కుంభకోణంలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న నందమూరి బాలకృష్ణ చిత్రం
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కుంభకోణంలో ఓ భారీ షెడ్యూల్ జరుపుకొంటోంది. నేటితో(సోమవారం) కుంభకోణం షెడ్యూల్ పూర్తవుతుంది. ఈరోజు కుంభకోణంలో ఓ భారీ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. ఓ ఆలయం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్‌లో నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, మురళీ మోహన్, జేపీ, ఎల్బీ శ్రీరామ్‌లతో పాటు ఇతరప్రధాన తారాగణం కూడా పాలుపంచుకొంది. దాదాపు 2వేల మంది పురోహితులు, ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టుల నేపథ్యంలో ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, అరివి మణి ఈ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. సెన్సేషనల్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణగారు హీరోగా ఆయన 102వ చిత్రాన్ని నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. భారీ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ఎం.రత్నం అద్భుతమైన కథను అందించారు. శ్రీరామరాజ్యం, సింహా వంటి బ్లాక్ బస్టర్ల అనంతరం బాలకృష్ణ సరసన నయనతార నటించనుండడం విశేషం. రాంప్రసాద్ గారు ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. బాలయ్య 100వ చిత్రమైన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి సంగీత సారధ్యం వహించి చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చనుండడం విశేషం. 30 రోజుల పాటు సాగిన కుంభకోణం షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ పోరాట ఘట్టం రూపొందించాం. బాలయ్యపై ఓ గీతాన్నీ తెరకెక్కించాం. ఖర్చుకి ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈచిత్రాన్ని రూపొందిస్తున్నాం.. అన్నారు.
బాలకృష్ణ, నయనతార, నటాషా దోషీ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎద్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!