ప్రముఖ కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మహిళా ప్రధాన చిత్రం డోర. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి దాస్ దర్శకుడు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు. వివేక్, మెర్విన్ సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతావిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.ఆడియో సీడీలను ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురక్ష్ అంటే మంచి రక్షకుడు. ఈరోజు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలకు మార్కెట్‌లో మంచి రక్షకుడిగా మల్కాపురం శివకుమార్ నిలుస్తున్నారు. చక్కటి అభిరుచితో వినూత్న కథా చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డోర బుల్లితెరపై పిల్లలను అలరించే పాపులర్ షో. టైటిల్ చాలా అట్రాక్టివ్‌గా వుంది. పాటలన్నీ అర్థవంతమైన సాహిత్యంతో ట్రెండీగా వున్నాయి. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
కారులో మనం ఒంటరిగా వెళ్తున్నప్పుడు వెనకసీట్లో ఎవరైనా వున్నారనే భావన ప్రతి ఒక్కరిలో భయం కలిగిస్తుంది. ఇలాంటి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు అని అశోక్ అన్నారు. చంద్రబోస్ మాట్లాడుతూ మనసులో ఆత్మీయత, పిలుపులో ఆప్యాయత కలిగిన వ్యక్తి నిర్మాత శివకుమార్. ఈ సినిమాలో గుండెల్లో నిండాయే గులాబీ ఘమఘుమలు అనే అర్థవంతమైన గీతాన్ని రాయడం ఆనందంగా వుంది. ఈ సినిమాతో శివకుమార్‌గారి ఖాతాలో మరో విజయం జమ కావాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. చక్కటి సాహిత్య విలువలతో తెలుగు వెర్షన్ పాటలు శ్రోతలందరిని అలరించేలా వున్నాయని సంగీత దర్శకులు ఆనందం వ్యక్తం చేశారు.
నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ ఈ చిత్రానికి వివేక్, మెర్విన్ అద్భుతమైన సంగీతాన్నందించారు. నయనతార అంటేనే చక్కటి అభినయానికి పెట్టింది పేరు. ఆమెకు అగ్రహీరోలతో సమానమైన ఇమేజ్ వుంది. దక్షిణాది కథానాయికల్లో నయనతార సూపర్‌స్టార్. అత్యుత్తమ నిర్మాణ విలువలతో డోర సినిమాను తెరకెక్కించాం. తెలుగు సంగీతం విషయంలో యశోకృష్ణ ఎంతగానో సహకారం అందించారు. మయూరి తరహాలో ఈ సినిమాతో నయనతార మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. మా సురక్ష్ సంస్థ గర్వించే చిత్రమవుతుంది అన్నారు. దర్శకుడు దాస్ మాట్లాడుతూ తమిళంలో ఆడియో వేడుక చేయలేదు. ఇప్పటివరకు రానటువంటి వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నెల 31న తెలుగు, తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ వేడుకలో దశరథ్, డి.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.