దాసరి నారాయణ రావుకు సినిమాలు తీయడం కన్నా దిన పత్రికను నడపడటం చాలా కష్టమని, కోట్లతో కూడుకున్న దినదిన గండమని బాగానే తెలుసు. అప్పటి వరకు తెలుగులో రామోజీ రావు ఈనాడుకు తిరుగేలేదు. ఇక 1984లో దాసరి 'ఉదయం' దిన పత్రికను ప్రారంభించారు. ఈ పత్రికలో ఏబీకె ప్రసాద్, పతంజలి, దేవులపల్లి అమర్, రామ చంద్రమూర్తి, కె.శ్రీనివాస్, వర్దెళ్ల మురళి, అంబటి సురేంద్రరాజు, మాడభూషి శ్రీధర్, పాశం యాదగిరి వంటి వారు పనిచేశారు.
ఈ పత్రిక ఎవ్వరికీ కొమ్ముకాసేది కాదు.. ప్రజల పక్షాన నిలబడేది. దీంతో పాఠకులు ఈ పత్రికను చాలా తక్కువ కాలంలోనే బాగా ఆదరించారు. ఈ పత్రికలో పనిచేసే వారికి ఎంతో స్వేఛ్చ ఉండేది. యాజమాన్యం ఒక స్టాండ్ తీసుకోవడం, దానికి తగ్గట్లుగా వార్తలు రాయమని జర్నలిస్ట్‌లపై ఒత్తిడి ఉండేది కాదు. ఈ పత్రిక ఎవ్వరి పక్షం తీసుకోలేదు. పూర్తి స్వేచ్ఛ ఉండేది. చివరకు అప్పుడు ప్రముఖ
నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్యను కూడా ఇంటర్వ్యూ చేసే స్వేచ్చను పాత్రికేయులకు ఇచ్చారు. ఇక ఉదయం పత్రికతోనే ఒక్కో రంగానికి ఒక్కో పేజీని కేటాయించడం మొదలైంది. సినిమాలకు ఒక పేజీ, ఆటలకు ఓక పేజీ.. ఇలా కొత్త ఒరవడి తెచ్చింది.
దీంతో మిగిలిన పత్రికలు, చివరకు ఈనాడు కూడా ఇదే బాటలో నడవక తప్పలేదు. ఇక ఉదయంలో స్పోర్ట్స్ పేజీకి నేటి క్రికెట్ విశ్లేషకుడు వెంకటేష్ సారధ్యం వహించే వారు. ఎవరు బాగా రాసినా దాసరి పిలిచి మరీ అభినందించి, భుజం తట్టేవారు. ఇక ఆయన ఉదయం వీక్లీని కూడా నడిపారు. మరోవైపు ఆయన 'ఓసేయ్ రాములమ్మ, సమ్మక్కసారక్క' వంటి చిత్రాలతో ఆనాడే తెలంగాణ కళలను, సంప్రదాయాలను ప్రజలకు చేరువచేసి తెలంగాణవాదిగా నిరూపించుకున్నారు. ఉదయంలో కూడా ఎక్కువ మంది తెలంగాణ పాత్రికేయులే ఉండేవారు. ఇక ఆయన మహిళా పక్షపాతిగా ఉండేవారు. తన చిత్రాలలో ఎక్కువగా మహిళలను సమస్యలను ప్రస్తాంచిండమే కాదు.. పరిష్కారం కూడా చూపారు.
ఆయన తీసిన 'అమ్మరాజీనామా' 'కంటే కూతుర్నే కను' లు సంచలనమనే చెప్పాలి. ఇక సినీ రంగంలోనే ఉంటూ ఈ రంగంలోని చీకటి కోణాలను 'అద్దాలమేడ, శివరంజని' చిత్రాలలో చూపించారు. కృష్ణ కుమారులైన రమేష్ బాబు, మహేష్ బాబులను 'నీడ' చిత్రంతో పరిచయం చేశారు. నటుడిగా, పాటల రచయిగా, మాటల రచయితగా, రంగస్థల నటునిగా , దర్శకునిగా, గిన్నిస్‌బుక్‌కి ఎక్కిన దర్శకునిగా, పాత్రికేయునిగా, పత్రికాధిపతిగా, వ్యంగ్య రచయితగా, పార్లమెంటేరియన్‌గా, రాజకీయ నాయకునిగా, కేంద్రమంత్రిగా, వ్యాస రచయితగా, దక్షిణాది భాషల్లోనే కాక హిందీలో కూడా చిత్రాలు తీసిన దర్శకునిగా తన సత్తా చాటారు.
ఒకే సామాజిక వర్గం పెత్తనం చెలాయిస్తున్న రోజుల్లో అందరి మన్ననలు పొందిన వ్యక్తిగా, ఎన్టీఆర్, ఏయన్నార్‌లు కూడా మెచ్చుకునే స్థాయికి ఆయన ఎదిగారు. హైదరాబాద్‌లో మొదట్లో చిన్న ఉద్యోగం చేస్తూ తెల్లవారు ఝూమున 3గంటలకు లేచి నాలుగు చపాతిలు, కూర తయారు చేసుకుని, నాంపల్లి దాకా నడిచి వచ్చి, బస్సులో సనత్‌నగర్ దాకా వెళ్లేవాడు. ఆ రోజుల్లో బస్సులు సనత్ నగర్ దాకానే ఉండేవి. అక్కడి నుంచి బాలానగర్ దాకా నడకే. వచ్చేటప్పుడు ఇదే పరిస్థితి. కానీ ఆయన ఎప్పుడు డీలా పడలేదు. చేసే పనినే దైవంగా భావించేవారు. రాత్రిళ్లు నాటకాలు రిహార్సల్స్ చేసుకోవడం, కనీసం నెలకొకసారైనా రవీంద్ర భారతిలో నాటకాలు వేసేవారు.