కొన్ని కాంబినేషన్లు అనూహ్యంగా తెరమీదకు వస్తాయి. వచ్చినంత వేగంగానే ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్‌ఫుల్ డైరక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ కూడా అలాంటిదే. రామ్ హీరోగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ సినిమా మొదలుపెట్టనుందని తొలి వార్త విడుదలైనప్పటి నుంచి ట్రేడ్ వర్గాల్లోనూ అమితాసక్తి కనిపించింది. అలా అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న ఈ సినిమా ప్రారంభోత్సవం నిరాడంబరంగా యూనిట్ సభ్యుల సమక్షంలో గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఉత్తమాభిరుచిగల నిర్మాత `స్రవంతి` రవికిశోర్ నిర్మిస్తున్నారు. యువ ప్రతిభాశాలి పి.కృష్ణచైతన్య ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
చిత్ర నిర్మాత `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ ``ఏప్రిల్ 26న గురువారం హైదరాబాద్‌లో నిరాడంబరంగా పూజా కార్యక్రమాలను నిర్వహించాం. మే 7 నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మే నెలాఖరు వరకు తొలి షెడ్యూల్ సాగుతుంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలోని సుందరమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. విదేశాల నుంచి తిరిగి వచ్చాక కాశ్మీర్, లడఖ్‌లో భారీ షెడ్యూల్స్ చేస్తాం. న్యూ వేవ్ లో సాగే చిత్రమిది. మరిన్ని విశేషాలను త్వరలోనే వెల్లడిస్తాం`` అని చెప్పారు.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ``హీరో రామ్ కి చక్కగా సరిపోయే కథ కుదిరింది. స్క్రిప్ట్ గ్రిప్పింగ్‌గా ఉంది. యాక్షన్, అడ్వంచరస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. న్యూ వేవ్‌లో సాగే సినిమా. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ప్రముఖ సాంకేతిక నిపుణులు, నటీనటులు మా చిత్రానికి పనిచేస్తారు. అందరినీ మెప్పించే సినిమా అవుతుంది`` అని అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత: `స్రవంతి` రవికిశోర్, సమర్పణ: పి. కృష్ణచైతన్య.