అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్నటిదాకా తమ ముందు తిరిగిన అందాల తార శ్రీదేవి ఇప్పుడు లేదంటే ఎవరు నమ్మలేకపొతున్నారు. కానీ నమ్మాల్సిన నిజం. శ్రీదేవి గత రాత్రి 11 గంటల 30 నిమిషాలకు దుబాయ్ లో ఒక పెళ్లివేడుకలో గుండెపోటుతో అందరికి షాకిస్తూ దివికి ఎగిరిపోయింది. శ్రీదేవి మరణం అందరికి తీరని లోటు. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని సినిమా పరిశ్రమ ఆమె ఆత్మకు శాంతికలగాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. కొంతమంది సీనియర్ నటులు ఆమెతో ఆమెకున్న అనుబంధాన్ని మీడియాతో తో పంచుకుంటుంటే..మరికొంతమంది తారలు ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తూ శ్రీదేవి మరణాన్ని తలుచుకుంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్: ఒక ఆత్మీయ స్నేహితురాలిని కోల్పోయాను. ఆమె మరణం తీరని శోకం. సినిమా పరిశ్రమలో హీరోలతో సమానంగా ఎదిగి లేడి సూపర్ స్టార్ అనిపించుకుంది. శ్రీదేవి భర్త బోనికపూర్, పిల్లలకు నా ప్రగాఢ సానుభూతి.
ఎస్ ఎస్ రాజమౌళి: శ్రీదేవి లేదనే వార్త విని షాక్ అయ్యాను. దేశానికే ఆమె ఫస్ట్ లేడీ సూపర్ స్టార్. 54సంవత్సరాలో 50 సంవత్సరాలు ఆమె నటనా సమర్థతకు నిదర్శనం. ఏం ప్రయాణం... కానీ ఊహించని అంతం. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.
రామ్ గోపాల్ వర్మ: శ్రీదేవి నా కలలు రాణి. మొదటిసారి శ్రీదేవిని హఠాత్తుగా ఇలా తీసుకెళ్ళిపోయినందుకు దేవుడ్ని ద్వేషిస్తున్నా... అలాగే అకాలంగా మరణించినందుకు శ్రీదేవిని కూడా ద్వేషిస్తున్నా అంటూ ట్వీట్ చేసిన వర్మ.. చివర్లో మాత్రం ఆమెను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.. ఆరాధిస్తూనే ఉంటానంటూ తన బాధను వెళ్లగక్కాడు.
పవన్ కళ్యాణ్: శ్రీదేవి మరణం జీర్ణించుకోలేనిది. అమాయకమైన ఆమె నటన ఎప్పటికి మరిచిపోలేనిది. ఆమె అకాల మరణానికి నేనెంతో షాక్ అయ్యాను. అన్నయ్యతో శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమాలో శ్రీదేవి 'మానవా' అని మాట్లాడే అమాయకపు మాటలు, ఆమె నటన మరువలేనిది. ఆమె తన కూతుర్ని వెండితెర మీద చూసుకోవాల్సిన తరుణంలో ఇలా వెళ్లిపోవడం మాత్రం చాలా బాధాకరం.
హేమమాలిని: శ్రీదేవి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగినప్పటికీ ఎప్పుడు దక్షిణాది సాంప్రదాయాలను వీడలేదు. ఆ విషయాన్ని మేము శ్రీదేవి ఇంటికెళ్లినప్పుడు అణువణువు గ్రహించే వాళ్ళం. ఎంతో బాధ్యతో మెలిగే శ్రీదేవి ఇక లేదంటే నమ్మశక్యం కావడం లేదు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి.
సచిన్: శ్రీదేవి మరణం సినిమా పరిశ్రమకి తీరని లోటు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలి.
ఎన్టీఆర్: ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి మరణంపై స్పందిస్తూ.. వచ్చింది, చూసింది, ఆక్రమించింది వెళ్లిపోయింది. ఏ స్వర్గం నుంచి వచ్చిందో అక్కడికే వెళ్లిపోయిందని ఆమె ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేసాడు.
నిర్మాత ఏ.ఎం.రత్నం: శ్రీదేవిగారి కుటుంబంతో నా అనుబంధం మరువలేనిది !!
శ్రీదేవిగారితో నా అనుబంధం ఈనాటిది కాదు. నా సూపర్ హిట్ సినిమాల్లో ఎక్కువగా హిందీలో రీమేక్ చేసింది బోణీ కపూర్ గారే. ముంబై వెళ్ళినప్పుడల్లా శ్రీదేవిగారి ఇంటికి వెళ్లకుండా ఎప్పుడూ వెనుదిరగలేదు. అటువంటి మంచి మనిషి, అద్భుతమైన నటి నేడు మన మధ్య లేదు అన్న చేదు నిజాన్ని దిగమింగడం చాలా కష్టంగా ఉంది.
మోహన్ బాబు: శ్రీదేవి కుటుంబంతో నాకు తిరుపతి నుండి మంచి అనుబంధం ఉంది. ఆమె తల్లి తిరుపతికి చెందినవారు. శ్రీదేవితో కలిసి చాలా సినిమాల్లో నటించాను. భారతీయ చిత్రసీమ మంచి నటిని మాత్రమే కాదు, ఉన్నతమైన వ్యక్తిని కూడా కోల్పోయింది. నా 42వ సినీ జీవిత ఉత్సవాలు విశాఖపట్నంలో జరుగుతున్నప్పుడు కేవలం ఫోన్ చేయగానే వైజాగ్ వచ్చి, ఆ వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోనిబ్బరాన్ని ఆ శిరిడీ సాయినాధుడు ప్రసాదించాలని కోరుకొంటున్నాను.
బాలకృష్ణ : శ్రీదేవి గారి హటాన్మరణం బాధాకరం !!
శ్రీదేవిగారితో నాన్నగారు చాలా సినిమాల్లో నటించారు. ఎలాంటి భావాన్నైనా కళ్ళతోనే పలికించగల మహానటి శ్రీదేవిగారు. ఆవిడ హటాన్మరణం చిత్రసీమకు తీరని లోటు. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని వేడుకొంటున్నాను.