అక్కినేని హీరో అఖిల్ రెండో సినిమా గురించి రోజుకో రూమర్ బయటికొస్తుంటుంది. దీంతో ఆ సినిమాపై సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ నడుస్తుంటుంది. ఆ చర్చ కొన్నిసార్లు అఖిల్‌ని కూడా ఇరకాటంలోకి నెట్టుతుంటుంది. అందుకే ఆమధ్య ఆయన ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించాడు. నా సినిమా గురించి నేను చెప్పేంతవరకు వెయిట్ చేయండి, తెలుసుకోకుండా అనవసరంగా రూమర్లు పుట్టించొద్దు, అవసరమైతే నా పీఆర్ టీమ్‌ని కాంటాక్ట్ చేయండంటూ ట్వీటాడు అఖిల్. అప్పట్నుంచి ఆన్‌లైన్‌లో ఆ సినిమా గురించి పెద్దగా వార్తలు కనిపించలేదు. వారం రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి ఆ సినిమా టాపిక్ తెరపైకొచ్చింది. అఖిల్ రెండో సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కాదని, `కృష్ణ గాడి వీర ప్రేమగాథ` ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుందని వార్తలొస్తున్నాయి. అదంతా ఒకెత్తైతే హను ఎన్టీఆర్‌కి చెప్పిన కథనే అఖిల్‌తో తీసేందుకు సమాయత్తమవుతున్నాడని, ఎన్టీఆర్ నో చెప్పినందుకే ఆ కథ అఖిల్ దగ్గరికి వెళ్లిందని చెవులు కొరుక్కుంటున్నారు. దానిపై అప్పుడే ఆన్‌లైన్‌లో చర్చ మొదలైంది. పాపం... అఖిల్ తన సినిమాని స్వయంగా ప్రకటించాలని ఆశపడుతున్నా... ఆయన మాటని ఎవ్వరూ లెక్క చేయడం లేదు. మరి ఈసారి కూడా అఖిల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తాడో లేదంటే ఎవరేమనుకొన్నా అనుకోని అని, చివరికి సినిమానే ప్రకటించేస్తాడో చూడాలి. అన్నట్టు అఖిల్ ప్రస్తుతం నలుగురైదుగురు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్టు అన్నపూర్ణ కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం అఖిల్ రెండో సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ, ఆయన వాలకం చూస్తుంటే మూడు నాలుగు సినిమాలకి కూడా కథలు రెడీ చేసుకుంటున్నట్టు అనిపిస్తోంది.
Advertisement
CJ Advs