సాయి రవి, దీప్తి జంటగా.. గ్రీన్ సన్ ఇన్నోవేటివ్స్ పతాకంపై జైహిత సమర్పణలో గన్నవరపు చంద్రశేఖర్, డుంగ్రోత్ పీర్యా నాయక్, గ్యార రవి నిర్మాతలుగా నాగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇక సె.. లవ్'. ఈ సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. నాగేశ్వరరెడ్డి ఆడియో సీడీలను రిలీస్ చేశారు. ఈ సంధర్భంగా..
నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ''నాగరాజ్ కష్టపడి పనిచేసే తత్వం గల మనిషి. నేను చేసిన కొన్ని సినిమాలకు గోస్ట్ రైటర్ గా పని చేశాడు. అప్పటినుండే తనకు దర్శకుడిగా సినిమాలు చేయాలనే పట్టుదల ఉండేది. సినిమా. ఈ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ లో నాగరాజ్ కష్టం కనిపిస్తోంది. సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు .
దర్శకుడు నాగరాజ్ మాట్లాడుతూ.. ''రవిరాజా పినిశెట్టి, ఇవివి వంటి దర్శకుల దగ్గర సుమారుగా 70 చిత్రాలకు పైగా పని చేశాను. దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా. మానవ సంబంధాలన్నీ కనుమరుగైపోతున్న ప్రస్తుతం సమాజంలో ఎలాంటి కాలదోషం పట్టని ఒకే ఒక బంధం ప్రేమ. ఈ విషయాన్ని చర్చిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించాం. మంచి సంగీతం కుదిరింది'' అని చెప్పారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ''మధు ఈ సినిమా కోసం నాలుగు అధ్బుతమైన పాటలను అందించాడు. కమల్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొంది. జూన్ 10న సినిమా రిలీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ మధు మాట్లాడుతూ.. ''డైరెక్టర్ గారికి సంగీతం పట్ల మంచి పట్టు ఉంది. చక్కటి సాహిత్య విలువలతో కూడిన సంగీతం కుదిరింది. ఆడియో, సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫి: వి.శ్రీనివాసరెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, సంగీతం: మధు, నిర్మాతలు: గన్నవరపు చంద్రశేఖర్, డుంగ్రోత్ పీర్యా నాయక్, గ్యార రవి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నాగరాజ్.