'సూపర్ స్కెచ్' సినిమా నలుగురు కుర్రాళ్ల మధ్య నడిచే కథ.. ఆ కుర్రాళ్లలో నేనూ ఒకడిని. కథానాయకుడిగా ‘పుత్రుడు’ సినిమా చేసిన అటు తర్వాత దాదాపు పదిహేను చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించాను. అయితే నటుడిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రం ఈ ‘సూపర్ స్కెచ్’ మాత్రమే. ఈ సినిమాలో ఇంటిలిజెంట్ నెగెటివ్ క్యారెక్టర్‌ని ఇచ్చి ఆ పాత్ర చక్కగా రావడానికి దర్శకుడు తీసుకున్న శ్రద్ధ మరచిపోలేనిది. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని అంటున్నారు కథానాయకుడు ఇంద్ర. యు అండ్ ఐ బ్యానర్ సమర్పణలో ఫిల్మ్ అకాడమీ సహకారంతో శ్రీ శుక్ర క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైన చిత్రం 'సూపర్ స్కెచ్'. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని తనపాత్ర గురించి, తన సినీ ప్రయాణం గురించి కథానాయకుడు ఇంద్ర ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
ముఖ్యంగా మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో లీనమై నటించే అవకాశం ఈ సినిమా ద్వారా లభించింది. హీరోకు సమాంతరంగా సాగుతూ వివిధ రకాల షేడ్స్ నా క్యారెక్టర్‌లో కనిపించి అందర్నీ విశేషంగా ఆకట్టుకునేలా చేస్తుంది. ఆద్యంతం సినిమా ఎంతో సస్పెన్స్‌తో సాగుతూ ఉత్కంఠను కలిగిస్తుంది. నాతో నటించిన సహనటులు కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా డైలాగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఖాయం. ఏ నటుడికైనా ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తుంటాయ. ఛాలెంజ్‌తో కూడిన క్యారెక్టర్ ఇది. పాత్రలో లీనమై చేయడం వల్ల ఎంతో సంతృప్తి కలిగింది. ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ కలిగించే చిత్రమిది. దర్శకుడు రవి చావలి చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రతీ ఒక్కర్నీ ఆకట్టుకుంటుంది. ఇదొక సస్పెన్స్ ఇనె్వస్టిగేటివ్ థ్రిల్లర్. ఈ చిత్రం చూస్తున్నంత సేపూ ప్రతి నిమిషం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకుల దృక్పథం మారింది.
ఏం చెప్పినా.. సుతిమెత్తగా వినోదాత్మకంగానే చెప్పాలి. మన దగ్గర ఓ సీరియెస్ పాయింట్ ఉం ది కదా అని.. దాన్ని మరింత సీరియెస్‌గా చెప్పకూడదు. అందరికీ నచ్చే విధంగానే చెప్పాలి. మా చిత్రం హాలీవుడ్, బాలీవుడ్ ఫీలింగ్‌తో సినిమా చూసే ప్రేక్షకుడికి గొప్ప అనుభూతి కలిగిస్తుంది. అందరికీ నచ్చే విధమైన అంశాలే కనిపిస్తాయి. కథల ఎంపిక వైవిధ్యం.. సహజమైన నటన.. ఏ నటుడినైనా తిరుగులేని కథానాయకుడిగా నిలబెడతాయి. ప్రజల దృష్టికోణం మారుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్ కానీ, ఇన్ఫోటైన్‌మెంట్ ఏదైనా అందరూ దానికి కనెక్ట్ అవుతారు. సరైన అంశం, సరైన మార్గంలో మనం చూపిస్తే కచ్చితంగా ప్రజల్లో అవగాహన పెంచిన వాళ్లమవుతాం. అలాంటి సినిమాలే మనకు ఆత్మ సంతృప్తిని కలిగిస్తాయి. నేను అలా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నా. నా సినిమా చూసి ఇంటికెళ్లే ప్రతీ ప్రేక్షకుడు ఎంతో సంతోషంతో వెళ్లాలని కోరుకుంటా. మనసుకు నచ్చేవి చేసుకుంటూ వెళ్లడమే నా పని. నా లక్ష్యం.. నటుడు కావాలన్నదే. భవిష్యత్‌లో మంచి సినిమాలను నిర్మించాలన్న ఆలోచనతో ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ స్థాపించి ‘పుత్రుడు’ నిర్మించాను.
ఆ చిత్రంలో నేను హీరోగా చేశాను. భవిష్యత్తులో ఈ బ్యానర్‌లో మంచి చిత్రాలు నిర్మించాలన్నదే ఈ అకాడమీ లక్ష్యం. అయితే నాకు మనసుకు నచ్చిన ఎలాంటి క్యారెక్టర్ అయినా పోషించి పేరు తెచ్చుకోవాలనుంది. అది హీరోనా, విలనా? అని కూడా చూడను. చేసే క్యారెక్టర్‌లో దమ్ముండాలే గాని.. అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా. గత 12 ఏండ్లుగా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నేను ఒక దశలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యా. అయనా.. నటనపై ఉన్న ఆసక్తితో పరిశ్రమలో నిలబడి కెరీర్‌ని మలుచుకుంటున్నా. ఇప్పుడిప్పుడే సంతృప్తికరమైన ప్రోత్సాహం లభిస్తోంది. ఎన్నటికైనా నేను ఎంచుకున్న దారిలో నాకు అన్నీ మంచి విజయాలే లభిస్తాయన్న నమ్మకం వుంది. చిత్రసీమ నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తోంది.
ఇక ముందు మరిన్ని చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి కెరీర్‌లో మంచి స్థానాన్ని సంపాదించుకుంటా. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగిడాను. నా ఊపిరి సినిమా, నా ఆలోచన సినిమా, నా ఆశయం సినిమా. రాజమౌళి 'సై'చిత్రంతో నా సినీ ప్రయాణం మొదలైంది. అప్పట్పుంచి గత 12 ఏండ్లుగా 'సైనికుడు', 'అర్జున్', 'కుర్ కురే', 'దగ్గరగా దూరంగా', 'శ్రీమన్నారాయణ', 'కిక్ 2', 'సందట్లో సడేమియా', 'లక్ష్మీ కళ్యాణం' వంటి దాదాపు 15 చిత్రాల్లో పలు భిన్న పాత్రలను పోషించాను. 2011లో 'పుత్రుడు' చిత్రంతో హీరోగా మారాను. హీరోగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించింది. నటుడిగా విమర్శకుల ప్రశంసల్ని కూడా సొంతం చేసుకున్నాను. మంచి చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీని స్థాపించాను. క్యారెక్టర్స్‌లో దమ్ముంటే ఎలాంటి క్యారెక్టర్‌లో అయినా సరే నటించేందుకు నేను రెడీగా ఉన్నాను. అలాగే అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను. అంటున్నారు కథానాయకుడు ఇంద్ర