ఇండస్ట్రీకి స్టార్ హీరోల సినిమాలే బలం. బాక్సాఫీసు దగ్గర కాసుల గలగలలు వినిపించాలంటే పెద్ద హీరో సినిమా రావల్సిందే. ఆ సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తుంటారో ఇండస్ట్రీ కూడా అంతే ఎదురు చూస్తుంటుంది. వ్యాపారం పుంజుకోవాలన్నా, ఇండస్ట్రీ రెవిన్యూ స్థాయి ఎంతో తేలాలన్నా స్టార్ హీరో సినిమానే కీలకం. అందుకే వ్యాపార వర్గాలు ఆ సినిమాల గురించి ఎదురు చూస్తుంటాయి. సమ్మర్‌లో పవన్ కళ్యాణ్, మహేష్‌బాబులు సందడి చేస్తారని తెలుసుకొన్న టాలీవుడ్ కూడా ఒక పక్క ఎండలు మండిపోతున్నా ఆహా ఇది ఎంత మంచి సమ్మర్ అంటూ ఎక్కడలేని ప్రేమ చూపించింది. కానీ ఆ ప్రేమ కడు దుఃఖంగా మారేందుకు ఎంతో సమయం పట్టలేదు. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య విడుదలైన సర్దార్ గబ్బర్‌సింగ్ బొక్క బోర్లా పడింది. ఆ సినిమాకి వచ్చిన హైప్, ఆ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూసి విడుదలయ్యాక ఇంకెన్ని సంచలనాలో అని మాట్లాడుకొన్నారు జనాలు. కానీ అదేం జరగలేదు. తొలి ఆటతోనే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చేసింది. ఆ వెంటనే వసూళ్లపై ప్రభావం పడింది. మొత్తంగా మరో భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. పవన్ అంటే ఏదో నిరుత్సాహపరిచాడు మహేష్ మాత్రం అలా చేయడులే అని అటువైపు చూడటం మొదలుపెట్టారు. మే 20 అంటూ రేయింబవళ్లు జపించారు. పైగా మహేష్ బ్రహ్మోత్సవం ఆషామాషీ కాంబినేషన్‌లో తెరకెక్కింది కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాంటి సినిమాని తీసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించాడు. శ్రీమంతుడులాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ చేసిన సినిమా.. అందుకే బ్రహ్మోత్సవంపై ఆకాశాన్ని తాకే అంచనాలు కనిపించాయి. పబ్లిసిటీ కూడా అదే రేంజ్‌లోనే ఉండటంతో సినిమా హిట్టు ఖాయం అన్న టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాని తొలిసగ భాగం చూసేసరికే జనాలు పెదవి విరిచేశారు. మహేష్ ఏంటి ఇంత తప్పు చేశాడు? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ సినిమా కూడా డిజాస్టరే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల ఫ్లాప్ టాక్ వల్ల ఇండస్ట్రీ పూర్తిగా కళ తప్పిపోయినట్టైంది. కీలకమైన సమ్మర్ కాబట్టి ఇలాంటి సమయంలో ఏ ఒక్క సినిమా నిలదొక్కుకున్నా బిజినెస్ ఓ రేంజ్‌లో సాగుతుంది. కానీ వస్తున్న సినిమాలన్నీ బ్యాక్ టు పెవిలినయన్ అంటూ తిరుగు ముఖం పడుతుండటంతో వ్యాపార వర్గాలు నిరాశ చెందుతున్నాయి. బన్నీ సరైనోడు, సూర్య 24 రాకపోయుంటే ఇండస్ట్రీ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని చెప్పొచ్చు. అయితే ఇక సమ్మర్‌ని ఆదుకొనే శక్తి ఒకే ఒక్క సినిమాకి ఉంది. త్రివిక్రమ్ `అఆ`కి. ఆ సినిమా అయినా నీరసపడ్డ సమ్మర్‌ని మళ్లీ నిలదొక్కుకునేలా చేస్తుందో లేదో చూడాలి.
Advertisement
CJ Advs