తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ హీరోయిన్‌గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటి జ్యోతిక. ఆ తర్వాత ఆమె స్టార్ హీరో సూర్యని వివాహం చేసుకుని సినిమాలకు బై చెప్పింది. ఇక ఈమె పిల్లలు పెద్దవారైన తర్వాత తల్లిగా తన బాధ్యతలను నెరవేర్చి ప్రస్తుతం మరలా నటిగా రీఎంట్రీ ఇచ్చింది. తనకు తగ్గ పాత్రలు, సినిమాలు చేస్తూ తమిళ ప్రేక్షకులను బాగా మెప్పిస్తోంది. ఇక ఈమె ఈ ఏడాది ఆరంభంలో ది గ్రేట్ కోలీవుడ్ దర్శకుడు బాల దర్శకత్వంలో 'నాచియార్' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం టీజర్ నుంచి సినిమా వరకు పలు వివాదాలకు కారణంగా నిలిచింది. ఇందులో జ్యోతిక రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయగా, సంగీత దర్శకుడు టర్న్‌డ్ హీరో అయిన జివి ప్రకాష్ మురికివాడల్లో ఉండే చిల్లర దొంగగా కనిపించాడు. ఇక ఈ చిత్రం టీజర్ నుంచి ఈ చిత్రంపై వివాదాలు చెలరేగాయి. జ్యోతిక పోషించిన కరుడుగట్టిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె 'లం...కొడకా' అంటూ బూతు డైలాగ్‌లు ఉండటంతో ఈ చిత్రంలో మహిళలను కించపరిచేలా చూపించారని కొందరు కోర్టు మెట్లు ఎక్కారు.
ఇక ఈ చిత్రం తమిళంలో విడుదలై ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇక బాలా చిత్రాలంటే తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో ఇష్టం. ఆయన తమిళంలో తీసిన 'సేతు'వంటి చిత్రాలు తెలుగులోకి రీమేక్ కాగా, 'శివపుత్రుడు, నేనే దేవుణ్ణి, వాడు - వీడు' వంటి డబ్బింగ్ చిత్రాలన్నీ తెలుగు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇక 'నాచియర్' విషయానికి వస్తే ఈ చిత్రం తమిళంలో విడుదలైన చాలా కాలానికి ఇప్పుడు తెలుగులోకి 'ఝాన్సీ' పేరుతో డబ్బింగ్ అవుతోంది. సినిమాతో పాటు అన్ని పాత్రలు సహజత్వానికి దగ్గరగా ఉండటంతో ఈ చిత్రం వైవిధ్యభరిత చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు బాగా సంతృప్తిని కలిగిస్తుందని భావిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో ఈనెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంత మాత్రం అలరిస్తుంది? ఇక్కడ ఏ స్థాయి విజయం సాధిస్తుందో వేచిచూడాల్సివుంది...!