సినారే.. ఈ పేరు వినని దేశంలోని సాహిత్యాభిమాని మరోకరుండరు. ఇక తెలుగు వారికైనా ఆయన సుపరిచితుడు. కవి, పండితుడు, హిందీ, ఉర్దూభాషలు, గజల్స్‌పై ఎంతో అనురామమున్న ఆయన హఠాన్మరణం విని తెలుగు సినీ సంగీత ప్రియులేగాక, సాహిత్యాభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవలే దాసరి వంటి దర్శక, రచయితను కోల్పోయి తెలుగువారికి సినారే మరణం మరింత కృంగదీసిందన్నడంలో సందేహం లేదు.
మహాకవి అయిన ఆయన తనకు తెలుగు భాషపై, పదాలపై ఎంత పట్టు ఉన్నప్పటికీ సినిమా పాటలు రాయడానికి ముందు ఒప్పుకోలేదు. 'గులేభకావళి కథ' చిత్రంలో ఓ పాట రాయమని స్వయాన నాటి స్వర్గీయ ఎన్టీఆర్ కోరగా ఆయన తిరస్కరించారు. అన్పిపాటలు రాసే బాధ్యతను తనకిచ్చి, టైటిల్స్‌లో సింగిల్ నేమ్ వేయడానికి కూడా ఎన్టీఆర్ సమ్మతించారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ అంటే ఎవరికైనా సింహస్వప్నమే. కానీ సినారె ఎన్టీఆర్ మాటకు ఎదురుచెప్పారు. చివరికి సినారె మొండితనం తెలిసిన ఎన్టీఆర్ ఆ చిత్రంలోని పాటలన్నీ ఆయనచేతనే రాయించారు. కవిగా, రచయితగా, సినీ పాటల రచయితగా ఎవ్వరూ అధిరోహించని శిఖరాలను ఆయన అందుకున్నారు.
ఆయన పూర్తి పేరు (సినారె) సింగిరెడ్డి నారాయణ రెడ్డి, ఆయన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన హనుమాజీ పేట అనే పల్లెటూరిలో జన్మించారు. అలాంటి ఆయన భారత సాహిత్యరంగంలో దిగ్గజమనే చెప్పాలి. 'గులేబకావళి కథ'లోని 'నన్ను దోచుకొందువటే.. ' పాట ఎంతటి సూపర్‌హిట్టో అందరికీ తెలుసు. ఆ చిత్రం మ్యూజికల్‌గా పెద్ద హిట్ కావడంతో సినీ చరిత్రలో కూడా ఆయనకు ఎదురే లేకుండా పోయింది. హిందీ పాటలను, ఆయా చిత్రాలను రీమేక్ చేసేటప్పుడు ఆయనను అందరూ గుర్తుచేసుకుంటారు. 'జంజీర్' చిత్రాన్ని ఎన్టీఆర్ తెలుగులోకి రీమేక్ చేసేటప్పుడు ఆయన రాసిన 'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం' పాటను అద్భుతంగా రచించి, హిందీ, ఉర్దూ, తెలుగు భాషల్లో ఆయన తనకున్న పట్టు నిరూపించుకున్నారు.
'బందిపోటు'లోని 'వగలరాణివి నీవే.. సొగసుకాడను నేనే', 'రాముడు భీముడు'లోని 'నెరజాణ నీ రూపు తెలిసిందిలే', 'అల్లూరి సీతారామరాజు'లోని 'వస్తాడు నారాజు ఈ రోజు'లతో పాటు హైదరాబాద్ గొప్పతనాన్ని చెబుతూ, 'రిమ్‌జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్' పాటను ఎవరు మర్చిపోగలరు? ఇక వైవిఎస్‌చౌదరి, హరికృష్ణల కాంబినేషన్‌లో వచ్చిన 'సీతయ్య' చిత్రంలోని 'ఇదిగో రాయలసీమ గడ్డ.. దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డా' అనే పాటకు ఆయన కలం నుంచి బయటకు వచ్చి ఊర్రూతలూగించింది. ఇక టి.కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన 'రేపటి పౌరులం' అనే టైటిల్ సాంగ్ చిన్నపిల్లల నుంచి పెద్దవారికి కూడా స్ఫూర్తిగా నిలిచింది.
ఇక నెగటివ్ పాత్ర అయిన దుర్యోధనునిపై 'దాన వీర శూర కర్ణ' చిత్రంలో 'చిత్రం భళారే విచిత్రం' పాట అద్భుతం. ధుర్యోధనునిపై రొమాంటిక్ గీతం అనే సరికి రచయితలందరూ మా వల్ల కాదు అని చెప్పినప్పుడు సినారే దానిని ఓ చాలెంజ్‌గా తీసుకుని రాసిన ఈ పాట ఇప్పటికీ నిత్య నూతనంగానే ఉంటుంది. ఒక్క ఎన్టీఆర్‌కే కాదు.. ఆయన ఏయన్నార్, కృష్ణలకు కూడా అత్యద్భుతమైన మేలిమి బంగారు పాటలందించారు.