విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం 'రాయుడు'. ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శుక్రవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
విశాల్ మాట్లాడుతూ.. ''రాయుడు నా కెరీర్ లో స్పెషల్ మూవీ. సినిమా చూసిన ప్రతి ఒక్కరు విశాల్ చాలా బాగా చేశాడని చెబుతున్నారు. నేను చేసిన ప్రయత్నానికి వచ్చిన గెలుపు అదే. ఈ చిత్రాన్ని హరి తెలుగులో రిలీజ్ చేశారు. నిజానికి హరితో ఇది వరకే పని చేయాల్సింది కానీ కుదరలేదు. ఈ సినిమా తెలుగు, తమిళంలో నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నటుడిగా విలేజ్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ చేయమని చాలా మంది అడుగుతున్నారు. భవిష్యత్తులో అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ ఇయర్ లో ఇదే సినిమా దర్శకుడు ముత్తయ్యతో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. థియేటర్ ఈ సినిమా రెస్పాన్స్ చూసి చాలా సంతోషంగా అనిపించింది. మా అమ్మ నాదగ్గరకి వచ్చి ఇప్పుడు కూడా నువ్వు తెలుగులో స్ట్రెయిట్ ఫిలిం చేయకపోతే నీ అంత ఇడియట్ మరొకరు ఉండరని కోపంగా చెప్పింది. ఖచ్చితంగా తెలుగులో సినిమా చేస్తాను. తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా కేరళ, కర్నాటక, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తోంది. త్వరలోనే 'పందెంకోడి2' అలానే తెలుగు స్ట్రెయిట్ ఫిలిం చేయబోతున్నాం. నా తదుపరి సినిమాను అక్టోబర్ 7న రిలీజ్ చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
హరి మాట్లాడుతూ.. ''విశాల్ రియల్ లైఫ్ లో కూడా హీరోనే. ఆయనకు చాలా చేయాలనుంది. ఖచ్చితంగా చేస్తాను. ఈ సినిమా మొదటి వారంలో 5 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. రెండవ వారంలో కూడా 200 థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన రెండు తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు థాంక్స్'' అని చెప్పారు.
శ్రీదివ్య మాట్లాడుతూ.. ''తెలుగులో ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం హరి గారే. భాగ్యలక్ష్మి లాంటి పవర్ ఫుల్ పాత్రలు మళ్ళీ మళ్ళీ చేయాలనుంది. ఈ పాత్రా కోసం ఎంతో కేర్ తీసుకొని చేశాను'' అని చెప్పారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేల్ రాజ్, సంగీతం: డి.ఇమాన్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్.ఫైట్స్: అనల్ అరసు, డాన్స్: బాబా భాస్కర్, సమర్పణ: విశాల్, దర్శకత్వం: ముత్తయ్య.