విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం టైటిల్ 'ఆడాళ్ళూ..మీకు జోహార్లు'
వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ..హీరోగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న కథానాయకుడు విక్టరీ వెంకటేష్. ఈ అగ్ర కథానాయకుడు నటించనున్న నూతన చిత్రం అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. 'నేను శైలజ' చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న యువ దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ సమర్పణలో పి.ఆర్.సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత పూస్కూర్ రామ్‌మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఆడాళ్ళూ..మీకు జోహార్లు' అనే టైటిల్ ను ఖరారు చేశారు.
అక్టోబర్‌లో ప్రారంభంకానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత పూస్కూర్ రామ్‌మోహన్‌రావు, దర్శకుడు కిషోర్ తిరుమల తెలియజూస్తూ...అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇంతకు ముందు వెంకటేష్ నటించిన 'ఆడవారిమాటలకు అర్థాలే వేరులే', 'మల్లీశ్వరి', 'నువ్వునాకునచ్చావ్' తరహాలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి టైటిల్ 'ఆడాళ్ళూ..మీకు జోహార్లు' గా ఖరారు చేశాము. వెంకటేష్‌గారి నుండి కుటుంబ ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రంలో వెంకటేష్‌గారి పాత్ర చాలా సహజంగా ఉంటుంది...అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభిస్తాం. త్వరలోనే వెంకటేష్‌గారి సరసన నటించే కథానాయిక తో పాటు.. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాము. ప్రస్తుతం మా వెంకటేష్ బాబు నటించిన 'బాబు బంగారం' చిత్రం మంచి విజయం సాధించి, యూనిట్ కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము..అని తెలిపారు.