బహదూరపు బాటసారి తన జీవితంలో ఎక్కని మెట్టేలేదు. ఏ రంగంలో ఎదగాలనుకుంటే ఆ రంగంలో ఎదిగారు. తన సినీ ప్రస్దానంలో ఎందరో నేటి మేటి దర్శకులను తీర్చిదిద్దారు. అద్భుతమైన ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించారు. ఇలా ఎందరి జీవితాలలోనో వెలుగులు నింపిన ఆయన తన కొడుకు దాసరి అరుణ్ కుమార్‌ను హీరోగా పరిచయం చేశారు. హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు, మంచి ఒడ్డు పొడవు అన్నీ ఉన్న నటుడు అరుణ్. ఆయనను దాసరి హీరోగా పరిచయం చేస్తూ 'గ్రీకువీరుడు' చిత్రం చేశాడు.
ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాలను తీశాడు. కానీ ఆయన కుమారుడు హీరోగా రాణించలేకపోయాడు. ఇక ఆయనకు రాజీవ్ గాంధీతో మంచి అనుబంధం ఉంది. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత సోనియాగాంధీని బాగా అభిమానించారు. కేవలం రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలకు తప్ప ఇక ఎవ్వరికీ ఆయన గులాంగిరీ కొట్టలేదు. ఎవరితోనైనా కలగలుపుగా ఉంటాడే గానీ ఎవ్వరికీ తలవంచే మనస్తత్వం ఆయనకు లేదు. సోనియా అధ్యక్షురాలిగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ఆయన కేంద్ర బొగ్గు గనుల శాఖా సహాయ మంత్రిగా పనిచేశారు. తన పని తాను నిక్కచ్చిగా చేసుకుపోవడమే ఆయనకు తెలుసు.
ఇక రెండో సారి కూడా రాజ్యసభకు వెళ్లారు. కేంద్ర గనుల శాఖా మంత్రి శిబుసోరెన్ అరెస్ట్‌తో ఆ శాఖను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. ఇంతలో జిందాల్ కంపెనీకి బొగ్గుగనుల కేటాయింపులో ఆయన కోట్లకు కోట్లు స్కాం చేశాడనే చెడ్డపేరు వచ్చింది. అసలు ఆ గనులను కేటాయించే అధికారం తనకు లేనప్పుడు ఆ గనులను తానెలా లంచం తీసుకొని కేటాయిస్తానని ఆయన మన్మోహన్ సింగ్‌ను కూడా సూటిగా ప్రశ్నించారు. ఆ స్కాంలో తనకు అసలు ప్రమేయమే లేకపోయినా తనపేరు ఇరికించి తనను అప్రదిష్ట పాలు చేశారని ఆయన ఆవేదన చెందారు.
అలా ఆయనకు బొగ్గు మసి మరక అంటుకుంది. ఆయన తరచుగా తన సన్నిహితులతో 'నేను సినిమాలలో ఉన్నప్పుడే బాగుండేది. అందరూ మేస్త్రి, గురువు గారు అని ఆప్యాయంగా, గౌరవంగా చూసుకునే వారు. కానీ ఈ రాజకీయాల కంపు నేను భరించలేకున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కడు పెద్ద పెద్ద నాయకుడిగా ఫీలవుతాడు. నిజమైన వారికి విలువ, గౌరవం లేవు. అందరికీ అణిగిమణిగి ఉండి సలాంలు కొట్టాలి. లేకపోతే ఇక్కడ రాణించలేం. తట్టాబుట్టా సర్దుకోవలసిందేననే ఆవేదనను ఆయన వ్యక్తపరిచేవారు.