పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి కాశీ తువ్వాలు ప్రత్యేకమైందిప్పుడు. మొన్నటిదాకా తుండుగుడ్డ అనేవాళ్లు ఇప్పుడు ఇష్టంగా గబ్బర్‌సింగ్ తువ్వాలు అని పిలుచుకొంటున్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా విడుదల రోజైతే ఎవరి దగ్గర చూసినా అదే. ఖాకీ డ్రెస్సుపై పవన్ ఆ ఎర్రటి గుడ్డ వేసుకోవడం ప్రత్యేకంగా అనిపించింది. అసలు సిసలు మాస్ అవతారానికి ప్రతీకగా నిలిచింది. సినిమాలో ఆ తువ్వాలు వాడటం పవన్ ఐడియానేనట. ఖాకీ డ్రెస్సుపై ఏదో ఒకటి స్పెషల్ ఐటెమ్ ఉండాలని అనుకొన్నప్పుడు పవన్‌కి కాశీ తువ్వాలు ఐడియా వచ్చిందట. వెంటనే కాస్ట్యూమ్స్ జాబితాలో దాన్నీ చేర్చేశాడన్నమాట. అయితే పవన్‌కి కాశీ గుడ్డే ఎందుకు గుర్తుకొచ్చిందన్నదే కొశ్చెను. అదే ప్రశ్నని ఓ ఇంటర్వ్యూలో పవన్ దగ్గర ప్రస్తావించినప్పుడు ఆసక్తికరమైన సమాధానం చెప్పుకొచ్చాడు. ఆ రకమైన తువ్వాళ్లు తన చిన్నప్పుడు పవన్ ఇంట్లో బోలెడన్ని వుండేవట. అవి ఆయన్ని ప్రత్యేకంగా ఆకర్షించేవట. ఆ తువ్వాలు గుర్తుకు రావడంతో వాడేశానని చెప్పుకొచ్చాడు.
అయితే మీ ఇంట్లో ఎందుకు ఆ తువ్వాళ్లు ఎక్కువగా వుండేవని అడిగినప్పుడు పవన్ నిర్మొహమాటంగా సమాధానం చెప్పుకొచ్చాడు. ``మా ఇంటికి నా చిన్నప్పుడు బంధువులు ఎక్కువగా వచ్చేవారు. తుడుచుకోవడానికి తువ్వాళ్లు సరిపోయేవి కావు. అందుకే తక్కువ ధరలో దొరుకుతాయికదా అని కాశీ తువ్వాళ్లు లాటుగా తీసుకొచ్చేవారు. వచ్చిన బంధువులకి ఆ తువ్వాళ్లు ఇచ్చేవారు`` అని ఓపెన్‌గా చెప్పుకొచ్చాడు పవన్. ఆ సమాధానంలో పవన్ సింప్లిసిటీ ఏంటో అర్థమవుతోంది. అంత పెద్ద స్టార్ అయినా తాను మధ్య తరగతి జీవితం నుంచి వచ్చినవాణ్నని చెప్పుకోవడానికి పవన్ ఏమాత్రం మొహమాటం పడటం లేదన్న విషయం అర్థమవుతోంది.
Advertisement
CJ Advs