దేశం గర్వించదగ్గ దర్శకుల్లో దిగ్గజ దర్శకుడు మణిరత్నంది ప్రత్యేక స్థానం. అయితే వయసు పెరిగే కొద్ది మరింత అనుభవం వచ్చి మరింత గొప్ప చిత్రాలను తీస్తారని కొందరు అంటుంటే.. కాదు.. కాదు.. వయసు పెరిగే కొద్ది కొత్త తరం ప్రేక్షకులకు కావాల్సింది తెలుసుకోలేక, యువతరం దర్శకులలాగా ప్రేక్షకుల నాడి పట్టుకోలేక తెరమరుగవుతారని రెండు రకాల వాదనలు ఉన్నాయి. కానీ ఈ వాదనలో రెండోదానికి ఎక్కువ ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. కె.బాలచందర్, దాసరి నారాయణరావు, బాపు,వంశీ, కృష్ణవంశీ, పి.వాసు, కె.యస్.రవికుమార్ వంటి ఎందరో దర్శకులు తమ కెరీర్ చివరి రోజుల్లో డిజాస్టర్స్ అందించారు... అందిస్తున్నారు. ఈ కోవలోకి వచ్చే దర్శకునిగా మణిరత్నంను కూడా చెప్పాలి. ఈయనకు ఇటీవల దశాబ్దకాలంలో ఎలాంటి హిట్స్ లేవు. కేవలం 'ఓకే బంగారం' చిత్రం మాత్రమే ఫర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన 'చెలియా' వంటి చిత్రాలు నేటితరం ప్రేక్షకులను అలరించలేక, తమిళ, తెలుగు భాషల్లో కూడా డిజాస్టర్స్‌గా నిలిచాయి. దాంతో మణిరత్నం మరోసారి తన సత్తా చాటడానికి త్వరలో ఓ మల్టీస్టారర్ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇలా రూపొందుతున్న తమిళ చిత్రమే 'చక్క చివంత వానం'. దీనికి తెలుగులో 'నవాబు' అనే టైటిల్‌ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో అరవింద్‌స్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఆదితీరావు, ఐశ్వర్యారాజేష్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇందులో నటిస్తున్న హీరోలందరు అన్నదమ్ములుగా నటించనున్నారు. రాజకీయ నాయకుడిగా అరవింద్‌స్వామి, ఇంజనీర్‌గా శింబు, పోలీస్ ఆఫీసర్‌గా విజయ్‌సేతుపతిలు కనిపిస్తారట. ఈ పాత్రల మద్య జరిగే సంఘర్షణ ప్రేక్షకులను కట్టిపడేస్తుందనికోలీవుడ్ మీడియా అంటోంది. బలమైన కథ, కథనాలతో.. బంధాలు, అనుబంధాల నేపధ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతి పాత్రను మణిరత్నం అద్భుతంగా తీర్చిదిద్దారని యూనిట్ సభ్యుల మాట. ఈనెలలో టీజర్‌ను, వచ్చే నెల మొదట్లో ట్రైలర్‌ని విడుదల చేసి, వచ్చేనెల 28న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక మణిరత్నం చిత్రాలంటే 'దళపతి, రావణ్' వంటి పలు చిత్రాల కథలను మణిరత్నం రామాయణం, మహాభారతం వంటి పురాణాల గ్రంధాలను తీసుకుని వాటిని సాంఘీకరిస్తూ ఉంటారు. మరి 'నవాబు' చిత్రం స్టోరీ దేని ఆధారంగా మణిరత్నం తీసుకున్నాడో వేచిచూడాల్సివుంది...!