ముగ్గురు పంపిణీదారులు తనపై దాడీ చేసారంటూ.. దర్శకుడు పూరి జగన్నాథ్ శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. గతంలో పూరి జగన్నాథ్ 'లోఫర్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్, సుదీర్, ముత్యాల రామదాసు తనను ఇబ్బందికి గురి చేస్తున్నారని పూరి వారిపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తమపై ఇలాంటి కేసు పెట్టడం సరికాదని, అసలు పూరి జగన్నాథ్ పై ఎలాంటి దాడి చేయలేదని డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వారు ప్రత్యేకంగా విలేకర్ల సమావేశాన్ని పెట్టి వెల్లడించారు. ఈ సందర్భంగా..
ముత్యాల రామదాసు మాట్లాడుతూ.. ''పూరి జగన్నాథ్ గారితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. దర్శకుడు అనేవాడు నిర్దేశకుడు. పోలీస్ ఆఫీసర్స్ ఫ్రెండ్స్ అని ఎటువంటి తప్పు చేయని మాపై ఆరోపణలు చేయడం, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదు. నేను ఆయనను కలిసి రెండు నెలల పైనే అయింది. అలాంటిది నేను వెళ్లి ఆయన్ను కొట్టాను అనడంలో నిజంలేదు. నిజంగా అంతపని చేస్తే ఫిలిం ఛాంబర్ ఉంది.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది.. వీటిలో పిర్యాదు చేయడం మానేసి వివాదమనేది లేకుండా.. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం సరికాదు. 'లోఫర్' చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ వారు నైజాంలో, నేను ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూట్ చేశాం. నైజాంలో అభిషేక్ గారికి రెండున్నర కోట్లు నష్టం రావడంతో ఆ విషయాన్ని పూరి గారికి చెప్పాం. కళ్యాణ్ గారితో మాట్లాడమని ఆయన చెప్పారు. అది మూడు నెలల క్రిందట జరిగిన విషయం. ఆ తరువాత మేము పూరి గారితో మాట్లాడలేదు. ఆయనను కలవడానికి కూడా వెళ్ళలేదు'' అని చెప్పారు.
సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ''డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఇరవై శాతం మాత్రమే రిస్క్ ఫ్యాక్టర్ తీసుకుంటాడు. యాభై శాతం నష్టం వస్తే ఖచ్చితంగా నిర్మాత కానీ.. దర్శకుడు కానీ.. హీరో కానీ.. వారి నష్టాన్ని భర్తీ చేయాలి. నిర్మాత కూడా నేను నష్టాల్లో ఉన్నాను అని చెప్పినప్పుడు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు దర్శకుడి దగ్గరకే వెళ్తాడు. అయితే మా పంపిణీదారులు మాత్రం పూరి దగ్గరకు వెళ్ళలేదు. ఆయన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. వాటిని చెక్ చేసి నిజంగానే మా పంపిణీదారులు ఆయనపై దాడి చేసారంటే శిక్ష వేయండి. కాదని తెలిస్తే పూరిపై యాక్షన్ తీసుకోవాలి. ఆధారాలు లేకుండా పోలీసులు కేసులు ఎలా పెడతారు'' అని అన్నారు.
అభిషేక్ మాట్లాడుతూ.. ''నాకు సినిమా అమ్మింది సి.కళ్యాణ్ గారు. ఈ సినిమా ద్వారా ఒక్క రూపాయి కూడా పోదని ఆయన చెప్తేనే నేను సినిమా కొన్నాను. అయితే నాకు సగానికి సగం నష్టం వచ్చింది. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కంప్లైంట్ కూడా చేశాను. సడెన్ గా నిన్న మేము పూరి జగన్నాథ్ గారి మీద దాడి చేశామని వార్తలు వచ్చాయి. నేను సి.కళ్యాణ్ గారికి ఫోన్ చేసి చెప్పగానే.. ఆయన నేను ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్తానని చెప్పారు. అలానే సినిమాకు వచ్చిన నష్టం గురించి కూడా నేనే చూసుకుంటానని చెప్పారు'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వీరినాయుడు. హనుమంతరెడ్డి, సుదీర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.