నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.... ఆ దేవుడు మీరే మాస్టారు.. అనే పాట దాసరికి సరిగ్గా సరిపోతుంది. రాజకీయాలపై ఆయన ఏనాడో 'ఎమ్మెల్యే ఏడుకొండలు'తోపాటు పలు రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఎన్టీఆర్‌తో కాస్త అభిప్రాయ భేదాలు వచ్చినా ఎన్టీఆర్ అధికారంలో ఉన్నా కూడా ఇలాంటి రాజకీయ వ్యంగ్య చిత్రాలను తీసి ప్రజలను చైతన్యవంతులను చేశారు. వాస్తవానికి దాసరి చాలా పేద కుటుంబంలో పాలకోల్లులో జన్మించారు.
ఒకప్పుడు వారిది కూడా బాగా బతికిన కుటుంబమే. కానీ పొగాకు వ్యాపారం వల్ల ఆయన తల్లిదండ్రులు ఆ కాలంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చివరకు మూడున్నర కట్టలేక ఆయన్ను ఆరో తరగతిలోనే చదువు మాన్పించి వడ్రంగి పనిలో చేర్పించారు. అక్కడ ఆయన జీతం నెలకు రూపాయి. కానీ స్కూల్‌లో ఎప్పుడు ఫస్ట్‌ర్యాంకు తెచ్చుకున్నే ఆయన్ను స్కూల్ మాన్పించడం ఆయన గురువుకు నచ్చలేదు. దాంతో ఆయన స్కూల్ ఉపాధ్యాయుడు ఆయన ఇంటికి వచ్చి దాసరి తండ్రిని దాసరిని స్కూల్ మాన్పించడంపై మండిపడ్డారు.
కానీ మా ఆర్థిక పరిస్థితి బాగాలేదని, కాబట్టి నా కుమారుడిని స్కూల్‌కు పంపలేనని దాసరి తండ్రి ఆయన గురువుకు చెప్పారు. నువ్వేం చదివించవద్దు.... మీ పిల్లవాడిని నేను చదివిస్తానని చెప్పిన దాసరి గురువు దాసరిని తీసుకుని స్కూల్‌కి వచ్చి తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు పిల్లలను కూడా దాసరి చదువుకు తోచిన సాయం చేయమన్నాడు. అందరూ తాము దాచుకున్న అణాలు, బేడాలను టేబుల్‌పై ఉంచారు. ఆ మొత్తం దాసరి ఫీజుకు సరిపోయింది. ఇక ఆ రోజుల్లో సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత హిందీ క్లాస్‌లు ఉండేవి. వాటికి కూడా దాసరి వెళ్లేవారు. కానీ ఆయన హిందీ నేర్చుకోవాలనే కోరికతో ఆ క్లాసులకు వెళ్లలేదు.
ఆ కాలంలో హిందీ క్లాసులకు వెళ్లేవారికి ప్రోత్సాహకంగా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ ఏదో ఒకటి పెట్టేవారు. దాసరి ఆ ఇడ్లీ, దోసె కోసం హిందీక్లాసులకు వెళ్లారు. కానీ హిందీలో కూడా రాష్ట్ర వరకు చదవి, మంచి పట్టు సాధించి, హిందీ చిత్రాలకు సైతం దర్శకత్వం వహించారు. నేడు దర్శకుడు అయిన తర్వాత ఆయనకు హైదరాబాద్‌లోని ఖరీదైన జూబ్లీహిల్స్‌ప్రాంతంలో ఖరీదైన భవనాలు, కార్లు ఉండి ఉండవచ్చు. కానీ చిన్నతనంలో ఆయన ఎంతో దారిద్య్రం అనుభవించిన సంగతి కొందరికే తెలుసు.