శ్యాం కుమార్, పావని, మౌనిక ప్రధాన పాత్రల్లో జైనీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మి జైనీ నిర్మిస్తోన్న చిత్రం 'క్యాంపస్ అంపశయ్య'. ఈ చిత్రాన్ని హిందీలో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. హిందీలోకి తర్జుమా చేసిన పాటలను సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సమావేశంలో..
కె.వి.రమణాచారి మాట్లాడుతూ.. ''ప్రభాకర్ నా శిష్యుడు. కళలు, సాహిత్యాల పట్ల మక్కువ చూపించేవాడు. లక్ష్యం ఉంటే జీవితంలో ఏదైనా సాధించొచ్చు అనే దానికి అంపశయ్య నవలే నిదర్శనం. ఆ నవల ఎందరో యువతకు స్పూర్తిగా నిలిచింది. 45 ఏళ్ళు దాటుతున్న దాని ప్రభావం మాత్రం తగ్గలేదు. అటువంటి సమాజానికి ఉపయోగపడే కాన్సెప్ట్ ని సినిమాగా తెరకెక్కిస్తున్న ప్రభాకర్ కు నా అభినందనలు'' అని చెప్పారు.
అంపశయ్య నవీన్ మాట్లాడుతూ.. ''1969 లో పబ్లిష్ అయిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విద్యార్థుల మానసిక సంఘర్షణతో నడిచే కథ. ఈ నవల చాలా మంది జీవితాలకు గమ్యంగా మారింది. ఈ నవలను సినిమాగా చేయాలని చాలా మంది అడిగారు. అయితే ప్రభాకర్ ఒక్కరు మాత్రమే ఈ కథను సినిమాగా చేయగలిగారు. ఈ చిత్రాన్ని మొత్త ఐదు బాషలలో రిలీజ్ చేస్తున్నారు'' అని చెప్పారు.
ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ.. ''ఓ నవలను సినిమాగా చేయడమంటే చాలా కష్టమైన పని. అంపశయ్య నవీన్ గారు ఓ గొప్ప రచయిత. ఆయన ఏం ఆనుకొని నవలను రచించారో అలానే సినిమాగా తీశారు ప్రభాకర్ గారు. నాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు'' అని చెప్పారు.
దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ.. ''ఇదివరకే తెలుగు, తమిళం, మలయాళం బాషలలో ఈ సినిమా పాటలను విడుదల చేశాం. హిందీలో కూడా పాటలను తర్జుమా చేసి రిలీజ్ చేస్తున్నాం. క్యాంపస్ లో చదివే ప్రతి విద్యార్ధి అంపశయ్య స్టేజ్ ను దాటి వచ్చినవాడే. ఈ చిత్రాన్ని ప్రతి విద్యార్ధి చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: ఘంటసాల విశ్వనాథ్, ఎడిటర్: గోపి సిందం, కెమెరా: రవి కుమార్ నర్ల, మూల కథ: నవీన్ అంపశయ్య, నిర్మాత: విజయలక్ష్మీ జైనీ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-పాటలు-దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.