ రిలీజ్ అవుతుందట. మొత్తానికి ఆరు సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.