దర్శకరత్న దాసరి మృతి చెందిన అప్పుడే వారం అవుతోంది. టాలీవుడ్‌లో తనదైన ముద్రవేసి, ప్రతి ఒక్కరికి ఆత్మీయుడిగా పేరు తెచ్చుకున్న దాసరి నారాయణరావు సంతాపసభ ఇప్పటి వరకు జరగకపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. గతంలో సినీ ప్రముఖులు మరణించిన సందర్భాల్లో కనీసం అంత్యక్రియలు జరగకముందే పరిశ్రమ సంతాపసభ నిర్వహించిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
అలాంటిది దాసరిని పరిశ్రమ మరిచిపోవడం అనేక సందేహాలను కలిగిస్తోంది. దాసరి బతికి ఉన్నపుడు భయం, భక్తులు చూపిన పెద్దలు ఆయన కన్ను మూయడంతో ముఖం చాటేశారు. ఎందరికో సినీ జన్మనిచ్చి, మరెందరికో ఆత్మీయుడిగా అండగా నిలిచిన దాసరి పార్థీవ దేహాన్ని కడసారి చూడ్డానికి సైతం పెద్ద తారలు రాకపోవడం చర్చనీయాంశమైంది. దాసరి ద్వారా కెరీర్‌లో ఎదిగిన శ్రీదేవి, జయసుధ, జయప్రద సైతం కనిపించలేదు, స్పందించలేదు. ఇక అగ్రతారలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్‌బాబు, మురళీమోహన్, రామ్‌చరణ్, కృష్ణంరాజు వంటి వారి విదేశాల్లో ఉన్నామనే కారణం చూపారు.
దాసరి సమకాలికుడు కె.రాఘవేంద్రరావు ఊటీలో ఉండి రాలేదట. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది అనేక కారణాలు చెబుతున్నారు. దాసరిపై అభిమానం ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే 24 గంటల్లో చేరుకునే అవకాశం ఉందనే విషయాన్ని అభిమానులు గుర్తుచేస్తున్నారు. సినీ పెద్దలు లేరనే కారణం చూపుతూ సంతాపసభను నిర్వహించడం లేదని అంటున్నారు. దాసరి తన సినీ ప్రస్థానంలో ఎప్పుడూ స్టార్స్‌ని విశ్వసించలేదు. చిన్నవారినే ప్రోత్సహించారు. కార్మికులకు అండగా నిలిచారు. కొందరి కోసం మహా దర్శకుడిని స్మరించుకునే అవకాశాన్ని వాయిదా వేయడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చివరి చూపుకు సైతం కదలిరాని వారి కోసం ఎదురుచూడడం అనవసరం అని వారు స్పష్టం చేస్తున్నారు.