కాపులకు రిజర్వేషన్ల విషయంలో ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమానికి మద్దతు పలికి, కాపు నేతలందరినీ ఒకేతాటిపైకి తెచ్చిన ఘనత స్వర్గీయ దాసరికి చెందుతుంది. కాగా ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం దాసరి కాపులకు రిజర్వేషన్ల విషయంలో ఇంకా సూటిగా ముందుకుపోవాలని భావించారట. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం 1000కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో ఆయన దానిపై సానుకూలంగా స్పందించారట.
ఇక ఈ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారు, విదేశాలలో చదువులకు వెళ్లిన కాపు యువతతో ఆయనే స్వయంగా ఫోన్‌లో మాట్లాడి ఆ కార్పొరేషన్ వల్ల కాపులకు మేలేనని తెలుసుకున్నాడట. దాంతోనే తన చివరి రోజుల్లో ఆయన కాస్త తటస్తంగా వ్యవహరించాడని అంటున్నారు. ఆయన పలు ప్రాంతాల నుంచి తనను కలవడానికి చివరి రోజుల్లో వచ్చిన పలువురు కాపు నేతలతో ఇదే విషయం గురించి బాగా చర్చించినట్లు తెలుస్తోంది. కాపు కార్పొరేషన్ వల్ల బాగానే మంచి జరుగుతోందని, ఆ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేసుకోవడం కాపుల చేతిలోనే ఉందని, అంతేగానీ పంతాలకు పోయి రుణాలు, ఇతర సౌకర్యాలు వద్దనుకుంటే చివరకు కాపు జాతే నష్టపోతుందని, తన రాజకీయ జీవితంలో ఎలాగూ ఉపయోగపడకుండా మురిగిపోయిన నిధులను, పథకాలను తాను చాలా చూశానని తన సన్నిహితులతో చెప్పేవారని సమాచారం.
ఇక చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి, వచ్చే ఎన్నికల నాటికి రిజర్వేషన్లు కూడా కలిసి కట్టుగా సాధించుకోవాలని, మనం ఐక్యతగా ఉండబట్టే ప్రభుత్వంలో ఎవరున్నా మనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన చెప్పారట. అలాగే చంద్రబాబు గురించి తనకు బాగా తెలుసునని, ఆయన తమకు గల ఓటు బ్యాంకు పవర్ గురించి, తమకు రిజర్వేషన్లు కల్పించకపోతే వచ్చే పర్యవసానాలు, కోల్పోయే ఓటు బ్యాంకు వంటివి చెప్పి, గట్టిగా వాదిస్తే, తన పార్టీ పదవిలో ఉండటం కోసమైనా ఆయన మంచే చేస్తారని, అంతేగానీ ముర్ఖంగా పోయే నాయకుడు కాదని తన వారికి ఆయన తరచుగా చెప్పేవాడట.
ఇక కొత్త పార్టీలలో చేరితే నేడు యువత, యువ నాయకులు, రాష్ట్రంలో, దేశంలో సీనియర్లకు గౌరవం ఇచ్చే పరిస్థితి తనకు కనిపించడం లేదని, రాష్ట్రంలోని మిగతా యువనాయకులు కూడా ఇలాగే ఉన్నారని ఆయన అన్యాపదేశంగా జగన్‌ను ఉద్దేశించి, వైసీపీలో చేరడం గురించి నర్మగర్బంగా మాట్లాడాడని దాసరికి సన్నిహితుడు ఒకరు చెప్పుకొని వచ్చారు. కాగా దాసరి చనిపోయిన తర్వాత ఆయన మా పార్టీలోకి రావాలనుకున్నాడు అని భూమాకరుణాకర్‌రెడ్డి చేసిన ప్రకటనను కూడా దాసరి సన్నిహితులు రాజకీయ వ్యాఖ్యలుగా కొట్టిపడేస్తున్నారు.