శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ నాయికగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్లీ రావా' . ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 8న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ''చిన్నప్పుడు నన్ను సుమంత్ అన్న చాలా పాంపర్ చేసేవారు. ఆన్‌స్క్రీన్‌లో పెయిన్‌తో ఆయన చాలా బావున్నారు. ఈ సినిమా ఆయనకు చాలా పెద్ద హిట్ కావాలి. శ్రవణ్ సంగీతం బావుంది. ఆకాంక్ష చూడ్డానికి చాలా బావుంది. యూనిట్ అందరికీ అల్ ద బెస్ట్..'' అని అన్నారు.
హీరో సుమంత్ మాట్లాడుతూ... ''శ్రవణ్ చాలా బాగా సంగీతం ఇచ్చాడు. అఖిల్‌కి పాటలు వినగానే నచ్చాయి. గౌతమ్ నాకు ఈమెయిల్ చేస్తూనే ఉండేవాడు. అలా మూడు నాలుగు నెలలు అయ్యాక నేను రమ్మని పిలిస్తే వచ్చి విన్నాడు. ఈ సినిమాలో కిడ్స్ ఎపిసోడ్ చాలా బావుంటుంది. ఇప్పటి వరకు 22 సినిమాలు చేశాను. వాటిలో గోదావరి, గోల్కొండ స్కూలు సినిమాలకి చాలా దగ్గరగా ఉంటుంది. సినిమా చుట్టేయలేదు. అయినా 30 రోజుల్లో చేశాం. రాహుల్ చాలా చక్కగా నిర్మించారు. రాహుల్ దగ్గర నుంచి మేం అన్నపూర్ణ స్టూడియో కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆకాంక్ష చాలా బాగా నటించింది. ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. సినిమాలో చాలా కామెడీ ఉంటుంది, చాలా వినోదం ఉంటుంది. కానీ వాటన్నిటినీ మామూలుగా ట్రైలర్‌లో పెట్టలేదు. అవన్నీ పెట్టుకుండానే మా ట్రైలర్ చాలా బాగా రీచ్ అవుతోంది. పెయిన్ అనేది తెలుగు ఆడియన్స్ కి వైరల్ ఎమోషన్ కాదు. అయినా మా సినిమాను హిట్ చేస్తున్నారు. గోదావరి తర్వాత నేను చేసిన నిజాయతీ ఉన్న సినిమా ఇది'' అని అన్నారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ''పరిశ్రమకు ఆకాంక్షను ఆహ్వానిస్తున్నాను. ఈ పరిశ్రమలోకి ఎవరు వచ్చినా కళామతల్లి ఆహ్వానిస్తుంది. ఆదరిస్తుంది. సుమంత్ ఈ సినిమా గురించి నాకు చెబుతూనే ఉన్నారు. శ్రవణ్ సంగీతం బావుంది. కె.కె.రాసిన కొన్ని పదాలు నచ్చాయి. కొన్ని అర్థం కాలేదు. ఈ చిత్రంలోని డైలాగులను బట్టి చూస్తే దర్శకుడు తప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారేమోనని అనిపిస్తోంది. సినిమా పెద్ద హిట్ కావాలి'' అని అన్నారు.
రకుల్ ఫ్రీత్‌సింగ్ మాట్లాడుతూ.. ''నాకు రొమాంటిక్, లవ్ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ ఎక్కడోకానీ మనసుకు నచ్చే సినిమాలు రావు. ఈ సినిమా అలాంటి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. పాటలు చాలా బావున్నాయి. సినిమా పెద్ద హిట్ కావాలి..'' అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలోని పాటలు ఇంత బాగా రావడానికి కారణం గౌతమ్. కృష్ణకాంత్‌గారికి రఫ్ ట్యూన్స్ చేసి ఇచ్చినప్పుడు చాలా బాగా రాశారు. నాకు తెలుగు డిక్షన్ ఆయన దగ్గరే నేర్చుకున్నాను. 'మళ్లీ రావా' అని మేం ఓ ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ చేశాం. నేను, కృష్ణకాంత్, సాయికృష్ణ అని ఇంకో అతను చేశాం. ఇప్పుడు'మళ్లీ రావా' తో మరలా మేం కలిశాం. మధుర శ్రీధర్‌గారు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సుమంత్‌గారు ఈ సినిమాలో చేయడం చాలా ఆనందంగా ఉంది. సుమంత్ చాలాబాగా ఎంకరేజ్ చేశారు'' అని చెప్పారు.
నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ''వెరీ గుడ్ స్టోరీ. గౌతమ్ చాలా బాగా స్టోరీ రాసుకున్నారు. చదవగానే నచ్చేసింది. సిన్సియర్‌గా, హానస్ట్ గా, మా టీమ్ అందరూ కష్టపడి ఇష్టపడి చేశారు. అందుకే రిజల్ట్ అంత బాగా వచ్చింది. 10 నెలలు ప్రీ ప్రొడక్షన్ చేసాము. సుమంత్ గారు మాకు సపోర్ట్ చేసినందుకు కృతఙ్ఞతలు తెలియ చేస్తున్నా. డిసెంబర్ 8న సినిమా విడుదల చేస్తున్నాం. శ్రవణ్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. కె.కె.గారు పాటలు చాలా బాగా రాశారు..'' అని అన్నారు.
డైరెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. ఈ స్టోరీ 2 ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాను. చాలా మంది నిర్మాతలను కలసి స్టోరీ నారెట్ చేశా. అందరికీ నచ్చింది కానీ కొత్త కనుక నన్ను నమ్మి ముందుకు రాలేకపోయారు. ఫైనల్లీ రాహుల్ యాదవ్ సినిమా చేయడంతో ఇక్కడి వరకు వచ్చింది. నేను ఈ సినిమాకు దర్శకుడిని, రచయితను. ఇది నేచురల్ లవ్‌స్టోరీ. ఇందులో సన్నివేశాలు, డైలాగులు, పాత్రలు అన్నిటినీ చాలా సహజంగా తీయడానికి ట్రై చేశాం. 200 పేజీల బౌండ్ స్క్రిప్ట్ నుంచి ఈ సినిమాను చేశాం. సతీష్ ముత్యాలగారి కెమెరా పనితనం గురించి అందరూ గొప్పగా చెబుతారు. ఆయన వల్లనే ఈ సినిమాను 30 రోజుల్లో చేశాం. సంగీతం చాలా బాగా కుదిరింది. శ్రవణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. రెండు నెలలకు ముందే సంగీతం ట్రై చేశాం. కథను ముందు తీసుకెళ్లేలా పాటలను పెట్టాం. సీన్‌లో డైలాగ్స్ ఎంత కీలకమో, పాటలో సాహిత్యం కూడా అంతే ముఖ్యం అని నమ్మాను. నా టీమ్‌కి ధన్యవాదాలు. సుమంత్‌గారు ఇచ్చిన నమ్మకంతోనే ఇంత బాగా చేయగలిగాను'' అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్ రెడ్డి, టీ.ఎన్.ఆర్, మిర్చి కిరణ్, కె.కె. లతో పాటు కెమెరామన్ సతీష్ ముత్యాల తదితరులు పాల్గొన్నారు.