ప్రాంతీయ భాషల్లో ఓ సినిమా వందకోట్లు చేయడం అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ లో అది చాలా కామన్ విషయంగా చెప్పుకుంటారు. బాలీవుడ్ లో వంద కోట్లు అనేది సర్వసాధారణంగా నడుస్తుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాలు ఇలాంటి బజ్ సాధించినా దక్షణ భారత దేశంలో మలయాళ పరిశ్రమ ఇంతవరకు అంతటి బజ్ సాధించలేదనే చెప్పాలి. ఇంతవరకు ఆ ఘనతను సాధించని మాలీవుడ్ ఇప్పుడు ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అదీ మోహన్ లాల్ చిత్రం ఇంతటి స్థాయికి చేరుకోవడంతో మాలీవుడ్ లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. తాజాగా పులిమురుగన్ సినిమాతో వంద కోట్ల క్లబ్ కు గేట్లు ఓపెన్ చేసింది మలయాళం చిత్రం. కాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పులిమురుగన్ భారీ వసూళ్లను రాబడుతుంది. అయితే మాలీవుడ్ లో 2013వ సంవత్సరంలో విడుదలైన దృశ్యంతో తొలిసారిగా రూ.50 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు మోహన్ లాల్ వంద కోట్ల వసూళ్ల సాధించిన తొలి సినిమా రికార్డ్ ను దక్కించుకున్నాడు. విచిత్రంగా ఈ రెండు ఘనతలనూ సాధించిన హీరోగా మోహన్ లాల్ పేరు చరిత్ర కెక్కింది. అయితే మాలీవుడ్ లో ఇంతటి ఘన విజయం సాధించిన పులి మురుగన్ సినిమాను మన్యంపులి పేరుతో తెలుగులో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా మోహన్ లాల్ సరసన కమలినీ ముఖర్జీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి, జగపతిబాబు విలన్ పాత్ర పోషించాడు.