సూపర్ స్టార్ మహేష్ హీరోగా పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'బ్రహ్మోత్సవం'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ సినిమా ఆడియో సీడీలను మహేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా..
సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ.. ''ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మొదటిసారి నా ఆడియో ఫంక్షన్ కి నా కూతురు సితార వచ్చింది. ఈ సినిమాలో పెద్ద పెద్ద యాక్టర్స్ తో పని చేశాను. వారి నుండి చాలా నేర్చుకున్నాను. సత్యరాజ్ గారితో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. కాజల్, సమంత నా ఫేవరేట్ కో యాక్టర్స్. ఇంతకముందే వారితో కలిసి సినిమాలు చేశాను. మరోసారి కలిసి వర్క్ చేయడం సంతోషంగా అనిపించింది. సినిమాలో విజువల్స్ ఇంత అందంగా ఉన్నాయంటే దానికి కారణం తోట తరణి గారే. అధ్బుతమైన సెట్స్ వేశారు. 'అర్జున్' సినిమాకు మదురై టెంపుల్ సెట్ కూడా ఆయనే వేశారు. ఇండియాలో బెస్ట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు. నేను ఫోన్ చేసి అడిగిన వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారు. మిక్కీ అవుట్ స్టాండింగ్ ఆడియో ఇచ్చారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఆడియో నా సినిమాల్లో బెస్ట్ ఆడియో. ఈ సినిమాలో మ్యూజిక్ దానికి మించి ఉంటుంది. నా కెరీర్ లో బెస్ట్ సాంగ్స్ గా నిలిచిపోతాయి. శ్రీకాంత్ అడ్డాల అంటే నాకు చాలా ఇష్టం. ప్యూర్ హ్యూమన్ బీంగ్. ఆయన ఇండస్ట్రీ వాళ్ళతో పెద్దగా కలవరు. అందుకే అంత ప్యూర్ గా ఉంటారనుకుంట(నవ్వుతూ). ఆయన కథలు రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ లానే ఉంటాయి. ఆయనతో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేశాను. 'బ్రహ్మోత్సవం'తో మరో స్థాయికి ఎదిగాననిపించింది. శ్రీకాంత్ తో మరిన్ని సినిమాలు చేయాలనుంది. పివిపి గారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. శ్రీకాంత్, రత్నవేలు అడిగింది కాదనకుండా ఇచ్చారు. నా కెరీర్ లో నన్ను ఇంతగా ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు. మే 20న బ్రహ్మోత్సవాలు మొదలవబోతున్నాయి'' అని చెప్పారు.
శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో ఎక్కువ మంది ఆర్టిస్ట్స్ ఉన్నారు. నాకు మొదట ఎలా హ్యాండిల్ చేయాలి..? నేను చేయగలనా..? అనే అనుమానాలు కలిగేవి. కాని ఒకేఒక్కటి నన్ను ముందుకు నడిపించేది. అదే మహేష్ బాబు గారు నవ్వు. నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆయనతో రెండోసారి కలిసి వర్క్ చేయడం. బ్రహ్మోత్సవం టైటిల్ పెట్టినప్పుడు తిరుపతి వెంకటేశ్వరస్వామి పాదాలను దృష్టిలో పెట్టుకొని అంతే వినయంగా ఉండాలని భావించాను. రత్నవేలు గారు నా మనసులో ఉన్న కథకు రూపమిచ్చారు. మిక్కి మ్యూజిక్ ఈ సినిమాకు సోల్. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
మిక్కి జె మేయర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ఆడియో కోసం చాలా నెలలుగా పని చేశాం. నాకు సపోర్ట్ చేసిన సింగర్స్ కు, మ్యూజిషియన్స్ కు థాంక్స్. అలానే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు. సీతారామశాస్త్రి గారు మంచి సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల గారు ఒక పాట రాశారు. పాటలు, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
రత్నవేలు మాట్లాడుతూ.. ''శ్రీకాంత్ గారు బ్రిలియంట్ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఈ సినిమాతో మంచి అనుభవం కలిగింది. ముగ్గురు అందమైన హీరోయిన్స్ ఉన్నారు. జయసుధ, సత్యరాజ్, రావు రమేష్ లాంటి సీనియర్ నటులున్నారు. సంప్రదాయ విలువలను నాగరికతను జోడిస్తే ఎలా ఉంటుందే అదే ఈ సినిమా. మిక్కీ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. తోట తరణి గారి ఆర్ట్ అధ్బుతంగా ఉంటుంది. గత ఇరవై సంవత్సరాలలో నా కెమెరా అందంగా క్యాప్చుర్ చేసిన వ్యక్తి ఎవరంటే అది మహేష్ బాబు గారు. పివిపి ఫిలిం లవర్. ఎంతో ప్యాషన్ తో సినిమాలు నిర్మిస్తారు''అని చెప్పారు.
తోట తరణి మాట్లాడుతూ.. ''మంచి టీం తో కలిసి వర్క్ చేశాను. టెక్నీషియన్స్ అందరు కష్టపడి పని చేశారు. రత్నవేలు నా ఆర్ట్ ను చాలా అందంగా చూపించారు'' అని చెప్పారు.
సమంత మాట్లాడుతూ.. ''బ్రహ్మోత్సవం సినిమాతో శ్రీకాంత్ గారు హ్యాట్రిక్ హిట్ కొట్టాలి. ప్రేక్షకులకు ఈ సినిమా ఉత్సవంలా ఉంటుంది'' అని చెప్పారు.
కాజల్ మాట్లాడుతూ.. ''మంచి టెక్నీషియన్స్ తో కలిసి పని చేశాను. సినిమా షూటింగ్ చేస్తున్నంతసేపు బ్యూటిఫుల్ లైఫ్ లా అనిపించింది. మహేష్ బాబుతో రెండోసారి కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఇది మంచి సినిమా అవుతుంది'' అని చెప్పారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ''టీజర్ చాలా బావుంది. విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. శ్రీకాంత్ తన మూడు సినిమాలతో ఒక మార్క్ వేసుకున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మల్టీస్టారర్ ట్రెండ్ మొదలుపెట్టాడు. మహేష్ బాబు ప్యాషన్, గట్స్ ఉన్న హీరో. ఒక హీరోకి సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చిన తరువాత ఇలాంటి సినిమాలే చేయాలని ఓ గీత రాసుకుంటారు. కాని మహేష్ ఆ గీతను దాటి శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు చేయొచ్చని కొత్త గీత రాస్తాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఫీస్ట్ అవుతుంది'' అని చెప్పారు.
జయసుధ మాట్లాడుతూ.. ''శ్రీకాంత్ గారితో నాకు ఇది మూడవ సినిమా. అందరు చాలా బాగా చేశారు. మిక్కి అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు'' అని చెప్పారు.
రేవతి మాట్లాడుతూ.. ''సినిమా టైటిల్ లానే షూటింగ్ కూడా ఉత్సవంలా జరిగింది. అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
సత్యరాజ్ మాట్లాడుతూ.. ''అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఫ్యామిలీ, లవ్, సెంటిమెంట్ అన్ని సమపాళ్ళలో ఉంటాయి. మ్యూజిక్, సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పరుచూరి బ్రదర్స్, ప్రణతి, రావు రమేష్, నరేష్, పివిపి, సుదీర్ బాబు, నమ్రత తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్, ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ ఆర్ట్: తోట తరణి, నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.